దేవాలయ భూముల నుంచి లక్షన్నర ఎకరాలకు మోక్షం!

దేవాలయ భూముల నుంచి లక్షన్నర ఎకరాలకు మోక్షం!

దేవుడి భూముల్లో 1.5 లక్షల ఎకరాల పేదల ఆస్తులను నిషేధిత జాబితా నుంచి తొలిగించే ప్రక్రియను త్వరలోనే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేపట్టనుంది. 2011లో దేవాదాయ శాఖకు చెందిన భూములను నిషేధిత జాబితాలో చేర్చే కార్యక్రమంలో ఇతరులకు చెందిన భూములను కూడా ఇందులోకి చేర్చారు. దీంతో యాజమానులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఆ భూముల తమవంటూ సంబంధిత పత్రాలతో ఎంతోమంది భూ యజమానులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వాటికి ఎన్వోసీ (నిరభ్యంతర ధ్రువపత్రం) జారీ చేసేందుకు అధికారలు అలసత్వం వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ అంశంపై ఆరా తీయగా 1.5 లక్షల ఎకరాలకు పైనే ఉన్నాయని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. 

అయితే రాష్ట్రంలో దేవాదాయ శాఖ పరిధిలోని మఠాలు, దేవాలయాల, ఇతర సంస్థలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కలిపి మొత్తంగా 27,748 ఉన్నాయి. ఈ సంస్థలకు వ్యవసాయ భూమి, గుట్టలు, కొండలు తదితరాలతో కలిపి 4.67 లక్షల ఎకరాల భూమిని కలిగి ఉన్నాయి. ఇందులో వ్యవసాయేతర భూముల విషయానికి వస్తే 9.05 లక్షల చదరపు గజాలు ఉందని నిర్ధారించారు.

ఉదాహరణకు సర్వే నంబర్ 42లో 20 ఎకరాలుంటే ఇందులో 42/1లో ఆలయానికి 4 ఎకరాలే ఉందని అనుకుందాం. అంటే నాలుగు ఎకరాలు మాత్రమే నిషేధిత జాబితాలో చేర్చాలి. కానీ సబ్‌డివిజన్‌ పేర్కొనకుండా సర్వే నంబర్ 42ని నిషేధిత జాబితాలో అధికారులు చేర్చేశారు. దీంతో ఇతరులకు చెందిన 16 ఎకరాలు విక్రయించుకోలేని పరిస్థితి. ఈ క్రమంలోనే 2016లో మరోసారి నిషేధిత జాబితా పరిశీలించి, తప్పులు సరిచేసేందుకు అవకాశమిచ్చారు.

ఆ సమయంలో చాలాచోట్ల పొరపాట్లను సరిచేయకపోవడంతో పాటు అదనంగా మరికొన్ని భూములను చేర్చారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి రావడంతో పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల రిజిస్ట్రేషన్‌ శాఖ ప్రధాన కార్యాలయం నుంచి నిషేధిత జాబితాలో ఉన్న దేవాలయ భూముల వివరాలు సేకరించారు. ఇందులో లక్షన్నర ఎకరాలకు పైగా ఇతరులకు సంబంధించిన భూములను చేర్చినట్లు తేలింది. 

దీంతో జిల్లాల్లో ఆలయాల వారీగా సర్వే నంబర్లతో సహా వాటి ఆస్తుల వివరాలు, నిషేధిత జాబితాలో ఉన్న భూములతో అధికారులు సరిపోల్చనున్నారు. ఈ అంశంపై వచ్చే వారం దేవాదాయ శాఖ కమిషనర్‌ రామచంద్రమోహన్‌ సమీక్ష నిర్వహించనున్నారు. పరిశీలన పూర్తయ్యాక సీసీఎల్‌ఏ అధికారులు, సీఎస్తో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.