ఇరాన్, అమెరికా – ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం భారత ఇంధన రంగంపై స్పష్టంగా కనిపిస్తోంది. వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరాలో సవాళ్లు ఎదురవుతున్నాయని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ఒప్పుకుంటోంది. ఇక ఇళ్లకు సప్లై అయ్యే ఎల్‌పీజీ వంటగ్యాస్ ధర పెరిగింది. ఈ సిలిండర్ల డెలివరీలో జాప్యం జరుగుతోందని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
పశ్చిమాసియా యుద్ధం ఇప్పటికిప్పుడు ముగిసే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర సర్కారు ఎల్‌పీజీకి ప్రత్యామ్నాయంగా మళ్లీ కిరోసిన్‌ను రంగంలోకి దించుతోంది.
కిరోసిన్‌పై ఇచ్చే సబ్సిడీని 2021 ఏప్రిల్ 1 నుంచి పూర్తిగా ఎత్తివేసిన కేంద్రం, ప్రస్తుత ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు రాష్ట్రాలకు రెగ్యులర్‌గా ఇచ్చే 1 లక్ష కిలోలీటర్లకు అదనంగా మరో 40వేల కిలోలీటర్ల కిరోసిన్‌ను కేటాయిస్తున్నట్లు శనివారం కేంద్ర చమురుశాఖ వెల్లడించింది. రాష్ట్రాలకు కిరోసిన్ కోటాను పెంచడం దాదాపు 8 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. రిటైల్ దుకాణాలు, రేషన్ షాపుల ద్వారా కిరోసిన్ పంపిణీకి యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
గతంలో మనదేశంలోని రేషన్ షాపులలో కిరోసిన్‌ను రాయితీ ధరపై విక్రయించేవారు. మోదీ సర్కారు దేశంలో ఎల్‌పీజీ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు 2016 మేలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పిఎంయువై) స్కీంకు శ్రీకారం చుట్టింది. దీని ద్వారా 2023-24 నాటికి దేశంలోని 13 రాష్ట్రాలు కిరోసిన్ రహితంగా మారాయి. హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో 2017 జూన్ 1 నుంచే కిరోసిన్ సరఫరాను ఆపేశారు.
ప్రస్తుతం చాలామంది ఇళ్లలో కిరోసిస్ స్టవ్‌లే లేవు. అలాంటప్పుడు కిరోసిన్‌ను ఎందుకు తీసుకుంటారు? రేషన్ షాపుల ద్వారా కిరోసిన్‌ను పంపిణీ చేయబోయేది, ప్రజల అత్యవసర ఇంధన అవసరాలను తీర్చేందుకు మాత్రమే. కేవలం కొన్నివారాల కోసం కొత్త కిరోసిన్ స్టవ్‌ను కొనడం అనేది పేద, దిగువ మధ్యతరగతి వర్గాల ప్రజలకు ఆర్థిక భారంగా మారుతుంది. ప్రస్తుత పరిస్థితిని అదునుగా చేసుకొని మార్కెట్‌లో ఆ స్టవ్‌లను అధిక ధరలకు విక్రయించే ప్రయత్నాలు జరగొచ్చు.
ఎల్‌పీజీ కొరత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గృహ వినియోగ గ్యాస్ పంపిణీకి తొలి ప్రాధాన్యత ఇస్తోంది. దీంతో కమర్షియల్ గ్యాస్ సరఫరాను భారీగా తగ్గించేసింది. ఈ పరిస్థితుల్లో హోటళ్లు, రెస్టారెంట్లకు ప్రభుత్వం పలు తాత్కాలిక వెసులుబాట్లు కల్పించింది. వంట తయారీ అవసరాలకు బొగ్గు, బయోమాస్, ఆర్‌డీఎఫ్ పెల్లెట్ల వినియోగానికి అనుమతులు ఇచ్చింది.

More Stories
అగమ్యగోచరంగా ఉన్న పాకిస్థాన్ కు ఐఎంఎఫ్ మొండిచెయ్యి!
వాణిజ్య ఎల్‌పీజీ సీలిండర్ల పంపిణి తిరిగి ప్రారంభం
అమెరికాతో వాణిజ్య ఒప్పందం రద్దు ప్రచారంలో నిజం లేదు