భారీ నష్టాల్లో భారత స్టాక్ మార్కెట్లు

భారీ నష్టాల్లో భారత స్టాక్ మార్కెట్లు
 
భారత మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో కొనసాగాయి. సెన్సెక్స్ ఏకంగా 1360 పాయింట్లు నష్టపోయింది. దీంతో 75,000 పాయింట్ల దిగువకు సెన్సెక్స్ పడిపోయింది. నిఫ్టీ 50 కూడా 400 పాయింట్లు నష్టపోయింది. 23,144 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్, నిఫ్టీ 50 ఇండెక్స్ నష్టాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద ఏకంగా ఈ ఒక్కరోజే రూ.9 లక్షల కోట్లు నష్టపోయింది.

సెన్సెక్స్ 30 సూచీలో ట్రెంట్, భారతీ ఎయిర్‌టెల్, హిందుస్తాన్ యునీలీవర్ మాత్రమే స్వల్ప లాభాల్లో కొనసాగుతుండగా, మిగతా షేర్లు నష్టాల బాటలోనే ఉన్నాయి. నిఫ్టీ 50 సూచీలో హిందాల్కో ఇండస్ట్రీస్, టాటా స్టీల్, లార్సెన్ అండ్ టర్బో, టాటా మోటార్స్ వంటి కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి.  మిడిల్ ఈస్ట్ యుద్ధం, చమురు సంక్షోభం, ధరల పెరుగుదల వంటివి నేటి మార్కెట్ పతనానికి కారణాలు. విదేశీ ఇన్వెస్టర్లు ఒత్తిడికి గురై అమ్మకాలకు పాల్పడ్డారు.

అయితే, దేశీయ ఇన్వెస్టర్లు మాత్రం మార్కెట్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లు విపరీతమైన ఒత్తిడిలో ఉన్నాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర బ్యారెల్‌కు 100 డాలర్లను దాటడంతో భారత్‌ వంటి చమురు దిగుమతి దేశాలపై అదనపు ఆర్థిక ఒత్తిడి ఏర్పడింది. దీనివల్ల మార్కెట్‌ సెంటిమెంట్‌ బలహీనపడింది. 

అయితే, అనిశ్చిత పరిస్థితుల్లో కూడా పవర్‌ గ్రిడ్‌, ఎన్‌టీపీసీ, హిందుస్థాన్‌ యూనీలీవర్‌, ఐటీసీ వంటి డిఫెన్సివ్‌ షేర్లు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. రూపాయి బలహీనత కారణంగా ఎగుమతులపై ఆధారపడే ఫార్మా రంగం కూడా కొంత స్థిరత్వాన్ని చూపుతోంది.  బ్యాంకింగ్ షేర్లు భారీ నష్టాల్లో ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు ఏకంగా 2 శాతం వరకు, ఎస్బీఐ షేర్లు 2.3 శాతం వరకు నష్టపోగా, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు కూడా నష్టాల్లోనే కొనసాగుతున్నాయి.

మెటల్, ఇన్‌ఫ్రా షేర్లు ఎక్కువగా అమ్మకాలు జరుగుతున్నాయి. మరోవైపు డాలర్‌తో రూపాయి మారకం విలువ బాగా పడిపోయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 92.47 వద్ద ట్రేడవుతోంది. ఇరాన్‌, అమెరికా, ఇజ్రాయెల్‌ మధ్య పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా హార్ముజ్‌ జలసంధి ద్వారా జరిగే చమురు రవాణా అంతరాయం కలగవచ్చన్న భయం మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.

డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రికార్డు స్థాయిలో 92.37కు పడిపోవడం పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బతీసింది. బలమైన డాలర్‌ ప్రభావం కూడా మార్కెట్లపై కనిపిస్తోంది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా షేర్లను విక్రయిస్తూ భారత మార్కెట్‌ నుంచి నిధులను ఉపసంహరించుకోవడం కూడా సూచీల పతనానికి కారణమైంది.