పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్కు వైవిధ్యభరిత మార్గాల ద్వారా భారత్కు ఇప్పటికీ ముడి చమురు సరఫరా సురక్షితంగా జరుగుతోందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ వెల్లడించారు. భారత్ రోజూ 55 లక్షల బ్యారెళ్ల ముడి చమురును వినియోగిస్తుందని, వైవిధ్యభరిత మార్గాల ద్వారా ఇప్పుడు మన దేశానికి చేరుతున్న ముడి చమురు మోతాదు హర్మూజ్ జలసంధి మీదుగా వచ్చే దాని కంటే ఎక్కువగానే ఉందని తెలిపారు.
భారత గ్యాస్ కంపెనీలు కొత్త చోట్ల నుంచి ఎల్ఎన్జీ కార్గోలను కొనుగోలు చేశాయని ఆమె చెప్పారు. మిడిల్ ఈస్ట్ సైనిక ఘర్షణల్లో ఇద్దరు భారతీయులు చనిపోయారని, ఒకరి ఆచూకీ గల్లంతైందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. ప్రవాస భారతీయుల భద్రతకే తాము అధిక ప్రాధాన్యత ఇస్తామని ఆయన స్పష్టం చేశారు.
“పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల గల్ఫ్ దేశాల నుంచి భారత్కు ఎల్పీజీ సప్లైలపై ప్రభావం పడింది. దీంతో వంటగ్యాస్ ధరలు గణనీయంగా పెరిగాయి. ఈ పెరుగుదలలో చాలా భాగాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. వినియోగదారుల పరిరక్షణ కోసం ఈ చర్యలు చేపడుతోంది. ఎల్పీజీ ఉత్పత్తిని పెంచమని రిఫైనరీలను ఆదేశించాం” అని సుజాత శర్మ తెలిపారు.
“ప్రస్తుతానికి ఎల్పీజీ నిల్వలను ఇళ్లు, వ్యాపార సంస్థలకు పంపిణీ చేసేందుకే వినియోగిస్తున్నాం. ఇక నాన్ – డొమెస్టిక్ విభాగంలోని ఎల్పీజీ సరఫరా విషయంలో ఆస్పత్రులు, విద్యా సంస్థలు వంటి వాటికి ప్రాధాన్యం ఇస్తున్నాం. తాత్కాలికంగా వంటగ్యాస్ సప్లైలో అవాంతరాలను నివారించేందుకు, ఎల్పీజీ గ్యాస్ బుకింగ్ కనీస వ్యవధిని 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచాం. ప్రస్తుత పరిస్థితుల్లో వెంటవెంటనే గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకునేందుకు త్వరపడొద్దని ప్రజలను కోరుతున్నాం” అని చెప్పారు.
“ప్రస్తుతం రెండు ఎల్ఎన్జీ గ్యాస్ కార్గోలు భారత్కు వస్తున్నాయి. అవి మార్గం మధ్యలో ఉన్నాయి. సహజ వాయువు (ఎల్ఎన్జీ) కేటాయింపు విషయంలో టీ తయారీ రంగం, గ్యాస్ గ్రిడ్ కార్యకలాపాలు, వీటి అనుబంధ రంగాలు, ఎరువుల తయారీ యూనిట్లకు పెద్దపీట వేస్తాం” అని తెలిపారు.
“కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీ దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమ విభాగాలతో సమన్వయం చేసుకుంటోంది. ఎల్పీజీ సరఫరా పారదర్శకంగా, న్యాయంగా జరిగేలా పర్యవేక్షిస్తోంది. ఇక దాదాపు 40 దేశాల నుంచి ముడి చమురును భారత్ కొనుగోలు చేస్తోంది. ఇప్పుడు కూడా భారత్లోని అన్ని ఆయిల్ రిఫైనరీలు పూర్తి సామర్ధ్యంతోనే పనిచేస్తున్నాయి. కొన్ని రిఫైనరీలైతే సామర్థ్యంపై మించి పని చేస్తున్నాయి” అని ఆమె వివరించారు.

More Stories
అయోధ్య, షిర్డీలను తాకిన వంటగ్యాస్ కొరత
అమెరికాలో రిలయన్స్ 300 బిలియన్ డాలర్లతో ఆయిల్ రిఫైనరీ
ఇండిగో సీఈవో పీటర్ ఎల్బెర్స్ రాజీనామా