గ్యాస్ కొరత నియంత్రణపై భారత్ వ్యూహాత్మక ప్రణాళిక

గ్యాస్ కొరత నియంత్రణపై భారత్ వ్యూహాత్మక ప్రణాళిక
దేశంలో చమురు ధరల నియంత్రణపై, గృహ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని ఒక వ్యూహాత్మక ప్రణాళికను భారత ప్రభుత్వం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితోపాటు, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌తో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం జరిపిన  భేటీలో  ఇరాన్ యుద్ధం సామాన్యులపై ప్రభావం చూపకూడదని తెలిపారు.
 
ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం, చమురు సంక్షోభం, ధరల నియంత్రణ, చమురు నిల్వలు, సరఫరా వంటి అంశాలపై వీరు చర్చించారు. ప్రధానంగా ఎల్పీజీ ధరల పెరుగుదలపై చర్చించినట్లు సమాచారం. ప్రస్తుతం దేశాన్ని చమురు ధరల అంశం కలవరపెడుతోంది. ఇరాన్ యుద్ధం, గల్ఫ్‌ దేశాలపై దాడులు, హోర్ముజ్ జలసంధి మూసివేత వంటి కారణాలతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతున్నాయి. 
 
భారత్ లో కూడా పెట్రోల్, డీజీల్, ఎల్పీజీ వంటి గ్యాస్ ధరలు భారీగా పెరుగుతాయనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఎల్పీజీ ధరలు స్వల్పంగా పెరిగాయి. వాణిజ్య సిలిండర్ల వినియోగంపై ఆంక్షలు మొదలయ్యాయి. డిమాండ్‌కు సరిపడా ఇరాన్ యుద్ధం ఇంకా కొనసాగితే ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో ప్రజలపై ఆర్థిక భారం పెరిగే అవకాశం ఉంది.

దేశంలో గ్యాస్ సరఫరా పరిస్థితిని సమీక్షించేందుకు, వాణిజ్య ఎల్పీజీ సరఫరాలో అంతరాయం కారణంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఆతిథ్య రంగ సమస్యలను పరిష్కరించేందుకు ముగ్గురు సభ్యుల కమిటీని కేంద్రం నియమించింది. ఈ కమిటీ సరఫరాలో ఏర్పడిన అంతరాయం తీవ్రతను అంచనావేసి హోటల్‌, రెస్టారెంట్‌ అసోసియేషన్లతో చర్చలు జరుపుతుంది.

అసలైన వాణిజ్య వినియోగదారుల అవసరాలను తీర్చేందుకు తగిన చర్యలు తీసుకుంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కమిటీలో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐఓసీ), భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌(బీపీసీఎల్‌), హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌(హెచ్‌పీసీఎల్‌)కు చెందిన ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు సభ్యులుగా ఉంటారు. కాగా, ఎల్పీజీ అక్రమ నిల్వ, అవకతవకలను నివారించడానికి అదనంగా పాలనాపరమైన చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ప్రస్తుతం దేశంలో గృహ అవసరాలకు ఉపయోగించే వంట గ్యాస్ సరఫరాకే కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. గ్లోబల్ ఇంధన సరఫరాలో ఏర్పడిన అంతరాయం కారణంగా గ్యాస్ వినియోగంపై నియంత్రణ అవసరమైందని ప్రభుత్వం చెబుతోంది. దీనివల్ల మార్కెట్ ధరలకు అందించే వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరా కొన్ని నగరాల్లో తీవ్రంగా తగ్గింది.

8 రాష్ట్రాల్లో వాణిజ్య ఎల్పీజీ సరఫరాపై తాత్కాలిక నిషేధం

మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఢిల్లీ సహా అనేక రాష్ర్టాల్లో వాణిజ్య ఎల్పీజీ సరఫరాపై తాత్కాలిక నిషేధం అమలులోకి వచ్చింది. ఈ నిషేధంతో అనేక నగరాల్లోని రెస్టారెంట్లు, హోటళ్లు మూతపడగా సరఫరాను పునరుద్ధరించాలంటూ హోటల్‌ యజమానులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు.

తగినంతగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరా లేకపోతే రెస్టారెంట్లకు సంబంధించి రోజుకు రూ.1,200 కోట్ల నుంచి రూ.1,300 కోట్ల వరకు నష్టం జరిగే అవకాశం ఉందని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఆర్‌ఏఐ) వైస్ ప్రెసిడెంట్ జోరావర్ కర్లా తెలిపారు. ప్రస్తుతం రెస్టారెంట్లకు తగినంతగా ఎల్పీజీ సిలిండర్ల సరఫరా లేదని, 75 శాతం వరకు రెస్టారెంట్లు వీటిపైనే ఆధారపడ్డాయని ఆయన చెప్పారు.

 సరఫరా సంక్షోభం కొనసాగితే మనం తినే మసాలా దోస నుంచి మిరపకాయ బజ్జీ దాకా ఆహార పదార్థాలన్నీ ఖరీదైనవిగా మారిపోయే అవకాశం ఉంది. ఇప్పటికీ చాలా రెస్టారెంట్లలో పీఎన్‌జీ కనెక్షన్లు లేదా విద్యుత్తు వంట వ్యవస్థలు వంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేవు.  చమురు సరఫరాపై దేశ ప్రజల్లో ఆందోళన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. దేశీయ అవసరాలకు తగ్గట్లుగా చమురును 40 దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 

గతంలో 27 దేశాల నుంచే చమురును కొనుగోలు చేయగా, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో 40 దేశాల నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నట్లు కేంద్రం వెల్లడించింది.  ఈ అంశంపై ఇప్పటికే చమురు సరఫరా దేశాలతో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి సంప్రదింపులు జరిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వీలైనంత త్వరగా చమరు సరఫరా చేయాలని కోరినట్లు సమాచారం. కొన్ని దేశాలు ఇప్పటికే సరఫరా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

మరోవైపు, పరిశ్రమల నుంచి గ్యాస్‌ను మళ్లించడం ద్వారా ప్రజలకు గ్యాస్ కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ఇరవై ఒక్క రోజుల తర్వాత బుకింగ్‌లు జరిగేవి, ఇప్పుడు25 రోజులకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అలానే ఎల్పీజీ ఉత్పత్తిని 10 శాతం పెరిగిందని కేంద్ర వర్గాలు తెలిపాయి.

గతంలో దాదాపు రెండున్నర లేదా మూడు రోజుల్లో వినియోగదారులకు గ్యాస్ సరఫరా జరిగేది. ప్రస్తుత పరిస్థితుల్లో కూడా అదే సమయం పడుతుందని వర్గాలు తెలిపాయి. అన్ని శుద్ధి కర్మాగారాలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి, దేశవ్యాప్తంగా ప్రతిరోజూ దాదాపు 60 లక్షల సిలిండర్లు సరఫరా అవుతున్నాయని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి.
ఎస్మా ప్రయోగించిన కేంద్రం

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో, దేశంలో సహజ వాయువు సరఫరాకు ఆటంకం కలగకుండా కేంద్రం  అత్యవసర వస్తువుల చట్టాన్ని అమలు చేసింది. దేశంలో వం ట గ్యాస్ సరఫరా నిలిచిపోకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపా రు. ఇప్పటివరకు వాహనాలకు ఉపయోగించే సిఎన్‌జి, ఇళ్లకు పైప్ ద్వారా వచ్చే గ్యాస్ ఈ రెండింటిని మాత్రమే ప్రా ధాన్యత రంగాలుగా నిర్ణయించారు. 

ఇప్పుడు వం ట గ్యాస్‌ను కూడా ప్రాధాన్య జాబితాలో చేర్చారు. సిఎన్‌జి, ఎల్‌పిజి మొదటి ప్రాధాన్యతగా నిర్ణయించగా, దీనిని గత 6 నెలల సగటు వినియోగానికి సమానంగా గ్యాస్ అందించాలనే ఆదేశాలు జారీ చేశారు. రెండోది ఎరువుల కర్మాగారాలకు 70 శాతం గ్యాస్ అందించనున్నారు. మూడో సె క్టార్ విషయానికొస్తే, టీ పరిశ్రమలు, ఇతర కర్మాగారాలకు 80% సరఫరా చేయాలని నిర్ణయించారు. వంట గ్యాస్ కొరత రాకుండా ముందస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర అధికారులు వెల్లడించారు.

భారత్‌లో సుమారు 33.8 కోట్ల మంది ఎల్పీజీ వనియోగదారులు ఉన్నారు. యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరిగినా లేదా సరఫరా తగ్గినా, దేశీయంగా ఇబ్బందులు రాకూడదని ప్రభుత్వం భావిస్తోంది. ఎస్మా వల్ల గ్యాస్ సిలిండర్ల డెలివరీలో లేదా పెట్రోల్ బంకుల్లో ఇంధన లభ్యతలో ఎటువంటి జాప్యం ఉండదు.

చమురు నిల్వల్లో జీ7 దేశాలకు దూరం 

కాగా, భారత్ తన ఇంధన భద్రత విషయంలో రాజీపడకూడదని నిర్ణయించుకుంది. జీ7 దేశాలు తమ వ్యూహాత్మక నిల్వలను ఉపయోగించి మార్కెట్‌ను స్థిరీకరించాలని చూస్తున్న నేపథ్యంలో భారత్ మాత్రం ఆ ప్రయత్నంలో భాగస్వామి కావడం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతానికి అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ)కు వ్యూహాత్మక చమురు నిల్వల గురించి చెప్పే యోచన లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 

అంతర్జాతీయంగా ధరలను తగ్గించడానికి ఈ నిల్వలను వాడాలని జీ7 దేశాలు భావిస్తున్నప్పటికీ, భారత్ మాత్రం తన సొంత ప్రయోజనాలకే పెద్దపీట వేస్తుంది. భారత్‌కు విశాఖపట్నం, మంగళూరు, పడూరులో మొత్తం 5.33 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన చమురు నిల్వ కేంద్రాలు ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో దేశీయ అవసరాల కోసం వీటిని భద్రపరిచామని, ప్రస్తుత అంతర్జాతీయ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి వీటిని వాడబోమని అధికారులు స్పష్టం చేశారు.