ఓంబిర్లాపై అవిశ్వాసం.. అధికార, ప్రతిపక్షాల మాటల యుద్ధం!

ఓంబిర్లాపై అవిశ్వాసం.. అధికార, ప్రతిపక్షాల మాటల యుద్ధం!
స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం సందర్భంగా లోక్‌సభలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది.  లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు విశ్వసనీయత లేదని, ఆయనను పదవి నుంచి తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. ఈ మేరకు ప్రతిపక్ష పార్టీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో మంగళవారం చర్చ జరిగింది.  ఓం బిర్లాను పెద్ద మనిషిగా కొనియాడుతూనే విపక్షంపై ఆయన తీసుకున్న కఠిన చర్యలను ప్రతిపక్ష సభ్యులు ఎండగట్టారు.
ఈ ఆరోపణను ఖండించిన అధికార కూటమి విపక్ష సభ్యుల అరాచక ప్రవర్తనను అడ్డుకునేందుకే స్పీకర్‌ అలా ప్రవర్తించారని చెప్పారు. స్పీకర్‌ ఓం బిర్లా అధికార పార్టీకి అనుకూలంగా, ప్రతిపక్షానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, అందువల్ల ఆయన విశ్వసనీయతను కోల్పోయారని ప్రతిపక్ష ఎంపిలు విమర్శించారు. అందువల్ల తక్షణమే ఆయనను పదవి నుండి తొలగించాలని డిమాండ్‌ చేస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. ఇది అనవసరమైన చర్య అని అధికార పక్షం తప్పుబట్టింది.
 
కాంగ్రెస్‌ ఎంపి, ప్రతిపక్ష ఉప నాయకుడు గౌరవ్‌ గొగోరు స్పీకర్‌ ఓం బిర్లాపై తీర్మానం ప్రవేశపెట్టిన తరువాత, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు పదేపదే ఆయనను మాట్లాడనివ్వకుండా అడ్డుకున్నారు.  ప్రతిపక్షాలకు పదేపదే అడ్డుకున్న మంత్రిగా కిరణ్‌ రిజిజు రికార్డు సృష్టించారని గౌరవ్‌ గొగోరు వ్యాఖ్యానించారు. అలా అయితే, ప్రస్తుత ప్రతిపక్షం బాధ్యతారహిత్యమైన ప్రతిపక్షమని అమిత్‌ షా వ్యాఖ్యానించారు.
 
కీలకమైన చర్చల సమయంలో ప్రతిపక్ష సభ్యులను మాట్లాడటానికి స్పీకర్‌ అనుమతించలేదని గౌరవ్‌ గొగోరు పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకుడితో సహా ప్రతిపక్ష నేతలు మాట్లాడేటప్పుడు తరచుగా మైక్‌ ఆపివేస్తున్నారని ఆయన విమర్శించారు. టిఎంసి ఎంపి మహువా మొయిత్రా మాట్లాడుతూ, స్పీకర్‌ ప్రతిపక్ష ఎంపిలను మాత్రమే ఎంచుకుని వారిని సస్పెండ్‌ చేశారని చెప్పారు. 
 
పార్లమెంట్ భద్రత గురించి చరించాలని కోరినందుకు ఒకేసారి వందమందిని సస్పెండ్ చేసి చరిత్ర సృష్టించారని చెబుతూ, ఆయన హయాంలో ఒక్క అధికార పక్ష ఎంపీని సస్పెండ్ చేయలేదని ఆమె గుర్తు చేశారు.  లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ పూర్తిగా బాధ్యతారహితంగా జోక్యం చేసుకుంటున్నారని కిరణ్‌ రిజిజు ధ్వజమెత్తారు. ‘ఇలాంటి ప్రతిపక్ష నేతను ఎప్పుడూ చూడలేదు. సభా కార్యకలాపాల సమయంలో ప్రధానమంత్రిని కౌగిలించుకుని తన సహచరులను చూసి కన్నుగీటే ప్రతిపక్ష నాయకుడు ఎవరైనా ఉన్నారా?’ అంటూ ప్రశ్నించారు.
 
సభలో మాట్లాడే ముందు సభ్యులు స్పీకర్‌ అనుమతి తీసుకోవాలని పార్లమెంటరీ నియమాలలో స్పష్టంగా పేర్కొన్నారని, మాట్లాడటానికి తనకు ఎవరి అనుమతి అవసరం లేదని రాహుల్‌ చెబుతున్నారని  మంత్రి కిరణ్‌ రిజిజు విస్మయం వ్యక్తం చేశారు. ఎవరైనా సభ్యుడు తాను స్పీకర్‌ కంటే ఉన్నతంగా భావిస్తే, దానికి పరిష్కారం లేదని చెప్పారు.
రాహుల్‌ సోదరి, వయనాడ్‌ ఎంపి ప్రియాంక గాంధీ మాట్లాడుతూ రాహుల్‌ నిజాలు మాట్లాడటం వల్ల కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి ఆయనను చూసి భయపడుతున్నారని విమర్శించారు. ప్రియాంకను ప్రతిపక్ష నాయకురాలిని చేయడం సముచితమని రిజిజు సూచించారు.  ‘ఆమె క్రమం తప్పకుండా సభకు వచ్చి విధానాలను గమనిస్తారు. ప్రియాంక ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడి కంటే మెరుగ్గా రాణించే అవకాశం ఉంది’ అని రిజిజు వ్యాఖ్యలు చేశారు. టిడిపి తరపున లావు శ్రీకృష్ణదేవరాయలు, జనసేన తరపున తంగెళ్ల ఉదయ శ్రీనివాస్‌ అధికార పక్షానికి మద్దతుగా మాట్లాడారు.
 
తొలుత తీర్మానం స్పీకర్‌పైనే అయినందున ఓం బిర్లా సభను నిర్వహించలేరు, ప్రత్యామ్నాయ స్పీకర్‌ను నియమించాలని ప్రతిపక్షాలు చేసిన సూచనను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని ప్యానెల్‌ సభ్యుల్లో ఒకరైన జగదాంబికా పాల్‌ను నియమించింది. ఆయన సభ కార్యకలాపాలను నిర్వహించారు. దీనిలో ఆర్డర్‌ సమస్య ఉందని ప్రతిపక్షాలు ఎత్తి చూపాయి. 

రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో మాట్లాడేందుకు విపక్ష నేత రాహుల్‌గాంధీకి అవకాశం ఇవ్వకపోవడం, ఎనిమిది మంది సభ్యులపై సస్పెన్షన్‌ వేటు వేయడం, కాంగ్రెస్‌ మహిళా ఎంపీలపై నిరాధార ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబెపై చర్యలు చేపట్టకపోవడం లాంటి కారణాలతో విపక్షాలు ఈ అవిశ్వాస తీర్మానాన్ని తీసుకొచ్చాయి.

స్పీకర్‌ను తాను వ్యక్తిగతంగా ఎంతో గౌరవిస్తానని, కాని ఆయన తన ప్రవర్తనను సరిదిద్దుకోవలసి ఉంటుందని టీఆర్‌ బాలు పేర్కొన్నారు. “స్పీకర్‌ ఓం బిర్లా చాలా పెద్ద మనిషి. కాని ఆయన ఎందుకు మారిపోయారో తెలియడం లేదు. గత ఏడేండ్లలో ఆయన చాలామంది ఎంపీలను సభ నుంచి సస్పెండ్‌ చేశారు. అంత కఠిన చర్యలను ఎందుకు తీసుకోవలసి వచ్చింది? స్పీకర్‌ నిజాయితీగా వ్యవహరించాలని నేను కోరుకుంటున్నాను” అని టీఆర్‌ బాలు సూచించారు.

దీనికి ఎన్‌డీఏ సభ్యుడు లావు శ్రీకృష్ణ దేవరాయలు స్పందిస్తూ 2019 నుంచి మొదటిసారి స్పీకర్‌గా నియమితులైన నాటి నుంచి ఓం బిర్లా సభను ఎంతో హుం దాగా, నిజాయితీగా నడుపుతున్నారని ప్రశంసించారు. శివసేన(యూబీటీ) సభ్యుడు అరవింద్‌ సావంత్‌ కూడా ఓం బిర్లాను పెద్ద మనిషిగా కీర్తించారు. అయితే విపక్షానికి వ్యతిరేకంగా పనిచేయాలని ఒత్తిడి ఉందని ఆరోపించారు. ఇప్పటివరకు డిప్యూటీ స్పీకర్‌ను ఎందుకు నియమించలేదని ప్రశ్నించారు.