భారత్ -బంగ్లాదేశ్ మధ్య కొంతకాలం క్రితం విబేధాలు తలెత్తినప్పటికీ ఆ దేశం విషయంలో భారత్ ఎప్పుడూ అంశంలో సానుకూలంగానే స్పందిస్తోంది. తాజాగా ఇరాన్ సంక్షోభం కారణంగా చమురు సరఫరాపై ఆందోళన నెలకొన్న సమయంలో బంగ్లాదేశ్‌కు భారత్ 5,000 టన్నుల డీజిల్ సరఫరా చేసేందుకు సిద్ధమైంది. గతంలో రెండు దేశాల మధ్య చమురు సరఫరాపై ఒప్పందం కుదిరింది. దీనిలో భాగంగా ఇరు దేశాల మధ్య ఫ్రెండ్షిప్ పైప్‌లైన్ కూడా నిర్మించారు.
అంతకుముందు చమురు సరఫరా రైల్వే ట్యాంకర్ల ద్వారా జరిగేది. బంగ్లాతో ఒప్పందం ప్రకారం ప్రతి ఏడాది బంగ్లాకు 1,80,000 టన్నుల డీజిల్‌ను భారత్ సరఫరా చేయాలి. ఐదేళ్లపాటు ఈ ఒప్పందం అమలులో ఉంటుంది. దీనిలో భాగంగా తొలి విడతగా 5,000 టన్నుల డీజిల్‌ను భారత్ బంగ్లాకు సరఫరా చేసింది. మంగళవారం నాటికి ఈ డీజిల్ బంగ్లాకు చేరుకుంది.
అలాగే వచ్చే ఆరు నెలల్లో 90,000 టన్నుల డీజిల్ సరఫరా అవుతుందని భావిస్తున్నట్లు బంగ్లాదేశ్ పెట్రోలియం కార్పొరేషన్ ఛైర్మన్ ముహమ్మద్ రెజనూర్ రెహమాన్ తెలిపారు. ఇది తమ దేశీయ అవసరాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. నిజానికి భారత్ ఎప్పటినుంచో బంగ్లాకు చమురు సరఫరా చేస్తోంది. అలాగే, ఇక్కడి నుంచి విద్యుత్‌ను కూడా బంగ్లాకు అందించేది.
కానీ, రెండేళ్లక్రితం అక్కడ షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయాక పరిస్తితులు మారిపోయాయి. అక్కడ హిందువులపై దాడులు పెరిగిపోయాయి. ఇదే సమయంలో ఇంతకాలం బంగ్లాను నడిపించిన యూనస్ ప్రభుత్వం భారత్ కు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ భారత్ నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేసింది. అలాగే అదానీ సంస్థకు చెందిన ఝార్ఖండ్ పవర్ ప్లాంట్ నుంచి విద్యుత్ తీసుకోవడాన్ని తగ్గించింది.
కానీ, ఇప్పుడు బంగ్లాలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో మళ్లీ పాత పద్ధతుల్లోనే రెండు దేశాల మధ్య చమురు సరఫరా మొదలైంది.

More Stories
ఇరాన్‌పై యుద్ధంలో ప్రయోజనం పొందుతున్న ఏకైక దేశం రష్యా
చైనా చేతిలో అమెరికా ఎఫ్-35 యుద్ధ విమానాల భవిష్యత్!
ఇరాన్ యుద్ధంపై పుతిన్‌తో గంటసేపు ఫోన్ లో మాట్లాడిన ట్రంప్