అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్లను అరికట్టే ఉద్దేశంతో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల బుకింగ్ గడువును 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచినట్లు సోమవారం ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ‘గతంలో 55 రోజులకు ఒకసారి సిలిండర్ బుక్ చేసుకునేవారు, ప్రస్తుతం 15 రోజులకే బుకింగ్ చేస్తున్న సందర్భాలు ఉన్నాయని’ పేర్కొన్నాయి. అంతేకాదు, ఎల్పీజీ ఉత్పత్తిని వేగవంతం చేయాలని ప్రభుత్వం రిఫైనరీలను ఆదేశించింది.
కమర్షియల్ కనెక్షన్ల కంటే గృహ వినియోగదారుల అవసరాలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, భారత్ కొత్త ఎల్పీజీ భాగస్వామ్య దేశాల కోసం అన్వేషిస్తోంది. ఇప్పటికే అల్జీరియా, ఆస్ట్రేలియా, కెనడా, నార్వే మొదలైన దేశాలు భారత్ కు ఎల్పీజీ విక్రయించేందుకు ముందుకు వచ్చాయని తెలుస్తోంది.
ముడి చమురు ధరలు బ్యారెల్ కు 130 డాలర్ల మార్కును దాటితే తప్ప, దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారత్ వద్ద తగినంత నిల్వలు ఉన్నందున ధరల పెరుగుదల ఉండకపోవచ్చని పేర్కొన్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, చాలా వరకు ముడి చమురు ధరలు బ్యారెల్ కు సుమారు 100 డాలర్లు వద్ద ఉండవచ్చని అంచనా వేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం దేశంలోని ఏ పెట్రోల్ పంపులోనూ ఇంధన కొరత లేదని వారు స్పష్టం చేశారు. భారత్ కు ప్రధానంగా హోర్ముజ్ జలసంధి నుంచి ఎక్కువగా ముడి చమురు దిగుమతులు వస్తుంటాయి. కానీ దానిని ఇరాన్ మూసివేయడంతో, ఇతర మార్గాల ద్వారా ముడి చమురు దిగుమతి చేసుకునే ప్రక్రియను భారత్ వేగవంతం చేసిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
విమాన ఇంధనానికి సంబంధించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, భారత్ వద్ద తగినంత ఏటీఎఫ్ నిల్వలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. “భారత్ ఏటీఎఫ్ ను ఉత్పత్తి చేయడమే కాదు, ఎగుమతి కూడా చేస్తోంది. కాబట్టి భయం అక్కర్లేదు” అని సదరు వర్గాలు స్పష్టం చేశాయి. ఇతర దేశాలతో పోల్చితే ఇంధన భద్రత విషయంలో భారత్ చాలా మెరుగైన స్థితిలో ఉందని స్పష్టం చేశాయి.

More Stories
ట్రంప్ త్వరలో యుద్ధం ముగింపు అనడంతో తగ్గిన చమురు ధరలు
350 మిలియన్ డాలర్లతో ఇండోనేషియా బ్రహ్మోస్ క్షిపణులు
కేజ్రీవాల్ కేసులో సీబీఐ పనితీరుపై వాఖ్యలపై హైకోర్టు స్టే