నీటి నిల్వకు ముందే పోలవరం నిర్వాసితులను తరలించాలి

నీటి నిల్వకు ముందే పోలవరం నిర్వాసితులను తరలించాలి
పోలవరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయడానికి ముందే ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలను తరలించాలని, ఆర్‌అండ్‌ఆర్‌ కార్యకలాపాలు వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కాగ్‌ సిఫార్సు చేసింది.  2027 జూన్‌ నాటికి ప్రాజెక్టులో నీటిని నిల్వ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు అసెంబ్లీలో ప్రకటించారు.  మరోవైపు ఆర్‌అండ్‌ఆర్‌, నిర్వాసిత కాలనీల్లో సదుపాయాలు, నిర్మాణాలు మొత్తం కూడా 13 శాతానికి మించి పనులు జరగలేదు.
అంటే ప్రాజెక్టులో నీరు నిలిచిపోతే వేలమంది నిర్వాసితులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కాగ్‌ చేసిన ఈ సూచన ఇప్పుడు అత్యంత విలువైన అంశంగా ముందుకు వచ్చింది.   పోలవరం ప్రాజెక్టు అథారిటీతో సంప్రదించి సంబంధిత రాష్ట్రాలతో ముంపు సమస్యను పరిష్కరించుకోవాలని, రక్షణ కరకట్టను సకాలంలో నిర్మించాలని పేర్కొంది.
ప్రాజెక్టు అమల్లో పెద్దఎత్తున మార్పులు చేర్పుల వల్ల భారం పడుతోందని, దీన్ని నివారించడం ద్వారా అనవసరపు చెల్లింపులను తగ్గించొచ్చని కాగ్‌ సిఫార్సు చేసింది. వీటితోపాటు అవినీతి అవకతవకలను కడిగిపారేసిన కాగ్‌ పలు సిఫార్సులూ చేసింది. తరలించిన కుటుంబాల శ్రేయస్సు కోసం అవసరమైన మౌలిక వసతులు సమకూర్చే ప్రక్రియను వేగవంతం చేయాలని తెలిపింది.
ముంపునకు గురయ్యే ప్రాంతం అని ఒకసారి ప్రకటించిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం తన భూమిని రక్షించుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.  అనర్హులకు భూమిని కేటాయించి దానికి మరలా పరిహారం అందజేయడం వంటి చర్యలు లేకుండా చూడాలని పేర్కొంది. చింతూరు, రాజమహేంద్రవరం ఆర్‌అడ్‌ఆర్‌ స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లు అనర్హత కలిగిన గిరిజనేతరులకు రూ.19.52 కోట్లు చెల్లించిన విషయాన్ని ప్రస్తావించడం ద్వారా ఈ కేటాయింపుల్లో మతలబులను ఎత్తి చూపింది. 
 
రెవెన్యూ రికార్డుల క్రారం ముంపునకు గురయ్యే భూ విస్తీర్ణాన్ని, ప్రభావితమైన ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలను ఆర్‌అండ్‌ఆర్‌ కార్యకలాపాలకు అవసరమైన భూములను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి సవరించిన వ్యయ అంచనాను సత్వర ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి వివరణాత్మక నివేదిక(డిపిఆర్‌) సమర్పించాలని పేర్కొంది. 
అలాగే తవ్వితీసిన మట్టిని సక్రమంగా లెక్కల్లోకి తీసుకోవాలని, ఎలాంటి దొంగతనాలు జరగకుండా భద్రతా చర్యలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత శాఖ అధికారులను ఆదేశించాలని సిఫార్సు చేసింది. రూ.1660 కోట్ల విలువైన మట్టికి మాయం అయిందని, దీనికి సంబంధించి ఎటువంటి లెక్కలూ లేవనీ, అడిగినా రికార్డులు ఇవ్వలేదని పేర్కొన్నారు. 
 
ఈ దొంగతనం కాంట్రాక్టు కంపెనీలు చేశాయా, అధికారులు చేశారా? అనేది నిర్థారించలేదు. అలాగే పరిమాణాల్లో వ్యత్యాసం వల్ల గుత్తేదారులకు అనుమతి ప్రయోజనం నష్టం వాటిల్లకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈపిసి కాంట్రాక్టులకు సంబంధించిన ప్రక్రియను నిర్వర్తించవలసిన పరిధితో క్రబద్దీకరించకపోతే మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని కాగ్‌ తెలిపింది. 
 
ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసేందుకు వీలుగా కేటాయించిన నిధులను గరిష్టంగా వినియోగించాలని తెలిపింది. పోటీ బిడ్డింగులకు అవకాశం కల్పించాలని, ప్రధాన ఆనకట్ట పనులు సజావుగా సాగేందుకు వీలుగా పనులు చేయాలని తెలిపింది.