ఓంబిర్లాపై అవిశ్వాస తీర్మానం వెనక్కు.. ఇరాన్‌ పై చర్చకు పట్టు

ఓంబిర్లాపై అవిశ్వాస తీర్మానం వెనక్కు.. ఇరాన్‌ పై చర్చకు పట్టు
సోమవారం ప్రారంభమైన రెండో దశ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో తొలిరోజే కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రతిపక్షాలు తాము ప్రతిపాదించిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానంపై చర్చ, ఓటింగ్ కు పట్టుబడతారని అందరూ భావించారు. అయితే, సమావేశాల ప్రారంభం రోజున ఆ తీర్మానం గురించి పట్టించుకోకుండా గల్ఫ్‌ యుద్ధం, చమురు ధరలు, భారతీయుల తరలింపు వంటి అంశాల్ని లేవనెత్తారు. 
 
దీనిపై సభలో ప్రతిపక్ష సభ్యులు భారీ ఎత్తున నినాదాలు చేశారు. ఇరాన్ యుద్ధంపై, పెరుగుతున్న చమురు ధరలపై చర్చించాలని, అలాగే ఇరాన్ సహా గల్ఫ్‌లో చిక్కుకున్న భారతీయుల్ని రక్షించాలని కోరుతూ సభలో డిమాండ్ చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు మోదీ లొంగిపోయారంటూ కూడా విమర్శలు చేశారు. ఈ అంశాలపై చర్చించాలని డిమాండ్ చేశారు.
 
దీనికి ప్రభుత్వం అంగీకరించలేదు. ప్రతిపక్ష నేతలు ఇలా నినాదాలు చేయడంతో సభా కార్యక్రమాలు సజావుగా సాగలేదు. దీంతో పలుమార్లు సభ వాయిదా పడింది. చివరకు మధ్యాహ్నం మూడు గంటలకు సభను వాయిదా వేశారు. తిరిగి సభ మంగళవారం ప్రారంభమవుతుందని ప్రకటించారు. 
 
అనంతరం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ ఇరాన్ యుద్ధం మన దేశంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక పరిస్థితి దిగజారుతుందని, ఇప్పటికే స్టాక్ మార్కెట్లు నష్టపోతున్నాయని రాహుల్ తెలిపారు. చమురుర ధరలు కూడా పెరుగుతున్నాయని, ఇవన్నీ ప్రజా సమస్యలే అని రాహుల్ స్పష్టం చేశారు.
 
పశ్చిమాసియా సంక్షోభం పార్లమెంట్ ఉభయ సభలను సోమవారం కుదిపేసింది. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై చర్చకు డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు రాజ్యసభ, లోక్‌సభలో నిరసనలు చేపట్టాయి. దీంతో పార్లమెంట్ ఉభయ సభలు మంగళవారానికి వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నాయని బీజేపీ ఎంపీలు ఆరోపించారు.
 
సభ వెలుపల, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సహా ప్రతిపక్ష ఎంపీలు పశ్చిమాసియా వివాదంపై చర్చకు డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. దానికి సంబంధించిన కీలక అంశాలపై ప్రభుత్వం “మౌనం” వహించినందుకు విమర్శించారు. 
 
మరోవంక, బిర్లాపై అవిశ్వాస తీర్మానంపై వీలైనంత త్వరగా చర్చ జరపాలని ప్రభుత్వం ఆసక్తిగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి. బడ్జెట్ సమావేశాల మొదటి భాగంలో 118 మంది ప్రతిపక్ష ఎంపీలు ఈ తీర్మానంపై నోటీసు ఇచ్చినప్పటి నుండి బిర్లా సభకు అధ్యక్షత వహించడం లేదు. ఈ తీర్మానాన్ని ముగ్గురు కాంగ్రెస్ సభ్యులు – మొహమ్మద్ జావేద్, కె సురేష్, మల్లు రవి ప్రవేశపెడతారు.