ఇరాన్‌పై గ్రౌండ్‌ ఆపరేషన్‌ కు ట్రంప్ సమాలోచనలు

ఇరాన్‌పై గ్రౌండ్‌ ఆపరేషన్‌ కు ట్రంప్ సమాలోచనలు
* ‘అగ్ని నది’లా టెహ్రాన్‌ నగర వీధులు … ఇరాన్‌ ప్రతీకార దాడులు
 
పశ్చిమాసియాలో యుద్ధం 10వ రోజుకు చేరుకున్న వేళ.. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత వివాదాస్పద, శక్తివంతమైన ప్రకటన చేశారు. ఇరాన్‌పై యుద్ధాన్ని ఎప్పుడు ముగించాలనేది ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో చర్చించిన తర్వాతే నిర్ణయిస్తానని స్పష్టం చేశారు. అంతటితో ఆగకుండా ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ నియామకంపై స్పందిస్తూ అమెరికా ఆమోదం లేనిదే ఇరాన్‌లో ఏ నాయకుడూ ఎక్కువ కాలం అధికార బాధ్యతలు చేపట్టలేరని ఆయన హెచ్చరించారు.
 
ఇరాన్‌పై గ్రౌండ్‌ ఆపరేషన్‌ చేపట్టేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆలోచిస్తున్నారట. ఇరాన్‌లో శుద్ధి చేసిన యురేనియం నిల్వల స్థావరాల్ని కనుగొనేందుకు అక్కడికి అమెరికా, ఇజ్రాయెల్‌ బలగాల్ని పంపాలని ట్రంప్‌ భావిస్తున్నారని తెలిసింది. పరిమిత సంఖ్యలో మిలిటరీని అక్కడికి పంపి ‘గ్రౌండ్‌ ఆపరేషన్‌’ చేపడితే ఎలా ఉంటుందని ఉన్నతాధికారులతో ట్రంప్‌ ప్రైవేట్‌గా చర్చలు సాగించారని ఎన్‌బీసీ న్యూస్‌ పేర్కొన్నది.

కాగా, ఇజ్రాయెల్‌ దాడులను ఉధృతం చేసింది. రాజధాని టెహ్రాన్‌పై బాంబుల వర్షం కురిపించింది. చమురు డిపోలే లక్ష్యంగా భీకర దాడులు జరిపింది. దీంతో పలుచోట్ల భారీగా మంటలు చెలరేగాయి. నగరమంతా దట్టమైన పొగ కమ్మేసింది. ఈ దాడుల్లో ఇద్దరు ట్యాంకర్‌ డ్రైవర్లు సహా నలుగురు మరణించారని నేషనల్‌ ఇరానియన్‌ ఆయిల్‌ ప్రొడక్ట్స్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ సీఈవో తెలిపారు. 

ఇంతటితో అయిపోలేదని, ఇరాన్‌కు మరిన్ని షాక్‌లు ఇస్తామని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు హెచ్చరించారు. టెహ్రాన్‌, దాని చుట్టుపక్కల ఉన్న చమురు డిపోలపై ఇజ్రాయెల్‌ యుద్ధ విమానాలు శనివారం రాత్రి చక్కర్లు కొడుతూ బాంబుల వర్షం కురిపించాయి. దీంతో భారీ పేలుళ్లు నగరాన్ని వణికించాయి.  దట్టంగా ఎగసిపడ్డ మంటలు, నల్లటి మేఘంలా అలుముకున్న పొగ పలుచోట్ల కన్పించింది. పొరుగున ఉన్న కరజ్‌లో కూడా మంటలు, పొగ కన్పించిందంటే దాడుల తీవ్రత అర్థం చేసుకోవచ్చు.

ఈ దాడులతో లీకైన చమురు రోడ్ల వెంబడి ప్రవహించగా, ఆయా డిపోలు మండుతున్న గోళాలను తలపించాయి. లీకైన చమురుకు పలుచోట్ల నిప్పు అంటుకోవడంతో వీధులు ప్రవహించే ‘అగ్ని నది’లా మారాయని పలువురు పేర్కొన్నారు.  షహ్రాన్‌, అఘ్ధాసియేతో పాటు మొత్తం నాలుగు చమురు డిపోలు, పెట్రోలియం ఉత్పత్తుల రవాణా కేంద్రం కూడా వైమానిక దాడుల్లో దెబ్బతిన్నాయి. మంటలను ఆర్పేందుకు అత్యవసర బృందాలు రాత్రి నుంచి ప్రయత్నించి ఎట్టకేలకు సఫలమయ్యాయి.

ఆదివారం ఉదయం నుంచి మంటల నుంచి వెలువడిన పొగ నగరమంతా నల్లగా కమ్మేసింది. సూర్యుడు సరిగ్గా కన్పించ లేదని, గాలిలో మండుతున్న ఇంధన వాసన వ్యాపించిందని స్థానికులు తెలిపారు. అయితే దాడులను అధికారులు నిర్ధారించినప్పటికీ, తమ చమురు నిల్వలు మాత్రం సురక్షితంగా ఉన్నాయని ప్రకటించారు. దాడుల తర్వాత నగరంలో నల్లటి నీటితో వాన కురిసింది. ఇంధనాన్ని మండించడం వల్ల ఏర్పడే చమురు, మసితో వర్షపు నీరు కలవడంతో నల్లటి వర్షపు నీటి వాన కురిసి ఉండవచ్చునని సీఎన్‌ఎన్‌ తెలిపింది. ఆయిల్‌ డిపోల పేల్చివేత కారణంగా టెహ్రాన్‌లో ఆమ్ల వర్షం కురిసే ప్రమాదముందని ఇరానియన్‌ రెడ్‌ క్రెసెంట్‌ హెచ్చరించింది. 

మరోవంక, ఇజ్రాయెల్‌, గల్ఫ్‌ దేశాలపై ఇరాన్‌ విరుచుకుపడింది. బహ్రెయిన్‌లోని మనామాలో ఉన్న జుఫైర్‌ జిల్లాలోని యూఎస్‌ నేవీకి చెందిన ఐదవ నౌకాదళంపై ఇరాన్‌ భారీ దాడి చేసింది. ఈ దాడిలో 21 మంది అమెరికా సైనికులు మరణించినట్టు టెహ్రాన్‌ టైమ్స్‌ వెల్లడించింది.  మనామా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ నౌకాదళం హెడ్‌క్వార్టర్స్‌పై ఇరాన్‌ నేరుగా క్షిపణి, డ్రోన్‌తో దాడి చేసింది. బహ్రెయిన్‌ స్థావరాన్ని రక్షించే పనిలో పేట్రియాట్‌ పీఏసీ-3 వ్యవస్థలు ఉన్నప్పటికీ ఈ దాడి ప్రాంతీయ వైమానిక రక్షణ ప్రభావం గురించి అత్యవసర ప్రశ్నలను లేవనెత్తింది.

కువైట్‌లోని సోషల్‌ సెక్యూరిటీ టవర్‌పై ఇరాన్‌ దాడి చేయడంతో అది మంటల్లో చిక్కుకుంది. పబ్లిక్‌ ఇన్‌స్టిట్యూషన్‌ ఫర్‌ సోషల్‌ సెక్యూరిటీ (పీఐఎఫ్‌ఎస్‌ఎస్‌) భవనంపై డ్రోన్‌తో దాడి చేయడంతో పై అంతస్తుల్లో మంటలు వ్యాపించాయి. కువైట్‌ ఎయిర్‌పోర్టులోని చమురు ట్యాంక్‌లు లక్ష్యంగా 15 డ్రోన్లతో ఇరాన్‌ జరిపిన దాడిని సౌదీ అరేబియా అడ్డుకుంది.

ఇజ్రాయెల్‌లోని టెల్‌అవీవ్‌, బీర్షేవా నగరాలతో పాటు జోర్డాన్‌ సమీపంలోని ఎయిర్‌బేస్‌పై ఇరాన్‌ దాడిచేసింది. ఇజ్రాయెల్‌లోని హైఫాలో ఉన్న అతిపెద్ద చమురుశుద్ధి కర్మాగారంపై తమ క్షిపణులు దాడి చేసినట్టు ఇరాన్‌ తెలిపింది. దక్షిణ రియాద్‌లోని అల్‌ ఖార్జ్‌లో నివాస ప్రాంతాలపై జరిగిన మిలిటరీ ప్రొజక్టైల్‌ దాడిలో భారత్‌, బంగ్లాదేశ్‌కు చెందిన ఇద్దరు పౌరులు చనిపోయారని సౌదీ అరేబియా తెలిపింది.