భద్రతా వైఫల్యాల వల్లే- నేపాల్ జెన్ జెడ్ ఉద్యమంలో హింస

భద్రతా వైఫల్యాల వల్లే- నేపాల్ జెన్ జెడ్ ఉద్యమంలో హింస

నేపాల్‌లో గత ఏడాది ‘జెన్-జెడ్’ నిరసనల సమయంలో జరిగిన హింసాత్మక ఘటనలపై ఆదివారం ఉన్నత స్థాయి దర్యాప్తు కమిటీ తన తుది నివేదికను సమర్పించింది. సెప్టెంబర్ 8, 9 తేదీల్లో జరిగిన ఈ అల్లర్లలో భద్రతా పరమైన లోపాలు ఉన్నట్లు కమిటీ నిర్ధరించింది. కమిటీ ఛైర్మన్ గౌరీ బహదూర్ కార్కీ, సభ్యుడు బిగ్యన్ రాజ్ శర్మతో కలిసి ఈ నివేదికను తాత్కాలిక ప్రధానమంత్రి సుశీల కార్కీకి అందజేశారు. 

ఈ విచారణలో భద్రతా లోపాలను విచారణ కమిటీ గుర్తించింది. ఆనాటి భద్రతా బలగాల వైఫల్యాలు, రాజకీయ నిర్ణయాలు, జరిగిన భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని తన నివేదికలో పొందుపర్చింది. నిరసనల సమయంలో భద్రతా ఏర్పాట్లు సరిగా లేవని దర్యాప్తు కమిటీ సభ్యుడు బిగ్యన్ రాజ్ శర్మ పేర్కొన్నారు. నివేదిక సమర్పించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యంగా ఫెడరల్ పార్లమెంట్ భవనం చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేయడంలో అశ్రద్ధ తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు.

ఈ నివేదికను రూపొందించడానికి విచారణ కమిటీ సుమారు 200 మందిని విచారణ చేసింది. ఇందులో ప్రత్యక్ష సాక్షులు, బాధితులు, భద్రతా అధికారులు, నిపుణులు ఉన్నారు. వారందరి స్టేట్‌మెంట్‌లను రికార్డు చేసి, సంతకాలు తీసుకున్నట్లు శర్మ తెలిపారు. ప్రధాన నివేదిక సుమారు 900 పేజీలకు పైగా ఉండగా, దానికి అనుబంధంగా సాక్ష్యాధారాలు, పత్రాలు కలిపితే మొత్తం 10,000 పేజీల సమాచారాన్ని విచారణ కమిటీ ప్రధానికి అందజేసింది.

ఈ నిరసనల్లో జరిగిన ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. ఈ అల్లర్లలో మొత్తం 77 మంది మరణించారు. వీరిలో ఎక్కువ మంది భద్రతా దళాల కాల్పుల వల్లే ప్రాణాలు కోల్పోయినట్లు నివేదిక తేల్చింది. మొత్తం 2,429 మంది గాయపడగా, వారిలో 1,433 మంది 13 నుంచి 28 ఏళ్ల మధ్య వయస్సు వారే.  విచారకరమైన విషయం ఏమిటంటే, గాయపడిన వారిలో 17 మంది 13 ఏళ్ల లోపు పిల్లలు కూడా ఉండటం గమనార్హం.

దేశవ్యాప్తంగా సుమారు 84.45 బిలియన్ నేపాలీ రూపాయల నష్టం వాటిల్లింది. నివేదికను స్వీకరించిన తర్వాత తత్కాలిక ప్రధాని సుశీల కార్కీ దర్యాప్తు కమిటీని అభినందించారు.  చాలా తక్కువ సమయంలో విచారణ పూర్తిచేయడంపై కొనియాడారు. వాస్తవాలు, అవాస్తవాలను ఈ నివేదికలో స్పష్టంగా చెప్పినట్లు తాను నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. విచారణ కమిటీ సమర్పించిన నివేదికను హోంమంత్రితో కలిసి అధ్యయనం చేసిన తర్వాత మంత్రివర్గం ముందు ఉంచుతామని చెప్పారు.