బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తనయుడు నిశాంత్ కుమార్ సొంత పార్టీ జేడీయూలో చేరారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన నిశాంత్, ఆదివారం పాట్నాలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ‘లాలన్’, జెడియు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ ఝా, పార్టీ కార్యకర్తల పెద్ద సమూహంతో సహా అగ్ర నాయకుల సమక్షంలో పార్టీలో చేరారు.
జేడీయూ అధ్యక్షుడు, బిహార్ సీఎం అయిన నితీష్ కుమార్ త్వరలో రాజ్యసభకు వెళ్లబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీని ఎవరు నడిపిస్తారనే సందేహాలు వ్యక్తమయ్యాయి. పార్టీని నడిపించేందుకే నిశాంత్‌ను నితీష్ రాజకీయాల్లోకి తెచ్చినట్లు తెలుస్తోంది. నిశాంత్ వయసు 50. సాధారణంగా నితీష్ కుమార్ లాంటి అగ్రనేతలు తమ వారసుల్ని చిన్న వయసులోనే రాజకీయాలకు తీసుకొస్తుంటారు. కానీ, నిశాంత్‌ను మాత్రం నితీష్ రాజకీయాలకు దూరంగా ఉంచారు.
కారణం, నితీష్ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమనే ప్రచారం ఉంది. అయితే, ప్రస్తుతం నితీష్ రాష్ట్రాన్ని వదిలి కేంద్రానికి వెళ్తుండటంతో, తప్పనిసరిగా రాష్ట్ర బాధ్యతలు చూసేందుకు నిశాంత్‌ను పార్టీలోకి తీసుకొచ్చారు. నిశాంత్ కూడా తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందుకోవాలని చూడలేదు. ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగానే ఉంటూ వచ్చారు.
సీఎం కొడుకైనప్పటికీ అప్పుడప్పుడు మాత్రమే రాజకీయ వేదికలపై కనిపించేవారు. జేడీయూలో చేరిన నిశాంత్‌కు బిహార్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చే అవకాశముందని పార్టీ వర్గాలు అంటున్నాయి. జేడీయూలో చేరిన సందర్భంగా నిశాంత్ మాట్లాడుతూ పార్టీని నిలబెట్టేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. తన తండ్రి నితీష్ రాజ్యసభకు వెళ్లాలన్నది ఆయన సొంత నిర్ణయమని, దాన్ని గౌరవిస్తానని చెప్పారు.
ఆయన మార్గదర్శకత్వంలో రాష్ట్రం కోసం పనిచేస్తానని వెల్లడించారు. పార్టీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతానని చెప్పారు. ఈ నెల 16న రాజ్యసభ ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికలో నితీష్ గెలవడం లాంఛనమే. రాజ్యసభకు ఎంపీగా ఎన్నికైన తర్వాత నితీష్ బిహార్ సీఎం పదవికి రాజీనామా చేస్తారు. 20ఏళ్లు బిహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన తనతండ్రి రాష్ట్రానికి ఎంతో చేశారని చెప్పారు. బిహార్ ప్రజలు ఆయన చేసిన అభివృద్ధిని ఎప్పటికీ మరిచిపోరని తెలిపారు.

More Stories
పశ్చిమాసియాలో పరిణామాలు ఆందోళనకరం
మూడోసారి టీ20 ప్రపంచకప్ భారత్ కైవసం
రాష్ట్రపతి కార్యక్రమంలో ప్రోటోకాల్ ఉల్లంఘనపై కేంద్రం సీరియస్