పశ్చిమాసియాలో తీవ్రమైన మానవత్వ అత్యవసర పరిస్థితి

పశ్చిమాసియాలో  తీవ్రమైన మానవత్వ అత్యవసర పరిస్థితి
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ అక్రమ దాడులతో పశ్చిమాసియాలో పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. పశ్చిమాసియాలో తీవ్రమైన మానవత్వ అత్యవసర పరిస్థితి నెలకొన్నట్లు ప్రకటించింది. ఐక్యరాజ్యసమితికి చెందిన శరణార్థి ఏజెన్సీ డైరెక్టర్‌ అయాకీ ఇటో జెనీవాలో మాట్లాడుతూ ఇజ్రాయిల్‌ దాడులతో లెబనాన్‌లో దాదాపు లక్ష మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని, ఇందులో పదివేల మంది సరిహద్దులు దాటి వెళ్లిపోయారని తెలిపారు.
 
అయితే ఇది అంచనా సంఖ్య మాత్రమేనని, వాస్తవ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండవచ్చునని చెప్పారు. ఈ సంక్షోభంపై ఈ ప్రాంతంలోనూ, ఆగేయాసియాలోనూ తక్షణ ప్రతిస్పందన అవసరమని తెలిపారు. అమెరికా, ఇజాయ్రిల్‌ దాడులతో ఇరాన్‌లో ప్రారంభంలోనే లక్ష మంది నిరాశ్రయులయ్యారని, ఇరాన్‌లోని తమ సిబ్బందికి సహాయం కోరుతూ ప్రతిరోజూ వందలాది కాల్స్‌ వస్తున్నాయని వెల్లడించారు. 
 
సామూహిక స్థానభ్రంశం కారణంగా ఇతర సమస్యలతో పాటు వ్యాధులు కూడా విజృంభించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నిర్వాసితులైన ప్రజలకు తగినంత నీరు, పారిశుధ్యం లేకపోవడం మమ్మల్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోందని ఇటో తెలిపారు. మరోవంక, ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ సంయుక్త దాడిలో సుమారు 200 మంది పిల్లలు మరణించారు. ఇరాన్‌పై వారం రోజుల పాటు జరిగిన సైనిక దాడిలో 181 మంది పిల్లలు మరణించారని యునిసెఫ్ తెలిపింది. 
 
యునిసెఫ్ నివేదిక ప్రకారం ఇరాన్‌లో సుమారు 181 మంది పిల్లలు మరణించగా, లెబనాన్, ఇజ్రాయెల్ మరియు కువైట్‌లలో ఏడుగురు, ఒక్కొక్కరు ముగ్గురు పిల్లలు మరణించారు. దక్షిణ ఇరాన్‌లోని మినాబ్‌లో ఫిబ్రవరి 28న బాలికల పాఠశాలపై ఇజ్రాయిల్ క్షిపణి దాడి అత్యంత బాధాకరమైనదని వెల్లడించారు. యునిసెఫ్ నివేదిక ప్రకారం 7 నుండి 12 సంవత్సరాల మధ్య వయస్సు గల దాదాపు 168 మంది పిల్లలు మరణించారని తెలిపారు. 
 
అయితే 175 మంది పిల్లలు మరణించారని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తెలిపింది. పిల్లలపై ఈ దాడులు యుద్ధ భయానక పరిస్థితులను గుర్తు చేస్తున్నాయని, ఇది తరతరాలుగా కుటుంబాలను, సమాజాలను ప్రభావితం చేస్తుందని యునిసెఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. అమెరికా-ఇజ్రాయిల్ సంయుక్త దాడిలో ఇప్పటివరకు ఇరాన్‌లో 20 పాఠశాలలు, 10 ఆసుపత్రులు దెబ్బతిన్నాయి. 
 
ఇది వేలాది మంది పిల్లల విద్య, చికిత్సను ప్రభావితం చేసింది. అంతర్జాతీయ మానవ హక్కుల చట్టానికి అనుగుణంగా పౌరులు, పిల్లలను రక్షించడానికి అన్ని పార్టీలు ఐక్యంగా ఉండాలని యునిసెఫ్ పిలుపునిచ్చింది. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని, పిల్లలు మరియు ఇతర బాధితులకు మద్దతు, సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నామని యునిసెఫ్ తెలిపింది.