తెలుగు రాష్ట్రాలతో సహా 22 రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రక్షాళన

తెలుగు రాష్ట్రాలతో సహా 22 రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రక్షాళన

భారత ఎన్నికల సంఘం దేశంలోని 22 రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)  ప్రక్రియను ప్రారంభించేందుకు అధికారికంగా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ కీలక నిర్ణయంలో భాగంగా తెలంగాణతో పాటు పలు ఇతర రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాను సమగ్రంగా ప్రక్షాళన చేయనున్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం ప్రారంభం కాగా, మిగిలిన చోట్ల కూడా దీనిని వేగవంతం చేసేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది.

ఈ ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ ద్వారా ఓటర్ల జాబితాలో ఉన్న లోపాలను సరిదిద్దడమే ప్రధాన లక్ష్యం. ఓటర్ల సమగ్ర సర్వే నిర్వహించి, అర్హులైన కొత్త ఓటర్లను చేర్చడం, చనిపోయిన వారు లేదా ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిన వారి పేర్లను తొలగించడం వంటి పనులు చేపట్టనున్నారు. దీనికి సంబంధించి స్పష్టమైన విధివిధానాలను ఎన్నికల సంఘం త్వరలోనే ఖరారు చేయనుంది. 

క్షేత్రస్థాయిలో బూత్ లెవల్ అధికారులు (బిఎల్ఓ) ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను ధృవీకరించనున్నారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పెంచేందుకు ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుంది. ఓటర్లు తమ వివరాలలో ఏవైనా మార్పులు ఉంటే ఈ సమయంలోనే సరిచేసుకోవాల్సి ఉంటుంది.   ఇందుకుగాను ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారిని ఆదేశిస్తూ ఈసీఐ శుక్రవారం సర్క్యులర్‌ జారీ చేసింది.

ఓటర్ల జాబితా సవరణ కోసం ఎన్నికల విభాగాలు సిద్ధం కావాలని, విధి విధానాల ప్రచారం, అవగాహన కార్యక్రమాలను ప్రక్రియ ప్రారంభం లోపు పూర్తిచేయాలని పేర్కొంది.  ఏప్రిల్‌ నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రక్రియ కోసం శిక్షణ కార్యక్రమాలు, బూత్‌స్థాయి అధికారుల నియామకం, క్షేత్రస్థాయి మ్యాపింగ్‌ పనులను తక్షణమే పూర్తి చేయాలని సూచించింది. కాగా, ఓటర్ల జాబితాను వంద శాతం దోష రహితంగా మార్చడమే లక్ష్యంగా ఎస్‌ఐఆర్‌ పేరిట సవరణను చేపట్టనున్నారు.

సాధారణ ఓటర్ల సవరణలా కాకుండా ఎస్‌ఐఆర్‌లో బూత్‌స్థాయి అధికారులు (బీఎల్‌వోలు) నేరుగా ఓటర్ల ఇళ్లకు వస్తారు.  మరణించిన వారి పేర్లు, డూప్లికేట్‌ ఓట్లు, ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వలసవెళ్లిన వారి వివరాలను జాబితా నుంచి తొలగిస్తారు. అలాగే 18 ఏళ్లు నిండిన యువతకు కొత్తగా ఓటు హక్కు కల్పిస్తారు. ఇంటింటి సర్వే నిర్వహించి ప్రతి ఓటరు ఫొటో, చిరునామా సరిచూస్తారు. ఈ భారీ కసరత్తు కోసం అధికార యంత్రాంగం ఇప్పుడే సిద్ధంకావాలని ఈసీఐ ఆదేశించింది. 

ఇప్పటికే బిహార్‌ వంటి రాష్ర్టాల్లో మొదటి దశ పూర్తికాగా, ప్రస్తుతం 12 రాష్ర్టాల్లో రెండోదశ ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు నిర్దేశిత రాష్ట్రాల్లో ఏప్రిల్‌ నుంచి మూడోదశ ఎస్‌ఐఆర్‌ను ప్రారంభించనున్నారు.