ఎనిమిది వారాలకు ముడి చమురు, పెట్రోలియం నిల్వలు

ఎనిమిది వారాలకు ముడి చమురు, పెట్రోలియం నిల్వలు

* ఇంధన భద్రతలో భారత్ కు ఢోకా లేదు

పశ్చిమాసియాలో ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై ఆందోళనలు రేకెత్తిస్తోంది. అయితే, ఈ ఉద్రిక్తతల ప్రభావం భారతదేశంపై పడబోదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. దేశీయ అవసరాలకు సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని, ఎటువంటి కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని భారత్ భరోసా ఇచ్చింది.

ప్రస్తుతం దేశానికి తక్షణ అవసరాల కోసం సరిపడా నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది. వ్యూహాత్మక నిల్వలతో కలిపి సుమారు ఎనిమిది వారాల పాటు సరిపడే ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు ఉన్నాయని అంచనా. విడిగా చూస్తే సుమారు 25 రోజుల ముడి చమురు, మరో 25 రోజుల పెట్రోల్‌, డీజిల్ నిల్వలు సిద్ధంగా ఉన్నాయి. సరఫరా అంతరాయం వచ్చినా తాత్కాలికంగా ఇబ్బంది లేకుండా వ్యవస్థను నడిపించగలమని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

పెట్రోల్‌, డీజిల్‌పై ఎలాంటి రోజూ వారి నిబంధనలు విధించే ఆలోచన ఏమీ లేదని, దేశానికి అవసరమైనంత నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. సరఫరా వ్యవస్థ బలంగా ఉండటంతో సాధారణ ప్రజలు, పరిశ్రమలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపాయి. దేశ ఇంధన భద్రతపై సమీక్షను రోజూ నిర్వహిస్తున్నామని, నిల్వలు రోజూ భర్తీ అవుతున్నాయని అధికారులు వెల్లడించారు. 

ముఖ్యంగా ఎల్పీజీ, ఎల్‌ఎన్‌జీ, ముడి చమురు సరఫరాలో ఎలాంటి కొరత లేదని చెప్పారు. గ్యాస్ సరఫరాను ప్రాధాన్య రంగాలకు నిరంతరంగా అందించేందుకు గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్‌) అవసరమైతే ఫోర్స్ మేజ్యూర్‌ ప్రకటించనున్నట్లు సమాచారం. అనుకోని పరిస్థితుల్లో ఒప్పంద బాధ్యతల నుంచి రక్షణ పొందేందుకు ఈ నిబంధన ఉపయోగపడుతుంది.

భారత్‌కు ఎల్‌ఎన్‌జీ సరఫరాలో కీలక భాగస్వామిగా ఉన్న ఖతార్ ఎనర్జీ కూడా ఇదే విధానాన్ని అనుసరించింది. ప్రపంచ ఎల్‌ఎన్‌జీ అవసరాల్లో సుమారు 20 శాతం సరఫరా చేసే ఖతార్‌, భారత్‌కు ప్రతిరోజూ సుమారు 60 ఎంఎంఎస్‌సీఎండీ గ్యాస్ అందిస్తోంది. మొత్తం 195 ఎంఎంఎస్‌సీఎండీ దిగుమతుల్లో ఇది ఒక భాగమే కావడంతో, ఇతర మార్కెట్ల నుంచి కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

ప్రత్యామ్నాయ వనరులపై భారత్ దృష్టి సారించింది. ఇప్పటికే ఆస్ట్రేలియా, కెనడా దేశాలు భారత్‌కు గ్యాస్ సరఫరా చేయడానికి ముందుకు వచ్చాయి. అలాగే కొత్త ఒప్పందాల ద్వారా యూఏఈ, అమెరికా నుంచి కూడా ఇంధన వనరులు సమీకరిస్తోంది. దీంతో ఒకే దేశంపై ఆధారపడే పరిస్థితి తగ్గుతోంది. ముడి చమురు, ఎల్పీజీ కొనుగోళ్ల కోసం భారత్ ప్రముఖ ఉత్పత్తిదారులు, వ్యాపార సంస్థలతో చర్చలు జరుపుతోంది. 

అంతర్జాతీయ స్థాయిలో సమన్వయం కోసం వివిధ సంస్థలతో సంప్రదింపులు కొనసాగుతున్నాయి. చమురు రవాణా నౌకలకు బీమా సౌకర్యాల కోసం అమెరికాతో ప్రత్యేక చర్చలు జరుగుతున్నాయి. ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో సముద్ర మార్గాలపై కూడా భారత్ జాగ్రత్తలు తీసుకుంటోంది. దేశానికి వచ్చే ముడి చమూరులో కేవలం 40 శాతం మాత్రమే హుర్ముజ్ మార్గం గుండా వస్తోంది. 

మిగిలిన 60 శాతం ఇతర మార్గాల ద్వారా రావడం వల్ల ప్రమాదం తక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో పశ్చిమాసియాలో పరిస్థితులు కఠినంగా మారినా సరఫరాపై పెద్దగా ప్రభావం ఉండదని అంచనా. అదే సమయంలో పాత ఒప్పందాల ప్రకారం రష్యా నుంచి కూడా ముడి చమురు దిగుమతులు కొనసాగుతున్నాయి. వివిధ దేశాల నుంచి సరఫరాలు విభిన్నంగా ఉండటంతో ధరల ఒత్తిడి తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.