తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్ మనుసింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలో అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్న మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి ఎన్నికల అధికారి ఉపేందర్‌రెడ్డికి నామపత్రాలు అందించారు. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు.
నామినేషన్ వేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పెద్ద ఎత్తున అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. రాష్ట్రంలో ఖాళీ అయిన రెండు స్థానాలకు కాంగ్రెస్ అధిష్ఠానం మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డికి అవకాశం కల్పించింది. “రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం కల్పించిన అధిష్ఠానానికి కృతజ్ఞతలు. అవకాశం కల్పించిన అధిష్ఠానం పెద్దలందరికీ కృతజ్ఞతలు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో రాజ్యసభలో పోరాడతా.” అని నరేంద్ర రెడ్డి తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డితో కలిసి 2017లో టిడిపి నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన నరేంద్ర రెడ్డి అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర రాజకీయాల్లో కీలక స్థానాన్ని సంపాదించుకున్నారు. ముఖ్యమంత్రి కుడిభుజంగా పేరొందిన ఆయన ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సలహాదారునిగా పార్టీలో, ప్రభుత్వంలో కీలక వ్యక్తంగా కొనసాగుతున్నారు.“రాష్ట్ర నేతలు ఇప్పటివరకు నాకు ఇచ్చిన సహకారం భవిష్యత్తులో కూడా ఇస్తారని ఆశిస్తున్నా. రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేశాను. ఖర్గే, రాహుల్, సోనియా, కేసీ వేణుగోపాల్‌కు ధన్యవాదాలు. తెలంగాణ తరపున రాజ్యసభకు రెండోసారి వెళ్లడం అదృష్టంగా భావిస్తున్నా. రాష్ట్ర ప్రయోజనాల కోసం నావంతు కృషి చేస్తా” అని ప్రముఖ న్యాయవాది సింఘ్వీ తెలిపారు.
ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బరిలో లేకపోవడంతో వీరిద్దరి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. గతంలో తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లిన అభిషేక్ మను సింఘ్వీ పదవి కాలం మరికొద్ది రోజుల్లో ముగియనుంది. దానితో ఆయనకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం మరోసారి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించింది.

More Stories
రూ 350 కోట్లతో నాంపల్లి రైల్వే స్టేషన్ ఆధునీకరణ
నకిలీ డెత్ సర్టిఫికెట్లుతో ఎల్ఐసిలో రూ.1.52 కోట్లు స్వాహా
తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి