రెండు దశాబ్దాల పాటు బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగిన నితీష్ కుమార్ (75) గురువారం రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటు ఎన్‌డీఏ అభ్యర్థులు ఉపేంద్ర కుశ్వాహా, బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. అంతకు ముందు ఈసారి రాజ్యసభ ఎన్నికల కోసం తాను నామినేషన్ దాఖలు చేస్తానని ప్రకటించడం ద్వారా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు సంకేతం ఇచ్చారు.
బీహార్ లో తొలిసారి బిజెపి నేత ముఖ్యమంత్రి చేపట్టే అవకాశం ఏర్పడింది. రాష్ట్రంలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వానికి తన పూర్తి సహకారాన్ని అందిస్తానని తెలిపారు. 2005 నుంచి బిహార్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. ‘‘గత రెండు దశాబ్దాలకుపైగా బిహార్ ప్రజలు నన్ను ఎంతో విశ్వసించారు. నాకు ఎంతో సహకరించారు. ప్రజల సహకారం వల్లే నేను పూర్తి అంకితభావంతో బిహార్‌కు సేవలను అందించగలిగాను. బిహార్ ఇప్పుడు అభివృద్ధి బాటలో పయనిస్తోందంటే, దేశంలో గౌరవాన్ని పొందుతోందంటే అందుకు ప్రధాన కారణం ప్రజావిశ్వాసపు శక్తే” అని తెలిపారు.
“నేను గతంలోనూ చాలాసార్లు బిహార్ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పాను. ఇప్పుడు మరోసారి చెబుతున్నాను. ఎందుకంటే వారి నుంచి నాకు లభించిన మద్దతు అలాంటిది. పార్లమెంటరీ జీవితాన్ని ప్రారంభించిన తొలినాళ్లలో నా మనసులో ఒక కోరిక ఉండేది. బిహార్‌లోని అసెంబ్లీ, శాసన మండలితో పాటు దేశంలోని లోక్‌సభ, . రాజ్యసభల్లోనూ సభ్యుడిగా కావాలి అని నేను అనుకునే వాడిని. ఈ ఆశయాన్ని నెరవేర్చుకునేందుకు నేను రాజ్యసభకు వెళ్లాలని అనుకుంటున్నాను. అందుకే ఈసారి జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నాను” అని వెల్లడించారు.
“నేను రాజ్యసభకు వెళ్లినా, బిహార్ ప్రజలతో నా అనుబంధం అలాగే ఉంటుంది. ఈ విషయాన్ని నేను బిహార్ ప్రజలకు పూర్తి నిజాయితీతో చెబుతున్నాను. బిహార్‌ను వికాస పథంలో మున్ముందుకు తీసుకెళ్లే విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదు. ఇందుకు నావంతు పూర్తి సహకారాన్ని అందిస్తూనే ఉంటాను. తదుపరిగా బిహార్‌లో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వానికి నా తరఫున పూర్తి సహకారాన్ని అందిస్తాను’’ అని సీఎం నీతీశ్ వెల్లడించారు.
2025లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నీతీశ్ సారథ్యంలో ఎన్‌డీఏ కూటమి అఖండ విజయాన్ని సాధించింది. ఆ వెంటనే పదోసారి సీఎంగా నీతీశ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ పరిణామం జరిగిన ఏడాదిలోనే సీఎం పదవిని వదిలేసి, రాజ్యసభకు వెళ్లాలని ఆయన నిర్ణయించుకోవడం గమనార్హం. తొలిసారిగా 1985లో జనతాదళ్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా నితీశ్ కుమార్ గెలిచారు. అనంతరం నీతీశ్, జార్జ్ ఫెర్నాండేజ్ కలిసి 1994లో సమతా పార్టీని స్థాపించారు.
1996లో నీతీశ్ తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఆయనకు అవకాశం లభించింది. 2005లో బిహార్ ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి ఘన విజయాన్ని సాధించింది. దీంతో తొలిసారిగా సీఎం అయ్యే అవకాశం నీతీశ్‌కు దక్కింది. అప్పట్లో నీతీశ్‌కు చెందిన జేడీయూ, బీజేపీ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 2010 ఎన్నికల్లోనూ మళ్లీ ఎన్‌డీఏ కూటమే నెగ్గింది. కానీ 2013 జూన్‌లో నీతీశ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
బీజేపీతో దోస్తీకి కటీఫ్ చెప్పి, లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన ఆర్‌జేడీ, కాంగ్రెస్‌లతో చేతులు కలిపారు. ఈ పరిణామంతో రాష్ట్రంలోని ఎన్‌డీఏ కూటమి సర్కారు కొత్త సీఎంగా జితన్ రాం మాంఝీని నియమించారు. 2015లో జరిగిన ఎన్నికల్లో జేడీయూ, ఆర్‌జేడీ, కాంగ్రెస్‌లతో కూడిన కూటమి విజయాన్ని సాధించింది. అయితే 2017లో నీతీశ్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆర్‌జేడీ, కాంగ్రెస్‌లకు కటీఫ్ చెప్పి, మళ్లీ ఎన్‌డీఏ కూటమిలో చేరిపోయారు. ఈనేపథ్యంలో 2020లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి నీతీశ్ పార్టీ జేడీయూ పోటీ చేసింది.
ఈ ఎన్నికల్లోనూ ఎన్‌డీఏ కూటమిని విజయమే వరించింది. కానీ 2022 ఆగస్టులో నీతీశ్ సంచలన ట్విస్ట్ ఇచ్చారు. ఆయన అకస్మాత్తుగా ఎన్‌డీఏ కూటమిని వదిలేసి, ఆర్‌జేడీ, కాంగ్రెస్‌లతో చేతులు కలిపారు. ఈ దోస్తీ రెండేళ్లే కొనసాగింది. 2024 జనవరిలో నీతీశ్ మరోసారి ఎన్‌డీఏ కూటమిలో జాయిన్ అయ్యారు. 2025లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇంకోసారి ఎన్‌డీఏ కూటమి విజయఢంకా మోగించింది. వరుసగా 10వసారి సీఎం అయ్యే అవకాశాన్ని నీతీశ్ పొందారు.

More Stories
నేపాల్ ఎన్నికల్లో హిందూ రాచరికం పునరుద్ధరణకు డిమాండ్
మావోయిస్టు అగ్రనేత గణపతి అమిత్ షా సమక్షంలో లొంగుబాటు?
మార్చి 6 నుంచి 8 వరకు ఇంద్రకీలాద్రిపై ‘మహా కుంభాభిషేకం’