ఏపీ శాసన మండలిలో బుధవారం తిరుమల లడ్డూపై జరిగిన చర్చలో తీవ్ర గందరగోళం చెలరేగింది. మండలిలో లఘు చర్చ సందర్భంగా టిడిపి, వైసిపి సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. మంత్రి కె.అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ‘అధ్యక్షా మీరు క్రిస్టియన్… ఆయన క్రిస్టియన్…’ అంటూ ఏదో చెప్పబోవడంతో వైసిపి సభ్యులు తీవ్ర స్థాయిలో అభ్యంతరం చెప్పారు. అచ్చెన్నాయడు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. అధ్యక్ష స్థానానికి మతం ఎలా ఆపాదిస్తారని ప్రశ్నించారు.
ఛైర్మన్ మోషేన్ రాజు జోక్యం చేసుకుంటూ తాను క్రిస్టియన్‌ను కానని, హిందువునని స్పష్టం చేయడంతో వైసిపి సభ్యులు మరింత ఉధృతంగా తమ ఆందోళనను కొనసాగించారు. వారి నిరసనల మధ్యే ‘నేను ధృడంగా నమ్మాను. అయితే, సభలో మీరు క్రిస్టియన్ కాదని, హిందువునని చెప్పారు. నేను నా తప్పును ఒపుకుంటున్నాను’ అని అన్నారు. అయితే బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ వైసిపి సభ్యులు పోడియం పైకి ఎక్కి నినాదాలు చేయడంతో అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పారు.
‘అయితే, జగన్‌ను మాత్రం క్రిస్టియన్‌గానే చెబుతాను’ అని అనడంతో సభలో మరోసారి తీవ్ర స్థాయిలో గందరగోళం చోటుచేసుకుంది. సభలో లేని వ్యక్తి పేరు ఎలా తీసుకుంటారని వైసిపి సభ్యులు ప్రశ్నించారు. ఈ గందరగోళం మధ్యే చైర్మన్ సభను గురువారానికి వాయిదా వేశారు. ముందుగా ప్రభుత్వం తరుపున ప్రకటనకు అనుమతి ఇవ్వాలని మంత్రి పయ్యావుల కేశవ్ పట్టుబట్టారు. లఘు చర్చలో మంత్రికి ముందుగా ప్రకటన చేసే అవకాశం ఉండదని చైర్మన్ స్పష్టం చేశారు. వైసిపి ఎమ్మెల్సీ చంద్రశేఖరరెడ్డికి మాట్లాడుతూ తిరుమల పవిత్రతను టిడిపి ప్రభుత్వం ఒక పథకం ప్రకారం దెబ్బతీసిందని ఆరోపించారు.
తొలుత లేని కొవ్వును ఉన్నట్టు ప్రచారం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో సిబిఐ సిట్ అఫిడవిట్ దాఖలు చేసిన తరువాత రసాయనాలు ఉన్నాయని కొత్త పల్లవిని అందుకున్నారని తెలిపారు. చంద్రబాబు ఎన్‌డిడిబి నివేదిక ప్రకారం మాట్లాడారని వ్యక్తిగతంగా ఆరోపణలు చేయలేదని మంత్రులు పయ్యావుల, అచ్చెన్నాయుడు తెలిపారు. సిఎం అసత్య ఆరోపణలు చేసి ప్రజల మనోభావాలు దెబ్బతీశారని చెబుతూ నెయ్యి కిలో రూ.321 నుంచి రూ.658కి పెంచుకోవడం కోసం ఇంత దారుణంగా ప్రవర్తించడం అవసరమా? అని ప్రశ్నించారు.
తిరుమల లడ్డూపై చర్చలో తీవ్ర గందరగోళం ఇందాపూర్ డెయిరీ ముసుగులో హెరిటేజ్ సంస్థ తిరుమలకు నెయ్యి సరఫరా చేయడానికి పథకం రూపొందించారని ఆరోపించారు. టిడిపి సభ్యురాలు పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ వైసిపి హయంలోనే నెయ్యిలో కల్తీ జరిగిందని వైవి సుబ్బారెడ్డి అంగీకరించారని గుర్తు చేశారు. వైసిపి సభ్యులు మాధవరావు పోడియం వైపునకు వెళ్తుండగా మంత్రి రామనారాయణరెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేయడంతో వాగ్వాదం చోటుచేసుకుంది.

More Stories
నేపాల్ ఎన్నికల్లో హిందూ రాచరికం పునరుద్ధరణకు డిమాండ్
మావోయిస్టు అగ్రనేత గణపతి అమిత్ షా సమక్షంలో లొంగుబాటు?
రాజ్యసభ అభ్యర్థిగా నీతీశ్ కుమార్ నామినేషన్