బెజవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఆలయంలో పన్నెండేళ్లకు (పుష్కర కాలం) ఒకసారి మాత్రమే వచ్చే అత్యంత అరుదైన, పవిత్రమైన క్రతువు ‘మహా కుంభాభిషేకం’ను ఆగమ శాస్త్రోక్తంగా ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు మూడు రోజుల పాటు కన్నుల పండువగా జరగనుంది. దైవిక శక్తిని తిరిగి మేల్కొలిపి, ఆలయానికి పునర్జీవం పోసే ఈ మహా కుంభాభిషేక వేడుకల కోసం ఇంద్రకీలాద్రి సర్వాంగ సుందరంగా సిద్ధమైంది.
మహా కుంభాభిషేకానికి హిందూ ధర్మంలో, ఆగమ శాస్త్రాల్లో ఎంతో విశిష్ఠత ఉంది. దేవాలయాల్లో ప్రతిష్ఠించిన మూలవిరాట్ (విగ్రహాలు) ఎంతో శక్తివంతమైనవి. అయితే నిత్యం జరిగే పూజలు, అభిషేకాలు, లక్షలాది మంది భక్తుల తాకిడి వల్ల కాలక్రమేణా ఆ విగ్రహాలు తమ దైవిక శక్తిని కొంతమేర కోల్పోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
సరిగ్గా 12 ఏళ్లకు ఒకసారి ఆ దైవిక శక్తిని, చైతన్యాన్ని తిరిగి విగ్రహాల్లోకి నింపే పవిత్ర ప్రక్రియే ఈ ‘కుంభాభిషేకం’. మన శరీరానికి ధ్యానం ఎంత అవసరమో, ప్రాణశక్తిని నిలపడానికి ఆలయానికి ఈ క్రతువు అంతే ప్రాణాధారం అని వేద పండితులు వివరిస్తున్నారు. ఈ మూడు రోజుల పాటు ఇంద్రకీలాద్రిపై యజ్ఞం చేయడం ద్వారా గాలిని శుద్ధి చేస్తారు. హోమం ద్వారా అగ్నిని పవిత్రం చేస్తారు.
మంత్రోచ్ఛారణల ద్వారా ఆకాశాన్ని (శూన్యాన్ని) శుద్ధి చేస్తారు. ఇలా చేయడం వల్ల ఆలయ పరిసరాల్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి, సానుకూల శక్తి వెల్లివిరుస్తుంది. ఈ ఘట్టం ఈనెల 6వ తేదీ ఉదయం నుంచి అధికారికంగా ప్రారంభమవుతుంది. తొలిరోజు విఘ్నేశ్వరుడికి విశేష పూజలు చేస్తారు. అనంతరం పుణ్యాహవచనం, దీక్షాధారణ చేపడతారు. అంకురార్పణ, అగ్ని ప్రతిష్ఠాపనతో యజ్ఞశాల కార్యక్రమాలు శాస్త్రోక్తంగా మొదలవుతాయి.
దేశంలోని పుణ్య నదుల నుంచి, సప్త సముద్రాల నుంచి సేకరించిన పవిత్ర జలాలతో అమ్మవారికి మంత్రమయ తర్పణాలు అర్పిస్తారు. ఈ కుంభాభిషేక మహోత్సవంలో ప్రధానమైన ఘట్టం మార్చి 8వ తేదీన జరగనుంది. ఆ రోజు ఉదయం 9:34 గంటలకు దివ్యమైన మేష లగ్నంలో ఈ మహా క్రతువు జరుగుతుంది. ఆలయ విమాన గోపురంపై ఉన్న ‘బంగారు కలశానికి’ పండితులు మహా కుంభాభిషేకం నిర్వహిస్తారు.
కుంభాభిషేక సమయంలో గర్భాలయంలోని అమ్మవారి దైవ శక్తిని పండితులు తాత్కాలికంగా ఆ కలశాల్లోకి ఆవాహన చేస్తారు. అందుకే ఆ కలశానికి చేసే అభిషేకాన్ని కళ్లారా వీక్షించడం ఎన్నో జన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. ఈ వేడుకకు కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి విచ్చేస్తున్నారు. ఆయన చేతుల మీదుగా భక్తులకు అనుగ్రహ భాషణం జరగనుంది. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ప్రముఖులకు ఆలయ అధికారులు స్వయంగా వెళ్లి ఆహ్వాన పత్రికలు అందజేశారు.

More Stories
నేపాల్ ఎన్నికల్లో హిందూ రాచరికం పునరుద్ధరణకు డిమాండ్
మావోయిస్టు అగ్రనేత గణపతి అమిత్ షా సమక్షంలో లొంగుబాటు?
రాజ్యసభ అభ్యర్థిగా నీతీశ్ కుమార్ నామినేషన్