సముద్రంలో చిక్కుకుపోయిన 70 వేల టన్నుల బాస్మతి బియ్యం

సముద్రంలో చిక్కుకుపోయిన 70 వేల టన్నుల బాస్మతి బియ్యం

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్‌ దాడుల నేపథ్యంలో భారత్‌ నుంచి గల్ఫ్‌ దేశాలకు పంపిన సుమారు 60 వేల నుంచి 70 వేల టన్నుల బాస్మతి బియ్యం సముద్రంలోనే నిలిచిపోయింది. ఇరాన్‌లోని బందర్‌ అబ్బాస్‌ పోర్టు సమీపంలో కొన్ని నౌకలు నిలిచిపోయినట్టు పరిశ్రమ సంబంధికులు తెలిపారు. ఈ పరిణామం బాస్మతి ఎగుమతిదారులకు భారీ ఆర్థిక నష్టాన్ని కలిగించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌-జనవరి మధ్య కాలంలో భారత్‌ 5.38 మిలియన్‌ టన్నుల బాస్మతి బియ్యాన్ని ఎగుమతి చేసింది. ఇది గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 11 శాతం అధికం. మొత్తం ఏడాదికి 6.5 మిలియన్‌ టన్నుల రికార్డు లక్ష్యాన్ని చేరుకోవాలని పరిశ్రమ భావించింది. అయితే అమెరికా యుద్ధోన్మాద పరిస్థితుల నేపథ్యంలో ఈ లక్ష్యం సందేహాస్పదంగా మారిందని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

ఆలిండియా రైస్‌ ఎగుమతిదారుల సంఘం (ఎఐఆర్‌ఇఎ) అధ్యక్షులు సతీశ్‌ గోయల్‌ ప్రకారం యుద్ధం ఒక వారం లోపు ముగిస్తే లక్ష్యం సాధ్యమవుతుందని చెప్పారు. లేకపోతే ఆ లక్ష్యాన్ని అందుకోవడం కష్టమని తెలిపారు. కాగా ఎగుమతిదారులు వ్యవసాయ. ప్రాసెస్డ్‌ ఆహార ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ (ఎపిఇడిఎ) అధికారులతో సమావేశమై పరిస్థితిపై చర్చించనున్నారు.

పంజాబ్‌లోని తర్ణ్‌ తరన్‌ ప్రాంతం బాస్మతి ఎగుమతుల్లో కీలక కేంద్రం. అక్కడి పరిశ్రమలు 70 శాతం బాస్మతిని మధ్యప్రాచ్యానికి ఎగుమతి చేస్తాయి. యుద్ధం రంజాన్‌ నెలలో ప్రారంభం కావడంతో ఆ ప్రాంతంలో ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. చాలా వరకు సరుకులు భారత పోర్టుల వద్దే ఆగిపోవడమో, సముద్రంలో చిక్కుకుపోవడమో జరిగాయని చెప్పారు.

దీంతో చెల్లింపులు ఆలస్యం కావడం, ఒప్పందాల ఉల్లంఘన వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వివరించారు. గత రెండు నెలల్లో ఇరాన్‌ పెద్ద ఎత్తున బియ్యం కొనుగోలు చేసినట్టు సమాచారం. యుద్ధం సంభవించవచ్చని ముందుగానే ఊహించిన ఇరాన్‌ ఎక్కువగా దిగుమతి చేసుకున్నట్టు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో బాస్మతి ధర కిలోకు రూ.10-15 వరకు పెరిగింది.

2024-25లో భారత్‌ రికార్డు స్థాయిలో 6.07 మిలియన్‌ టన్నుల బాస్మతి బియ్యాన్ని ఎగుమతి చేసింది. అందులో 1.17 మిలియన్‌ టన్నులు సౌదీ అరేబియాకు, 0.86 మిలియన్‌ టన్నులు ఇరాక్‌కు వెళ్లాయి. ప్రస్తుతం షిప్పింగ్‌ కంపెనీలు ‘ఫోర్స్‌ మేజర్‌’ ప్రకటించడంతో రవాణాలో ఆలస్యం, అదనపు ఖర్చులు వచ్చే ప్రమాదం ఉందని తెలుస్తోంది. 

ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని ఎగుమతిదారులకు రక్షణ కల్పించాలని పరిశ్రమ వర్గాలు డిమాండ్‌ చేస్తున్నాయి. కాగా యుద్ధం త్వరగా ముగియకపోతే ఈ ఆర్థిక సంవత్సరంలో రికార్డు లక్ష్యాలు దెబ్బతినే అవకాశాలు కనిపిస్తున్నాయి.