ఖమ్మంలో వెలుగుమట్ల నిర్వాసితులపై లాఠీచార్జ్‌

ఖమ్మంలో వెలుగుమట్ల నిర్వాసితులపై లాఠీచార్జ్‌
ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులపై పోలీసులు ఆదివారం లాఠీలతో విరుచుకుపడ్డారు. మహిళలు, పిల్లలు, వృద్ధులని కూడా చూడకుండా దొరికినవారిని దొరికినట్టు కొట్టారు. ఇటీవల వెలుగుమట్ల భూదాన్‌ భూముల్లోని పేదల ఇండ్లను ప్రభుత్వం బుల్డోజర్లతో నేలమట్టం చేసిన నేపథ్యంలో నిర్వాసితులైనవారిని ప్రభుత్వం ఖమ్మంలోని అంబేద్కర్‌ భవన్‌, టీటీడీసీ భవనాల్లోని పునరావా స కేంద్రాలకు తరలించింది. 
 
అయితే, అక్కడ వారికి కనీస సౌకర్యాలూ కల్పించలేదు. కనీసం భోజనం కూడా ఏర్పాటుచేయలేదు. దీంతో ప్రతిపక్షాలు సొంత ఖర్చులతో కొద్ది రోజులుగా రెండు పూటలా భోజనం ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ పునరావాస కేంద్రాల్లో ఉం టున్న బాధితుల వద్దకు పలు పార్టీల నేతలు, ఆయా సంఘాల నాయకులు ప్రతిరోజూ వచ్చి పరామర్శించి వెళ్తున్నారు. ఆదివారం కూడా రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు, హైదరాబాద్‌లోని వివిధ యూనివర్సిటీలకు చెందిన నాయకులు వచ్చి పరామర్శించారు.

ఈ సమయంలో బాధితుల గోడు విన్న ఓ విద్యార్థి నాయకుడు స్పందిస్తూ బాధితులకు మద్దతుగా దీక్ష చేసేందుకు పూనుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అతడు దీక్ష చేయకుండా అడ్డుకున్నారు. అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో బాధితులంతా కలిసి పోలీసులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘మాకు మద్దతుగా ఎవరు వచ్చినా ఇలాగే అరెస్టు చేస్తున్నారెందుకు?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. 

అయినప్పటికీ, ఆ విద్యార్థి నాయకుడిని పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నించడంతో బాధితులు పోలీసులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులంతా కలిసి బాధితులు, మహిళలను ఈడ్చిపడేశారు. ఒకానొకదశలో లాఠీలకు పనిచెప్పారు. దీంతో బాధితులకు, మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ గాయాల నొప్పులు భరించలేని మహిళలు.. మిన్నంటే రోదనలతో అంబేద్కర్‌ భవన్‌ బయటకు వచ్చారు. 

బాధితులందరూ కలిసి అక్కడే ఉన్న ప్రధాన రహదారిపై పడుకొని నిరసన తెలియజేశారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని రోడ్డుపై నుంచి తొలగించేందుకు ప్రయత్నించారు. దీంతో బాధితులు అక్కడ కూడా పోలీసులను నిలదీశారు. అయినప్పటికీ బాధితులను పోలీసులు ఈడ్చిపడేశారు. ఆడ, మగ, పిల్లలు, వృద్ధులు అనే విచక్షణ కోల్పోయి లాఠీలకు పనిచెప్పారు. బూటు కాళ్లతో తొక్కుతూ, దుర్భాషలాడారు. 

ఆడ, మగ అనే తేడా లేకుండా కంటికి కనిపించిన వారందరిపైనా లాఠీలతో విరుచుకుపడ్డారు. మహిళలను మహిళా పోలీసులతోనే నిరోధించాలన్న కనీస నియమాన్ని విస్మరించి కాఠిన్యాన్ని ప్రదర్శించారు. రోడ్డుపై కూర్చున్న వారినీ వదల్లేదు. కాగా, టీటీడీసీ, అంబేద్కర్‌ భనాలను తక్షణమే ఖాళీ చేసి వెళ్లి పోవాలంటూ అధికారులు హుకుం జారీ చేయడం గమనార్హం. లేదంటే మంచినీళ్లు కూడా ఇవ్వబోమంటూ అధికారులు మొండికేస్తున్నారు.