టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఒక మహిళతో ఉన్న వీడియోను వైసీపీ విడుదల చేసి, దానిని ఆయన ‘రాసలీలలు’గా అభివర్ణించడం రాజకీయంగా పెద్ద దుమారం రేపింది. పవిత్రమైన టీటీడీ ఛైర్మన్ పదవిలో ఉంటూ ఇలాంటి పనులకు పాల్పడటం సరికాదని వైసీపీ తీవ్రస్థాయిలో విమర్శించింది. నాయుడికి ఆ పదవిలో ఉండే నైతిక అర్హత లేదని పేర్కొంటూ, ఆయన వెంటనే రాజీనామా చేయాలని వైసీపీ డిమాండ్ చేసింది. ఈ ఘటనతో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.
నాయుడు వెంటనే తన పదవికి రాజీనామా చేయకపోతే, ఆయనకు సంబంధించిన మరిన్ని వాస్తవాలను త్వరలోనే బయటపెడతామని ఈ సందర్భంగా టిటిడి మాజీ చైర్మన్, వైసిపి నేత భూమన కరుణాకర్ రెడ్డి హెచ్చరించారు. నాయుడు చెబుతున్నట్లు అది డీప్ ఫేక్ వీడియో కాద, విచారణ జరిపిస్తే అసలు రంగు బయటపడుతుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ వివాదం ఇప్పుడు టిటిడి ప్రతిష్టకు సంబంధించిన అంశంగా మారడంతో, రాజకీయ వర్గాల్లో దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తనపై జరుగుతున్న సోషల్ మీడియా దుష్ప్రచారంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తనతో పాటు ఒక మహిళ ఉన్న వీడియోను మార్ఫింగ్ చేసి, తప్పుడు అర్థం వచ్చేలా ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఆ వీడియోలో ఎలాంటి తప్పు లేదని, ఆమె తన కుటుంబ స్నేహితురాలని ఆయన వివరణ ఇచ్చారు. తమ రెండు కుటుంబాలకు గత 30 ఏళ్లుగా పరిచయం ఉందని, అందులో ఎలాంటి అసభ్యత లేదని నాయుడు మీడియా సమావేశంలో స్పష్టంచేశారు. కేవలం రాజకీయ ఉద్దేశంతోనే పాత వీడియోలు, ఫొటోలను మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
అంతకుముందు ఎక్స్ వేదికగా బీఆర్ నాయుడు స్పందిస్తూ ఏఐ సాంకేతికతను వాడుకుని తన రూపం అనుకరించేవిధం వీడియోలు తయారుచేసి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వ్యక్తిగతంగా తనను అప్రతిష్టపాలు చేసుకునేందుకు, టిటిడి ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏఐ సాంకేతికతను వాడుకుని తన రూపం అనుకరించేవిధంగా వీడియోలు తయారుచేసి ప్రచారం చేస్తున్నారని తెలిపారు.
ఈ కంటెంట్ మొత్తం అసత్యమైనదని, వక్రీకరించినది పేర్కొంటూ ఇది టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు పన్నిన పథకమని, దీని వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకసభ్య కమిషన్ విచారణ అంశం నుంచి డైవర్ట్ చేసేందుకే ఇలా చేస్తున్నారని తెలిపారు. దీనిపై తాను చట్టప్రకారం ముందుకెళ్తానని స్పష్టం చేశారు. తనపై సోషల్మీడియాలో సాగుతున్న దుష్ప్రచారం వెనుక ఉన్న కుట్రను తేల్చాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు.
More Stories
భారతదేశ డిఎన్ఎలోనే మధ్యవర్తిత్వం
బాణసంచా తయారీలో భారీ విస్ఫోటం.. 21 మంది మృతి
తిరుమలలో ప్రయోగాత్మకంగా “శ్రీవారి ముడుపు పత్రం పథకం”