తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫార్ములా ఈ-కార్ రేస్ వ్యవహారంలో భారీగా అవకతవకలు జరిగాయని, కోట్ల రూపాయలు చేతులు మారినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తు చేస్తోంది. ఇక ఈ కేసులో ఐఏఎస్ అర్వింద్ కుమార్‌ను ప్రాసిక్యూషన్ చేసేందుకు ఏసీబీ అధికారులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరగా, కొన్నిరోజుల క్రితమే అనుమతి లభించింది. ఈ క్రమంలోనే శాఖాపరమైన చర్యల్లో భాగంగా ఐఏఎస్ అర్వింద్ కుమార్‌ను సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు, ఈ ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌ను విచారణ చేసేందుకు కొన్ని నెలల క్రితమే గవర్నర్ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డిని కూడా విచారణ జరిపేందుకు గతంలోనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతి మంజూరు చేశారు. అయితే ఇప్పటికే బీఎల్‌ఎన్ రెడ్డి పదవీ విరమణ చేశారు.
ఇక ఈ కేసులో ఏసీబీ విచారణ పూర్తి అయ్యే వరకు అర్వింద్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే క్రిమినల్ కేసు నమోదు కాగా ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవలె 2 రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి 45 మంది అధికారులను బదిలీ చేసిన సమయంలో అర్వింద్ కుమార్‌కు ఏ బాధ్యతలు అప్పగించకుండా వెయిటింగ్‌లో ఉంచిన సర్కార్,తాజాగా సస్పెండ్ చేసినట్లు తెలిపింది.

More Stories
స్వదేశీ భావజాలం పునరుజ్జీవనంకై “రన్ ఫర్ స్వదేశీ”కి శ్రీకారం
దేశ రక్షణ సంస్థల పరిసరాల్లో రోహింగ్యాల నివాసాలు
కోకాపేట భూములు శారదాపీఠంకే