అమెరికాకు చెందిన ప్రముఖ ఎఐ స్టార్టప్ సంస్థ ఆంథ్రోపిక్ అభివృద్ధి చేసిన ఎఐ మోడళ్లలో సేఫ్టీ గార్డ్‌రైల్స్ ఉండటం వల్ల సైనిక కార్యకలాపాలను పూర్తి స్థాయిలో వినియోగించలేకపోతున్నామని రక్షణ శాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆ పరిమితులను ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించబోమని కంపెనీ సీఈఓ డారియో అమోడెరు స్పష్టం చేశారు.
ఈ అంశంపై అమెరికా రక్షణశాఖ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సైనిక అవసరాలకు చట్టబద్ధ వినియోగం కోసం మాత్రమే తమ డిమాండ్ అని చెబుతున్నా, అమోడెరు సహకరించడం లేదని ఆరోపించింది. అండర్ సెక్రెటరీ ఎమిల్ మైఖేల్, పెంటగాన్ ప్రతినిధులు ఆయనపై వ్యక్తిగత విమర్శలకు కూడా దిగారు. ఒక ప్రయివేట్ కంపెనీ సైనిక నిర్ణయాలను ప్రభావితం చేయకూడదు. దేశ భద్రతను పణంగా పెట్టే హక్కు ఎవరికీ లేదంటూ మండిపడ్డారు.
ఇక పెంటగాన్ స్పష్టంగా శుక్రవారం సాయంత్రం వరకు నిర్ణయం తీసుకోకపోతే ఆంథ్రోపిక్‌ను సప్లై చైన్ రిస్క్‌గా ప్రకటించి భాగస్వామ్యాన్ని రద్దు చేస్తామని హెచ్చరించింది. అవసరమైతే డిఫెన్స్ ప్రొడక్షన్ యాక్ట్‌ను ఉపయోగించి చర్యలు తీసుకునే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చింది. అయితే అమోడెరు మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
”ఏఐను సామూహిక నిఘా, స్వయంచాలక ప్రాణాంతక ఆయుధాల కోసం ఉపయోగించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం. ఒక డ్రోన్ ఎవరిని కాల్చాలో ఏఐ స్వయంగా నిర్ణయించే స్థితి ప్రమాదకరం” అని హెచ్చరించారు. మనుషుల ప్రమేయం లేకుండా ఆయుధ వ్యవస్థలు పనిచేస్తే దుర్వినియోగం జరిగే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఆంథ్రోపిక్ రూపొందించిన మోడళ్లు సున్నితమైన రక్షణ, నిఘా వ్యవస్థల్లో కూడా ఉపయోగ పడుతున్నాయి. క్లాసిఫైడ్ డేటాను విశ్లేషించడంలో, సైబర్ భద్రతలో, వ్యూహాత్మక అంచనాల్లో సహాయం చేస్తున్నాయి. అయితే వాటిలో పెట్టిన భద్రతా నియమాలు కొన్ని కీలక సైనిక ఆపరేషన్లకు అడ్డంకిగా మారుతున్నాయని రక్షణశాఖ వాదిస్తోంది.
అందుకే ఏ చట్టబద్ధ ఉపయోగమైనా అనుమతించాలనే షరతును ప్రభుత్వం ముందుకు తెచ్చింది. మరోవైపు ఆంథ్రోపిక్ మాత్రం వేరే వాదన వినిపిస్తోంది. ”చట్టబద్ధం అన్న పేరుతో అన్నింటికీ అనుమతిస్తే భవిష్యత్తులో నియంత్రణ కోల్పోతాం. ఏఐ వ్యవస్థలు ఇంకా పూర్తిగా నమ్మదగిన స్థాయికి రాలేదు. అవి తప్పు నిర్ణయాలు తీసుకుంటే పెద్ద నష్టం జరుగుతుంది” అని కంపెనీ పేర్కొంది. అందుకే ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి అని చెబుతోంది.
ఏఐను సైన్యంలో ఎంతవరకు ఉపయోగించాలి? మనుషుల నియంత్రణ ఎంతవరకు ఉండాలి? ప్రభుత్వ ఆదేశాలకు ప్రయివేట్ కంపెనీలు పూర్తిగా లోబడాలా? లేక నైతిక పరిమితులు పెట్టుకోవాలా? అన్న ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.

More Stories
దేశ ఆర్థిక వ్యవస్థ 7-7.4 శాతం వృద్ధి రేటు
మద్యం పాలసీ కేసు విచారణలో సీబీఐ వేరు, ఈడీ వేరు
ఢిల్లీ మద్యం పాలసీ కేసును కొట్టివేసిన సీబీఐ కోర్టు