విద్యా రంగ అభివ్రుద్ధి కోసం అవసరమైన సిఫారసులు చేయకుండా ఉపాధ్యాయుల జీతాలు తగ్గించాలంటూ తెలంగాణ విద్యా కమిషన్ నివేదిక ఇవ్వడం సిగ్గు చేటని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ‘‘విద్యా కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన వ్యక్తులకే నైతికత లేదు. ఎవరినీ సంప్రదించకుండా ఏకపక్షంగా ఏసీ గదుల్లో కూర్చుని రూపొందించిన నివేదిక అది. రిపోర్టును చెత్తబుట్టలో వేయండి” అని స్పష్టం చేశారు.
ఉపాధ్యాయుల మనోభావాలను దెబ్బతీసి అవమానించేలా నివేదిక ఇచ్చిందని పేర్కొంటూ ఉత్తీర్ణత మార్కులను 35 నుండి 45కు పెంచాలని చేసిన సిఫారసులను అమలు చేస్తే పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా విద్యార్థలంతా ఇకపై స్కూల్ స్థాయిలోనే ఫెయిలై ఉన్నత విద్యకు దూరమవుతారని ఆవేదన వ్యక్తం చేశారు.
“తెలంగాణలో విద్యా వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టింది. విద్యాశాఖకు గత రెండేళ్ల నుండి మంత్రి లేరు. గత ప్రభుత్వంలోనూ విద్యాశాఖలో స్కావెంజర్లు లేరు. పేద విద్యార్థుల ఆశలు కలగానే మిగిలిపోతున్నాయ్. స్కూళ్లు ఉన్న చోట టీచర్లు లేరు. టీచర్లు ఉన్న చోట విద్యార్థులు లేరు. అందరూ ఉన్న చోట కనీస సదుపాయాలు లేవు. డ్రాపవుట్స్ సంఖ్య పెరుగుతోంది. విద్యార్థులకు ప్రోత్సాహకం లేదు” అంటూ విమర్శించారు.
విద్యారంగం ఎన్నో సమస్యలతో కునారిల్లుతుంటే విద్యా వ్యవస్థను ఏ విధంగా మెరుగుపర్చాలనే సోయి లేకుండా విద్యా కమిషన్ పూర్తి భిన్నంగా నివేదిక ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోందని తెలిపారు. కనీసం విద్యార్థులు, టీచర్లు, తల్లిదండ్రులతో, విద్యా వేత్తలతో కూడా మాట్లాడిన దాఖలాల్లేవని, ఇవేమీ చేయకుండా ప్రభుత్వానికి ఆర్ధిక భారం అవుతుందనే సాకుతో టీచర్ల జీతాల్లో కోత పెట్టాలని చెప్పడం విడ్డూరం అని ధ్వజమెత్తారు.
విద్యా రంగానికి ఏళ్ల తరబడి సేవలందిస్తున్న ఉపాధ్యాయులకు సీనియారిటీ ఆధారంగా హెడ్మాస్టర్ గా ప్రమోషన్ ఇస్తున్నారని, కమిషన్ మాత్రం అందుకు భిన్నంగా నేరుగా హెడ్మాస్టర్ పోస్టుకు పరీక్షలు నిర్వహించాలని చెప్పడం పట్ల బండి సంజయ్ విస్మయం వ్యక్తం చేశారు. ఆకునూరు మురళి అర్బన్ నక్సలైట్ భావజాలం గల వ్యక్తి అని, ఆయన ఆధ్వర్యంలో కమిషన్ వేయడాన్ని బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోందని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వంద్వ విధానం అవలంబిస్తున్నారని సంజయ్ విమర్శించారు. లొంగి పోయిన మావోయిస్టులను పిలిచి ప్రోత్సహిస్తున్నారని, మరోవైపు అర్బన్ నక్సలైట్ భావజాలమున్న వాళ్లను కమిటీలు, కమిషన్లలో వేస్తున్నారని మండిపడ్డారు.

More Stories
ఎయిమ్స్ బీబీనగర్ నక్సల్ సానుభూతిపరుల ఆహ్వానంపై దుమారం
సౌందరరాజన్ కు ఆర్ఎస్ఎస్, వి హెచ్ పి, బిజెపి అశ్రునివాళి
లొంగిపోయిన మావోయిస్ట్ నేతలతో రేవంత్ రెడ్డి భేటీ