మద్యం పాలసీ కేసు విచారణలో సీబీఐ వేరు, ఈడీ వేరు

మద్యం పాలసీ కేసు విచారణలో సీబీఐ వేరు, ఈడీ వేరు

డిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన మనిలాండరింగ్‌ కేసు స్వతంత్రత కలిగిందని ఈడీ అధికారులు తెలిపారు. డిల్లీ మద్యం కుంభకోణం కేసు నుంచి మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, మనీశ్‌ సిసోదియా సహా నిందితులందరికీ డిల్లీ కోర్టు ఊరట కలిగించిన నేపథ్యంలో ఈడీ ఈ వ్యాఖ్యలు చేసింది. తమ దర్యాప్తు కేవలం సీబీఐ కేసుపై ఆధారపడి లేదని, పక్కా సాక్ష్యాధారాలతో విచారిస్తున్నామని ఈడీ అధికారులు తెలిపారు.

విజయ్ మదన్‌లాల్ కేసులో సుప్రీంకోర్టు 2022లో ఇచ్చిన తీర్పు మేరకు ప్రధాన కేసు కొట్టివేస్తే దానికి అనుబంధంగా ఉన్న మనీ లాండరింగ్ కేసు కూడా రద్దవుతుంది. అయితే, ఈడీ మాత్రం ప్రధాన కేసు ఫలితంతో సంబంధం లేకుండా మనీ లాండరింగ్‌ను ఒక స్వతంత్ర నేరంగా పరిగణించాలని కోరుతోంది. మద్యం పాలసీలో వచ్చిన అవినీతి సొమ్ము చేతులు మారడం సహా పలు అంశాల్లో తమ సాక్ష్యాలకు సీబీఐ వద్ద ఉన్నవాటికి పొంతన లేదని అధికారులు తెలిపారు.

ఈడీ కేసు విచారణకు సంబంధించి న్యాయస్థానం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదన్న అధికారులు త్వరలోనే తమ వాదనలను బలంగా వినిపిస్తామని పేర్కొన్నారు.ఇదిలా ఉండగా, ఈ కేసులో ఈడీ ఇప్పటివరకు మొత్తం ఎనిమిది ఛార్జిషీట్లు దాఖలు చేసింది. మొత్తం 40 సంస్థలను నిందితులుగా పేర్కొంది. కేజ్రీవాల్, సిసోడియాలతో సహా 18 మందిని అరెస్ట్ చేసింది. ఈడీ తన ఛార్జిషీట్లలో కేజ్రీవాల్‌ను ఎక్సైజ్ కుంభకోణంలో ‘కింగ్‌పిన్’ పేర్కొంది.

నాటి ప్రభుత్వంలోని ఢిల్లీ మంత్రులు, ఆప్ నాయకులు, ఇతరులతో కలిసి కుట్ర పన్నారని ఆరోపించింది.  మరోవైపు, ఈ పరిణామాలపై స్పందించిన కేజ్రీవాల్, తనపై నమోదైన అవినీతి కేసు స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద రాజకీయ కుట్ర అని ఆరోపించారు. తమపై తప్పుడు ఆరోపణలు చేసి రాజకీయంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.

కాగా, మద్యం పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, ఇతరులను నిర్దోషులుగా ప్రకటిస్తూ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సీబీఐ ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసిందని అధికారులు తెలిపారు. ప్రత్యేక కోర్టు విస్మరించిన, అభియోగాల స్థాయిలో పరిగణించని అనేక అంశాలను ఫెడరల్ ఏజెన్సీ గుర్తించిందని ఆ వర్గాలు తెలిపాయి.

ఢిల్లీ ఎక్సైజ్‌ కేసు కూడా అలాంటిదే ముందుగా సీబీఐ(2022 ఆగస్టు 17) అవినీతి కేసు నమోదు చేసింది. తర్వాత ఈడీ మనీలాండరింగ్‌ కోణంలో కేసు(2022 ఆగస్టు 22) పెట్టింది. కానీ, విశ్వసనీయ ఆధారాలు ఉన్నందున ఈ కేసులో మనీలాండరింగ్‌ కోణాన్ని ప్రత్యేకంగా చూడాలని ఈడీ అధికారులు పేర్కొంటున్నారు.