‘ది కేరళ స్టోరీ 2’ విడుదలపై కేరళ హైకోర్టు స్టే

‘ది కేరళ స్టోరీ 2’ విడుదలపై కేరళ హైకోర్టు స్టే

బాలీవుడ్ నుంచి రాబోతున్న వివాదాస్పద చిత్రం ‘ది కేరళ స్టోరీ 2’ సినిమా విడుదలను నిలిపివేస్తూ కేరళ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 27న ఈ చిత్రం విడుద‌ల కావాల్సి ఉండ‌గా విడుద‌లకు ఒక్క‌రోజు ముందు ఈ చిత్రంపై స్టే విధిస్తూ సెన్సార్ బోర్డు (సీబీఎఫ్సి) తీరుపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. 

ఈ సంద‌ర్భంగా ధ‌ర్మాస‌నం స్పందిస్తూ ది కేరళ స్టోరీ 2 చిత్రానికి సర్టిఫికేట్ మంజూరు చేసే సమయంలో సెన్సార్ బోర్డు తన విచక్షణను సరిగ్గా ఉపయోగించలేదని, మ‌త‌ప‌ర‌మైన అంశాల‌తో పాటు సామాజిక సామరస్యానికి భంగం కలిగించే అంశాల విషయంలో పాటించాల్సిన కనీస మార్గదర్శకాలను కూడా సెన్సార్ బోర్డ్ పట్టించుకోలేదని కోర్టు అభిప్రాయపడింది. 

ఈ సినిమా కేరళ రాష్ట్రాన్ని కించపరిచేలా ఉండ‌డ‌మే కాకుండా, తప్పుడు ప్రచారంతో మతాల మధ్య చిచ్చు పెట్టే అవకాశం ఉందని పిటిషనర్లు ఆందోళన వ్యక్తం చేయగా కేరళ పేరును వాడుతూ రాష్ట్రానికి సంబంధం లేని కథను చూపించడంపై కోర్టు కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. కేరళ రాష్ట్రం మత సామరస్యానికి ప్రతీక అని, అయితే ఈ చిత్రంతో రాష్ట్రంలో ఏదో విప‌త్తు జరిగిపోతోందనే తప్పుడు సంకేతాలు పంపిస్తోందని జస్టిస్ బెచు కురియన్ థామస్ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ నేపథ్యంలో సినిమా సర్టిఫికేషన్‌ను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించాలని, పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలపై రెండు వారాల్లోగా విచారించి నిర్ణయం తీసుకోవాలని సెన్సార్ బోర్డును కోర్టు ఆదేశించింది.  మరోవైపు, హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఈ స్టే ఉత్తర్వులను సవాలు చేస్తూ చిత్ర నిర్మాతలు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది.

2023లో విడుదలైన జాతీయ అవార్డు గెలుచుకున్న ది కేరళ స్టోరీకి సీక్వెల్ ది కేరళ స్టోరీ 2. కథనంలో చూపిన విధంగా, మోసపూరిత వివాహాలలోకి ప్రవేశించి, బలవంతపు మత మార్పిడికి గురైన ముగ్గురు యువతుల జీవితాలను ఈ చిత్రం అనుసరిస్తుంది.