నిరసన ప్రదర్శనలతో కేరళ ఆరోగ్యమంత్రికి గాయాలు

నిరసన ప్రదర్శనలతో కేరళ ఆరోగ్యమంత్రికి గాయాలు
కన్నూర్ రైల్వే స్టేషన్‌లో కెఎస్‌యు (కేరళ స్టూడెంట్స్ యూనియన్) నిర్వహించిన నల్ల జెండాల నిరసన సందర్భంగా కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ మెడ, చేతికి గాయాలయ్యాయి. మంత్రి వందే భారత్ రైలు ఎక్కడానికి వచ్చినప్పుడు రైల్వే స్టేషన్ టికెట్ కౌంటర్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. నిరసన మధ్య, మంత్రి గాయపడగా, చికిత్స కోసం ఆమెను కన్నూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.
 
కల్లియాడ్‌లో అంతర్జాతీయ ఆయుర్వే పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించి తిరిగి వస్తుండగా కన్నూర్‌ రైల్వే స్టేషన్‌లో ఆమెపై కెఎస్‌యు విద్యార్థులు దాడికి యత్నించారు. స్టేషన్ కు చేరుకునేటప్పుడు గొడవ జరిగిందని, దీనివల్ల కొంత తోసుకోవడం జరిగిందని వీణా జార్జ్ చెప్పారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోగా, వేంటనే మెడలో నొప్పి మొదలైందని చెప్పారు.
 
గత కొన్ని రోజులుగా కన్నూర్‌లోని అనేక ప్రదేశాలలో మంత్రికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. నివేదికల ప్రకారం, రైల్వే స్టేషన్‌లో ఘర్షణకు దారితీసిన పరిస్థితులను పోలీసులు పరిశీలిస్తాస్తున్నారు. ఇరిక్కూర్, తలస్సేరి, కోడ్వల్లి, చలోడ్, అయిప్పుళలో ప్రదర్శనలతో  కెఎస్‌యు జిల్లా వ్యాప్తంగా నిరసన నిర్వహించింది. కార్యకర్తలు మంత్రికి వ్యతిరేకంగా నల్ల జెండాలు ఊపినట్లు సమాచారం. 
 
ముఖ్యమంత్రి పినరయి విజయన్ వీణా జార్జ్‌ను కలవడానికి ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ సంఘటనను ఖండిస్తూ, ఈ సంఘటన “కాంగ్రెస్ పార్టీ దుర్భరమైన రాజకీయ సంస్కృతికి ప్రతిబింబం” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. “కన్నూర్‌లో ఆరోగ్య మంత్రి వీణా జార్జ్‌పై కెఎస్‌యు దాడి కాంగ్రెస్ దుష్ట రాజకీయం. కన్నూర్ రైల్వే స్టేషన్‌లో ఆరోగ్య మంత్రిపై దాడి చేసి గాయపరిచారు. అక్కడ జరిగింది కేవలం నిరసన కాదు – ఇది దురాక్రమణదారుల బృందం చేసిన ప్రదర్శన” అని విమర్శించారు.
 
కేరళ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, వైద్య నిర్లక్ష్యం కారణంగా జరిగిన ఒక సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహానికి దారితీసింది.  ఐదు సంవత్సరాలుగా దీర్ఘకాలిక కడుపు నొప్పితో బాధపడుతున్న ఒక రోగికి సంబంధించిన ఈ కేసులో, ప్రభుత్వ ఆసుపత్రిలో శస్త్రచికిత్స సమయంలో ఒక శస్త్రచికిత్స పరికరం, ముఖ్యంగా 7 సెం.మీ. ధమని ఫోర్సెప్స్, ఆమె శరీరం లోపల మిగిలిపోయాయని తరువాత తెలిసింది. ఇది కేరళలో రాజకీయ తుఫానును రేకెత్తించింది. 
 
ప్రతిపక్షాలు ఆరోగ్య సంరక్షణ విషయానికి వస్తే సాంప్రదాయకంగా రోల్ మోడల్‌గా ప్రశంసలు అందుకొంటున్న రాష్ట్రంలో వ్యవస్థాగత వైఫల్యాన్ని ఎత్తి చూపాయి. ఈ ఘటనపై రాష్ట్ర ఆరోగ్య శాఖ విచారణకు ఆదేశించి, సిబ్బందిలో కొంతమందిని సస్పెండ్ చేసింది. అయితే, ఈ సమస్య త్వరలోనే రాజకీయ వివాదంగా మారింది.  ఆరోగ్య మంత్రిపై నిరసనలకు దారితీసింది.
 
గతంలో, కోజికోడ్‌కు చెందిన ఒక రోగికి శస్త్రచికిత్స సమయంలో ఫోర్సెప్స్ మిగిలిపోయిన మరొక కేసు వెలుగులోకి వచ్చింది. పరికరం ఆమె మూత్రాశయాన్ని గుచ్చుతున్నప్పుడు నిర్లక్ష్యం బయటపడింది.