భారత ఐటీ రంగంలో గత కొన్ని రోజులుగా కుత్రిమ మేధ ప్రకంపనలు రేగుతున్నాయి. కేవలం నెల రోజుల్లోనే మన ఐటీ కంపెనీల మార్కెట్ విలువ ఏకంగా రూ. 4.5 లక్షల కోట్ల మేర తుడిచిపెట్టుకుపోయింది. కృత్రిమ మేధతో సరికొత్త టూల్స్ మార్కెట్లోకి రావడం వల్ల ఐటీ షేర్లు భారీగా పతనం అయ్యాయి. కుత్రిమ మేధ (ఏఐ) ప్రభావంతో ఐటీ ఉద్యోగాల కోత పెరగవచ్చని వస్తున్న వార్తలు ఇన్వెస్టర్లను వణికిస్తున్నాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి దిగ్గజాల షేర్లు భారీగా పడిపోయాయి.
ఆంథ్రోపిక్ తన ‘క్లాడ్ కోడ్’ టూల్తో పాత సాఫ్ట్వేర్ సిస్టమ్స్ను ఆధునీకరించే పనిని చాలా సులభతరం చేస్తామని ప్రకటించింది. దీని ప్రభావం నేరుగా ప్రపంచ ఐటీ రంగంతోపాటు భారత్ ఐటీ కంపెనీలపై కూడా పడింది. అందుకే ఐటీ షేర్లు భారీగా నష్టపోయాయి. భారతదేశానికి వెన్నెముకలా నిలిచే ఐటీ రంగం ప్రస్తుతం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. ‘సిత్రిణి రీసెర్చ్’ నివేదిక బయటకు వచ్చినప్పటి నుండి ఐటీ షేర్ల విలువ పాతాళానికి పడిపోతోంది.
కేవలం 30 రోజుల్లోనే విప్రో, ఇన్ఫోసిస్ వంటి కంపెనీల షేర్లు 25 శాతం మేర పడిపోవడం గమనార్హం. మన దేశ జీడీపీలో 10 శాతం వాటా ఇచ్చే ఈ రంగం ఇంతగా దెబ్బతినడం ఆర్థిక వ్యవస్థకు పెద్ద హెచ్చరిక అని నిపుణులు అంటున్నారు. ఐటీ కంపెనీల పతనానికి ప్రధాన కారణం కుత్రిమ మేధ. ఇప్పటివరకు అమెరికా వంటి దేశాలు తక్కువ ఖర్చుతో పనులు అవుతాయని భారతీయ ఐటీ కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చేవి. కానీ ఇప్పుడు ఏఐ కోడింగ్ ఏజెంట్ల వల్ల ఆ ఖర్చు కేవలం కరెంట్ బిల్లు అంత స్థాయికి తగ్గిపోయింది.
పలాంటిర్ అనే సంస్థ ప్రకారం, గతంలో ఏళ్ల తరబడి పట్టే ఈఆర్‌పీ మైగ్రేషన్ పనులు ఇప్పుడు ఏఐ సహాయంతో కేవలం రెండు వారాల్లోనే పూర్తవుతున్నాయి. దీనివల్ల క్లయింట్లు ఐటీ కంపెనీలకు ఇచ్చే ప్రాజెక్టులను రద్దు చేసుకుంటున్నారు. 2027 నాటికి టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ వంటి సంస్థల ఒప్పందాలు రద్దయ్యే వేగం మరింత పెరుగుతుందని సిత్రిణి నివేదిక హెచ్చరిస్తోంది.
‘అధునాతన ఏఐ ప్రొడక్ట్స్ వచ్చినప్పుడు, సంప్రదాయ ఏఐ సర్వీస్లు ఇచ్చే కంపెనీలకు ఇబ్బంది ఏర్పడుతుంది. పైగా వాటిపై మార్జిన్ ఒత్తిళ్లు ఉంటాయి. అందుకే ప్రస్తుతం దేశీయ ఐటీ స్టాక్స్ భారీగా నష్టపోయాయి. ఇక ఐటీ రంగంలో దీర్ఘకాలిక ఒత్తిడి ఉంటే అది రియల్ ఎస్టేట్ డిమాండ్, వాల్యూషన్పై ప్రభావం చూపుతుందనే అంచనాలు ఉన్నాయి. అందుకే ఇవాళ రియల్టీ స్టాక్స్ నష్టపోయాయి’ అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
More Stories
రూ. 3.7 వేల కోట్లు విలువైన అనిల్ అంబానీ నివాసం జప్తు!
బీఎస్ఎస్ఎల్ డైరెక్టర్ విలాసవంత యాత్రపై కేంద్రం కన్నెర్ర
ఏప్రిల్ 1 నుంచి ఈ20 పెట్రోల్ విక్రయం తప్పనిసరి