* యోగిని కలిసిన తర్వాత సింగపూర్ ప్రధాని
భారతదేశంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన ఉత్తర ప్రదేశ్ భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలో ఒకటిగా సింగపూర్ ప్రధాన మంత్రి లారెన్స్ వాంగ్, అభివర్ణించారు. యోగి ఆదిత్యనాథ్ ను కలిసిన తర్వాత ఆ రాష్త్ర ముఖ్యమంత్రిని సింగపూర్‌కు స్వాగతించడం ఆనందంగా ఉందని పేర్కొంటూ ఆయనతో ఉన్న ఫోటోతో పాటు, ఎక్స్ లో ఒక పోస్ట్‌ను షేర్ చేశారు.
సింగపూర్ కంపెనీలు ఉత్తరప్రదేశ్‌లో, ముఖ్యంగా లాజిస్టిక్స్, కనెక్టివిటీ, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో చురుకుగా పెట్టుబడులు పెడుతున్నాయని సింగపూర్ ప్రధాన మంత్రి వెల్లడించారు. బలమైన వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలను నిర్మించుకోవడానికి అపారమైన అవకాశాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. “ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడంపై మేము గణనీయమైన చర్చలు జరిపాము. యోగికి విజయవంతమైన పర్యటన జరగాలని కోరుకుంటున్నాను” అని ప్రధాని వాంగ్ రాశారు.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సింగపూర్ పర్యటన మొదటి రోజున, ఉత్తరప్రదేశ్ పెట్టుబడి, నైపుణ్య అభివృద్ధి రంగాలలో ప్రధాన విజయాలు సాధించింది. అధికారిక సమావేశాలు, పెట్టుబడిదారులతో సంభాషణల సందర్భంగా, అనేక అంతర్జాతీయ సంస్థలు, కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలపై సంతకం చేశాయి. మొదటి రోజున రూ. 19,877 కోట్ల మొత్తం పెట్టుబడి నిబద్ధతను ప్రకటించారు. ఇది రాష్ట్రంలో ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పనను గణనీయంగా పెంచుతుందని భావిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పారదర్శక విధాన చట్రాన్ని, త్వరిత ఆమోదాలను, బలమైన మౌలిక సదుపాయాలను అందించడానికి కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి పెట్టుబడిదారులకు హామీ ఇచ్చారు. సంతకం చేసిన ఒప్పందాలలో, అతిపెద్ద ప్రతిపాదన యూనివర్సల్ సక్సెస్ గ్రూప్ నుండి వచ్చింది. ఇది గ్రూప్ హౌసింగ్, లాజిస్టిక్స్ పార్క్, డేటా సెంటర్ కోసం రూ. 6,650 కోట్లు కేటాయించింది.
ఈ ప్రాజెక్టులు రాష్ట్రంలో పట్టణ అభివృద్ధి, పారిశ్రామిక కార్యకలాపాలు, డిజిటల్ మౌలిక సదుపాయాలను వేగవంతం చేస్తాయని భావిస్తున్నారు. అదేవిధంగా, గోల్డెన్ స్టేట్ క్యాపిటల్ (జి ఎస్ సి) ఉత్తరప్రదేశ్‌లో 100 ఎండబ్ల్యు డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి రూ. 8,000 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ రాష్ట్రాన్ని భారతదేశంలోని అగ్రశ్రేణి డేటా సెంటర్ హబ్‌లలో ఒకటిగా స్థాపించే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.
యోగి ఆదిత్యనాథ్ భారతీయ ప్రవాసులతో మాట్లాడుతూ బ్రహ్మోస్ క్షిపణి అత్యంత బలమైన వారిని కూడా కదిలించిందని తెలిపారు. “ఆపరేషన్ సిందూర్‌లో, లక్నో ప్లాంట్‌లో తయారు చేసిన బ్రహ్మోస్ క్షిపణిని ప్రయోగించారు” అని ఆయనపేర్కొన్నారు. ఇటీవలి సంవత్సరాలలో ఉత్తరప్రదేశ్ భారీ మార్పులు చోటుచేసుకున్నాయని, ప్రస్తుతం యూపీలో కర్ఫ్యూ లేదని, అల్లర్లు లేవని, అంతా బాగానే ఉందని సీఎం యోగి నొక్కి చెప్పారు.

More Stories
ముంబయి దాడుల సూత్రధారి రాణాకు కెనడా పౌరసత్వం రద్దు!
ఏఐ సమ్మిట్ లో నిరసనపై యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అరెస్ట్
ఉగ్రవాదంపై ఉక్కుపాదం.. ప్రహార్ పాలసీ