పాకిస్థాన్ – అప్ఘనిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కరాచీలో దాడి జరిగిన వెంటనే పాక్, అప్ఘన్‌పై వైమానిక దాడులు చేసింది. అందుకు ప్రతీకారం తీర్చుకుంటూ అప్ఘనిస్థాన్ కూడా పాకిస్థాన్‌పై బాంబు వర్షం కురిపించింది. ఇస్లామిక్ స్టేట్ ఖొరసాన్ (ఐసిస్ – కే) ఉగ్రవాద సంస్థ స్థావరాలని లక్ష్యంగా చేసుకుంటూ పాక్ భూభాగంలో డ్రోన్ దాడులు నిర్వహించినట్లు తాలబిన్ ప్రభుత్వం పేర్కొంది.
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తున్ ఖ్వా ప్రావిన్స్ లపై ఈ ఆకస్మిక సైనిక చర్య చేపట్టింది ఆఫ్ఘనిస్తాన్. అత్యాధునిక డ్రోన్ విమానాలు నేరుగా ఉగ్రవాదులు ఆశ్రయం పొందుతున్న రహస్య స్థావరాలపై బాంబుల వర్షం కురిపించినట్లు తాలిబన్ అధికారిక వార్తా సంస్థ టోలో న్యూస్ తెలిపింది. అక్కడ ఉండే స్థావరాల నుంచే అప్ఘనిస్థాన్‌లో పౌరులపై దాడులు, విధ్వంసకర చర్యలకు కుట్రలు పన్నుతున్నారని పేర్కొంది. అందుకే వాటిని లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడులు నిర్వహించినట్లు తాలిబన్లు తెలిపారు.
ఈ డ్రోన్ దాడుల్లో పలువురు ఐసిస్ కే సభ్యులు హతమైనట్లు తాలిబన్ ప్రభుత్వం ప్రకటించింది. తమదేశ పౌరులపై దాడులకు వ్యూహాలు రచిస్తున్న ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ చేపట్టినట్లు వెల్లడించారు. ఐసిస్ కే క్యాంప్ లన్నింటినీ మట్టుబెడతామని తేల్చి చెప్పింది. సామాన్య పౌరులకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేసింది.
అప్ఘనిస్థాన్ డ్రోన్ దాడికి రెండు రోజుల ముందు ఆదివారం రోజున పాకిస్థాన్ అప్ఘనిస్థాన్ సరిహద్దుల్లో వైమానిక దాడులు నిర్వహించింది. పాక్ జరిపిన ఆ దాడుల వల్ల ఆఫ్ఘనిస్తాన్ భూభాగంలో మహిళలు, చిన్న పిల్లలతో సహా సుమారు 29 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం తన నివేదికలో పేర్కొంది. మృతుల సంఖ్య 38 దాటి ఉంటుందని ఆఫ్ఘన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి హమ్ దుల్లా ఫిద్రత్ స్పష్టం చేశారు.
పాకిస్థాన్ భద్రతా బలగాలు మాత్రం మృతులంతా ఉగ్రవాదులే అని చెబుతున్నాయి. మరోవైపు అప్ఘన్ ప్రభుత్వ ప్రతినిధి హమ్దుల్లా ఫిత్రత్ ప్రకారం పాకిస్థాన్ దాడుల్లో 38 మంది పౌరులు మృతి చెందగా మహిళలు, చిన్నారులు సహా 163 మంది గాయపడినట్లు తెలుస్తోంది. కాగా, అప్ఘనిస్థాన్ భూభాగంపై జరిగిన వైమానిక దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. అప్ఘనిస్థాన్ సార్వభౌమాధికారంపై ప్రత్యక్ష దాడగా, ప్రాంతీయ శాంతి, స్థిరత్వానికి ముప్పుగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అప్ఘనిస్థాన్‌కు భారత్ ఎప్పుడూ అండగా నిలుస్తుందంటూ ప్రకటించింది.

More Stories
భారత్ ను ఆశ్రయిస్తాం…. పాక్ కు పీఓకే ప్రజల హెచ్చరికలు
జన్మతః పౌరసత్వాన్ని సమర్థించిన అమెరికా సుప్రీంకోర్టు
పర్యావరణ నేరాలు మూడవ అత్యంత లాభదాయకమైన నేర పరిశ్రమ