* కర్మల ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ కు దిగవంత మదన్ దాస్ దేవి పేరు
దేశ ఆర్థిక పురోగతిని వేగవంతం చేయడానికి, ఉన్నత సాంకేతిక విద్యను అందించే ఐఐటీల మాదిరిగానే, క్షేత్రస్థాయిలో నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారుచేసే ఐటిఐలను కూడా బలోపేతం చేయాలని, కాలానికి అనుగుణంగా వాటిని ఆధునీకరించడం కూడా అత్యంత ఆవశ్యకం అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అఖిల భారత ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ తెలిపారు.
సోలాపూర్ జిల్లాలోని కర్మలలో ఉన్న ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటిఐ)కు, ఆర్ఎస్ఎస్ మాజీ సహా కార్యవాహ, ఎబివిపి మాజీ సంఘటనా కార్యదర్శి మదన్‌దాస్ దేవి స్మారకార్థం “దిగవంత మదన్‌దాస్ దేవి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్”గా నామకరణం చేసిన కార్యక్రమంలో పాల్గొంటూ దేశ ఆర్థికాభివృద్ధిలో సమాజంలోని ప్రతి వర్గం భాగస్వాములు కావాలని చెప్పారు.
ఇందుకోసం, కేవలం మహానగరాలకే పరిమితం కాకుండా, ఆదాయ వనరులు, స్వయం ఉపాధి అవకాశాలు గ్రామీణ ప్రాంతాలకు కూడా చేరాలని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వీడియో సందేశం ద్వారా శుభాకాంక్షలు తెలియజేయగా, మహారాష్ట్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి మంగళప్రభాత్ లోధా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మదన్‌దాస్ జీ తెరవెనుక ఉంటూనే దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన గొప్ప వ్యక్తి అని సునీల్ అంబేకర్ తెలిపారు. “మదన్‌దాస్ జీ సంఘ్ కఠినమైన క్రమశిక్షణ, త్యాగనిరతితో కూడిన కార్యశైలిలో రూపుదిద్దుకున్న ఆదర్శవంతమైన, అసాధారణ ప్రజా కార్యకర్త. ఎల్లప్పుడూ తెరవెనుక ఉంటూనే సంస్థకు, దేశహిత కార్యాలకు ఎలా ఊతం ఇవ్వాలన్నదే ఆయన జీవిత లక్ష్యం. చివరి శ్వాస వరకు ఆయన దానిని సంపూర్ణ అంకితభావంతో ఆచరించారు” అంటూ నివాళులు అర్పించారు.
దేశ నిజమైన పురోగతికి యువశక్తికి సరైన దిశానిర్దేశం అవసరమనే దృఢ విశ్వాసంతో ఆయన దేశవ్యాప్తంగా విద్యార్థులతో ఒక భారీ, సృజనాత్మక ఉద్యమాన్ని నిర్మించారని తెలిపారు. ప్రపంచ వాణిజ్య రంగంలో చురుకుగా ఉంటూనే భారతదేశ జాతీయ ప్రయోజనాలను ఎలా కాపాడుకోవాలో నేర్పుతూ, యువతరంలో ‘స్వదేశీ’ భావనను ఆయన బలంగా నాటారని చెప్పారు.
“కేవలం మహానగరాలను పెద్దవిగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం ద్వారా ఏ దేశమూ అభివృద్ధి చెందలేదు. మనం ఆర్థిక సమృద్ధి ఫలాలను గ్రామాలకు చేరవేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో బలమైన పరిశ్రమల వ్యవస్థను నెలకొల్పాలి” అని అంబేకర్ తెలిపారు. నేడు, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాలు అపారమైన భౌతిక, ఆర్థిక సంపదను కలిగి ఉన్నప్పటికీ, అక్కడ మానవ ఆనందం, శాంతి, కుటుంబ వ్యవస్థలు దెబ్బతిన్నాయని చెప్పారు.
కాబట్టి, అభివృద్ధి పథంలో పయనిస్తున్నప్పుడు, భారతదేశం కేవలం సాంకేతిక పురోగతిపైనే ఆధారపడకుండా, సాంకేతికతతో పాటు ‘మానవ, వ్యక్తిత్వ వికాసం’ అనే శాశ్వతమైన బాధ్యతకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని అంబేకర్ సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా, ఐటిఐల వంటి సంస్థలలో కూడా సమకాలీన సంస్కరణలు రావాలని స్పష్టం చేశారు.
ఈ దూరదృష్టితో, మదన్ దాస్ జీ 1989-90లో నాగ్‌పూర్‌లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ద్వారా చారిత్రాత్మకమైన “జాతీయ ఐటిఐ సదస్సు”ను నిర్వహించారని ఆయన గుర్తు చేశారు. నేడు కర్మాల ఐటిఐకి ఆయన పేరు పెట్టడం అనేది ఆయన భావజాల సంకల్పానికి ఒక అర్థవంతమైన పరిపూర్ణత అని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దివంగత మదన్ దాస్ జీ స్మృతికి నివాళులర్పిస్తూ “యువతలో దేశ నిర్మాణ చైతన్యాన్ని, జాతీయ ఐక్యతా లక్ష్యాన్ని మేల్కొల్పడంలో మదన్ దాస్ జీ కృషి సాటిలేనిది. ముఖ్యంగా ఈశాన్య ప్రాంత విద్యార్థులను జాతీయ ప్రధాన స్రవంతిలో అనుసంధానించడానికి ఆయన జీవితకాలం కృషి చేశారు” అని తెలిపారు.
నేటి కాలంలో, ఐటిఐలు కేవలం సాంకేతిక శిక్షణా కేంద్రాలు మాత్రమే కాదని, దేశం కోసం నైపుణ్యం కలిగిన, సమర్థవంతమైన, దేశభక్తి గల మానవ వనరులను సృష్టించే శక్తి కేంద్రాలు కూడా అని ముఖ్యమంత్రి చెప్పారు. అభివృద్ధి చెందిన భారతదేశ లక్ష్యాన్ని సాధించడంలో ఈ సంస్థల ప్రాముఖ్యత అద్వితీయమైనదని స్పష్టం చేశారు.
నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి మంగళప్రభాత్ లోధా మాట్లాడుతూ, “భారతదేశ ఆర్థిక వృద్ధిని (జిడిపి) పెంచడంలో, యువతను స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దడంలో మదన్ దాస్ జీ ఎప్పుడూ బలమైన మద్దతుదారుగా ఉండేవారని చెప్పారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళుతూ, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ఐటిఐ సంస్థల సమగ్ర ఆధునీకరణ కోసం రూ. 5,700 కోట్ల భారీ మొత్తాన్ని ఖర్చు చేస్తోందని చెప్పారు.
ఐటిఐలో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఎలక్ట్రికల్ కోర్సుల వంటి ఆధునిక, ఉపాధి-ఆధారిత కోర్సులు ప్రారంభించారు. రాబోయే సంవత్సరంలో మరో ఐదు కొత్త అధునాతన కోర్సులు కూడా చేర్చుతున్నారు. ఈ ప్రాంతంలో నైపుణ్యాభివృద్ధికి మరింత ఊతమిచ్చేందుకు, కర్మాల ఐటిఐలో త్వరలో ‘టాటా ఇన్‌స్టిట్యూట్’ స్వతంత్ర శాఖను ప్రారంభిస్తుంది. .

More Stories
హర్మూజ్‌లో నౌకాయాన స్వేచ్ఛ కీలకం.. ఇరాన్ అధ్యక్షునితో మోదీ
భారత్ ను ఆశ్రయిస్తాం…. పాక్ కు పీఓకే ప్రజల హెచ్చరికలు
అమర్నాథ్ యాత్రకు ఉగ్రముప్పు.. కేంద్రం అప్రమత్తం