గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ కనెక్టివిటీ పెంచేలా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కీలక సహకార ఒప్పందం కుదిరింది. సుమారు 5 లక్షల గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లకు ఫైబర్ కనెక్షన్లు అందించే లక్ష్యంతో అమెండెడ్ భారత్ నెట్ ప్రాజెక్ట్ అమలుకు అడుగు పడింది. డిజిటల్ భారత్ నిధి-రాష్ట్ర ప్రభుత్వం పరస్పర అంగీకారంతో నిధులు సమకూర్చి ప్రాజెక్టు అమలు చేసేలా చర్యలు ప్రారంభమయ్యాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాల సమక్షంలో డిజిటల్ భారత్ నిధి-ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందంపై డిజిటల్ భారత్ నిధి అడ్మినిస్ట్రేటర్ శ్యామల్ మిశ్రా, రాష్ట్ర ఐ అండ్ ఐ శాఖ స్పెషల్ సీఎస్ ఎంటీ కృష్ణబాబు సంతకాలు చేశారు. కేంద్ర సహయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ ఇన్ఫ్రా బలోపేతం, గ్రామ పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని అందించేలా సహకార ఒప్పందం కుదిరింది. భారత్ నెట్ ప్రాజెక్ట్‌ను రాష్ట్రంలో రూ.2,432 కోట్ల మేర నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్ భారత్ నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ పేరుతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎస్పివి ఏర్పాటు చేసింది.
రైట్ ఆఫ్ వే అనుమతులు, మౌలిక సదుపాయాల కల్పన, క్షేత్ర స్థాయి సమన్వయానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 13,426 గ్రామ పంచాయతీలలో ప్రాజెక్టు అమలు చేసేలా ప్రణాళికలు రూపొందించారు. 1,692 ఫేజ్-I పంచాయతీల్లోని నెట్ వర్క్‌ను అప్ గ్రేడ్ చేయడం, 11,254 ఫేజ్-II లోని గ్రామాల డిజటల్ కనెక్టివిటీని పూర్తి చేయడం ఇక కొత్తగా ఏర్పడిన 480 గ్రామ పంచాయతీలకు కనెక్టివిటీ ఇచ్చేలా చర్యలు తీసుకోనున్నారు.
3942 గ్రామాల్లో డిమాండ్ ఆధారంగా లాస్ట్ మైల్ కనెక్టివిటీ పెంచనుంది. డిజిటల్ కనెక్టివిటీ ద్వారా డిజిటల్ గవర్నెన్స్, ఆన్లైన్ విద్య, టెలిమెడిసిన్, డిజిటల్ చెల్లింపులు, ఈ-గవర్నెన్స్ వంటి సేవలను మరింత బలోపేతం చేసేలా ప్రణాళికలను ప్రభుత్వం రూపొందించారు. వికసిత్ భారత్ సాధనలో గ్రామీణ డాక్ సేవక్‌లు ముందుండాలని సీఎం చంద్రబాబు చెప్పారు.
ఏ పని కావాలన్నా వాట్సప్ గవర్నెన్స్ ద్వారా అందిస్తున్నామని, పార్శిల్ పంపిణీలో గ్రామీణ డాక్ సేవక్‌లను వినియోగించుకుంటామని పేర్కొన్నారు. సూపర్ సిక్స్ పథకాల అమల్లో గ్రామీణ డాక్ సేవక్‌ల సేవలను కొనియాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో గుంటూరులోని సత్యసాయి ఆధ్యాత్మిక సిటీలో ‘గ్రామీణ డాక్ సేవక్’ సమ్మేళనం నిర్వహించారు. ఉత్తమ గ్రామీణ డాక్ సేవక్‌లకు అవార్డులు ప్రదానం చేశారు.

More Stories
స్వచ్ఛ భారత్‌కు స్ఫూర్తి ప్రదాత సంత్ గాడ్గే మహరాజ్
కర్ణాటకలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నసీర్ రాయచోటిలో అరెస్ట్
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ఏకసభ్య కమిటీ