డిల్లీలో నిర్వహించిన ప్రపంచస్థాయి ఏఐ సదస్సును కాంగ్రెస్ పార్టీ మురికి, సిగ్గులేని రాజకీయాలకు వేదికగా మార్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సదస్సులో కాంగ్రెస్ కార్యకర్తలు అర్ధనగ్న ప్రదర్శనలు చేయడంపై స్పందించిన మోదీ, దేశానికి ఆ పార్టీ నిజస్వరూపం తెలుసని, మళ్లీ బట్టలు విప్పాల్సిన అవసరం ఏంటని ఎద్దేవా చేశారు.
ఆదివారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్ మెట్రో, నమో భారత్ కారిడార్‌ను ప్రారంభించారు. అలాగే రూ. 12,930 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రపంచం ముందు దేశం పరువు తీస్తున్నారని పేర్కొంటూ భారతదేశం గ్లోబల్ టెక్ హబ్‌గా ఎదుగుతున్న తరుణంలో, ఇటువంటి చర్యలు దేశ ప్రతిష్ఠను దిగజార్చుతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
“కాంగ్రెస్ నాయకులు మోదీని ద్వేషిస్తారు. వారు నా సమాధిని తవ్వాలని చూస్తున్నారు. నా తల్లిని అవమానించడానికి కూడా వెనుకాకడరు. ఏఐ గ్లోబల్ సమ్మిట్ బీజేపీ కార్యక్రమం కాదు. ఆ సమ్మిట్‌కు ఏ బీజేపీ నాయకుడు హాజరు కాలేదని కాంగ్రెస్ గుర్తుంచుకోవాలి. ఇది దేశం గర్వించే పని. కానీ కాంగ్రెస్ జాతీయ గౌరవాన్ని ఉల్లంఘించింది. కాంగ్రెస్ ఈ అవినీతి విధానాన్ని దేశం మొత్తం ఖండిస్తోంది” అంటూ ప్రధాని ధ్వజమెత్తారు.
“ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పుడు భారత్‌తో వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకున్నప్పటికీ, అభివృద్ధి చెందిన దేశాలతో ఒప్పందాలు చేసుకోలేకపోయాయి. ఎందుకంటే అప్పట్లో, స్కామ్‌లకు పేరుగాంచిన కాంగ్రెస్ ప్రభుత్వంతో వ్యవహరించడానికి ప్రపంచం సంకోచించింది. కానీ నేడు, అభివృద్ధి చెందిన దేశాలు భారత్‌తో వాణిజ్యం చేసేందుకు ఆసక్తిగా ఉన్నాయి. ఇప్పుడు 21వ శతాబ్దపు సవాళ్లకు పరిష్కారాలను అందించగల శక్తి భారత్ అని ప్రపంచం భావిస్తోంది” అని ప్రధాని మోదీ తెలిపారు.
కాంగ్రెస్- సమాజ్‌వాదీ పాలనలో మౌళికసదుపాయాల కుంభకోణాల వల్ల అభివృద్ధి కుంటుపడిందని ప్రధాని మోదీ విమర్శించారు. మెట్రో సంబంధిత సాంకేతిక పరిజ్ఞానాన్ని చాలా వరకు దిగుమతి చేసుకోవాల్సి వచ్చిందని, దానితో కాంగ్రెస్ హయాంలో దేశంలో మెట్రో సేవలు 5 నగరాలకే పరిమితమై ఉండేవని, ఇప్పుడు అవి 25 నగరాలకు పైగా విస్తరించాయని వివరించారు.

More Stories
బాన్సువాడలో భక్తి గీతం పెట్టుకున్న మహిళలపై దాడి
కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ సవాళ్లు, ప్రతిసవాళ్లు మధ్య ఉద్రిక్తత
భారత్- బ్రెజిల్ మధ్య వ్యూహాత్మక అవగాహన