లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి

లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి
మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆసిఫాబాద్‌ అడవుల్లో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు దేవ్‌జీ అలియాస్‌ తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి లొంగిపోయారు. వీరితో  పాటు 16 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దేవ్‌జీ ప్రస్తుతం కేంద్ర మావోయిస్టు పార్టీ సెక్రటరీ జనరల్‌గా కొనసాగుతున్నారు.  నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌ తర్వాత మావోయిస్టు పార్టీకి దేవ్‌జీ సారథ్యం వహిస్తున్నారు. ఇక మల్లా రాజిరెడ్డి కేంద్ర మావోయిస్టు పార్టీ సెక్రటరీగా పనిచేస్తున్నారు.

ఈ ఏడాది మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్రం ‘ఆపరేషన్ కగార్’ పేరిట ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా జన జీవన స్రవంతిలో కలిసి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలంటూ మావోయిస్టులకు కేంద్రం పిలుపునిచ్చింది. దాంతో పలువురు మావోయిస్టులు ప్రభుత్వం ఎదుట లొంగిపోయారు.  మరికొంత మంది ఎన్‌కౌంటర్‌లో మరణించారు. పలువురు మావోయిస్టులు అరెస్టయ్యారు.

మరోవైపు ఆపరేషన్ కగార్ కోసం నిర్దేశించుకున్న సమయం మరికొద్ది రోజుల్లో ముగియనుంది. అలాంటి వేళ మావోయిస్టుల కోసం వారి ప్రభావిత రాష్ట్రాల్లో భద్రత బలగాలు జల్లెడ పడుతున్నాయి.  దీంతో మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టలోకి మావోయిస్టుల అగ్రనేతలు దేవ్ జీతోపాటు పలువురి నేతలు ప్రవేశించారంటూ నిఘా వర్గాల నుంచి కేంద్ర భద్రతా బలగాలకు సమాచారం అందింది.

దాంతో కర్రెగుట్టలో ఇటీవల జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌‌లో పలువురు మావోయిస్టులు మరణించారు. వీరిలో అగ్రనేతలు ఉన్నారంటూ చర్చ జరిగింది. దేవ్ జీ లక్ష్యంగా కర్రెగుట్టల్లో కూబింగ్ నిర్వహించారంటూ ఈ ఎన్‌కౌంటర్ సమయంలో ప్రచారం జరిగింది.