దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తయిబా (ఎల్ఈటి) కుట్ర పన్నింది. ఈ మేరకు నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో ఢిల్లీ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీలోని ఎర్రకోట, చాందీనీ చౌక్ ప్రాంతాల్లోని ప్రముఖ దేవాలయాలే లక్ష్యంగా ఎల్ఈటీ దాడులకు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి.
చాందీనీ చౌక్ ప్రాంతంలోని ఒక దేవాలయంపై ఐఈడీతో దాడి చేసేందుకు ఉగ్రవాదులు వ్యూహం పన్నుతున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఫిబ్రవరి 6న పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లోని ఒక మసీదులో జరిగిన పేలుడుకు ప్రతీకారంగా, భారత్‌లోని ప్రముఖ ధార్మిక స్థలాలపై దాడులు చేయాలని లష్కరే ప్లాన్ చేస్తోందని నిఘా వర్గాలు చెబుతున్నాయి.
కేవలం డిల్లీలోనే కాకుండా, దేశంలోని ఇతర ప్రాంతాల్లోని ప్రముఖ దేవాలయాలు కూడా ఉగ్రవాదుల హిట్ లిస్టులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. డిల్లీలోని కీలక, రద్దీ ప్రదేశాల్లో శనివారం భద్రతను కట్టుదిట్టం చేసింది. మతపరమైన, వారసత్వ ప్రదేశాలతో పాటు ఎర్రకోట చుట్టుపక్కల ప్రాంతాలు, చాందినీ చౌక్‌లో బలగాలను మోహరించినట్లు అధికారులు తెలిపారు.
కేంద్ర బలగాలు, ఢిల్లీ పోలీసు విభాగాలు కలిసి నిరంతర పర్యవేక్షణను కొనసాగిస్తున్నాయని పేర్కొన్నారు. సీసీటీవీ పర్యవేక్షణలో నిరంతరం గస్తీ, వాహన తనిఖీలు ముమ్మరం చేశామని తెలిపారు. బాంబు నిర్వీర్య దళాలు, డాగ్ స్క్వాడ్ బృందాలను వ్యూహాత్మక ప్రదేశాల్లో సిద్ధంగా ఉంచినట్లు వారు తెలిపారు.
అదేవిధంగా, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా అనుమానస్పద వ్యక్తులు కనిపించినా, ఏదైనా అనుమానాస్పద వస్తువులు లేదా కార్యకలాపాల గురించి తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు. అయితే, ఈ విషయంపై ప్రజలు ఎటువంటి భయాందోళన అవసరం లేదని, ఈ చర్యలు ముందస్తు జాగ్రత్తలుగా అధికారులు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, గతేడాది నవంబర్ 10న ఎర్రకోట సమీపంలో మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 సమీపంలో పేలుడు పదార్థాలతో నిండి ఉన్న కారు పేలి దాదాపు 13 మంది మరణించారు. 20 మందికి పైగా గాయపడ్డారు. కాగా, పేలుడు ఘటనతో దేశ రాజధాని ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పేలుడు దాటికి అక్కడే పార్కింగ్ చేసి ఉన్న వాహనాలు కాలిబూడిదయ్యాయి.

More Stories
పిల్లల లైంగిక వీడియోలు అమ్మిన దంపతులకు మరణశిక్ష
గుండెపోటు మరణాల్లో 20% భారత్‌లోనే!
విమానాల్లో దురుసుగా ప్రవర్తిస్తే నెలపాటు నిషేధం!