విశాఖ సాగర తీరంలోని అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష ప్రారంభమైంది. ప్రధానంగా ఆరు వరుసల్లో 71 యుద్ధ నౌకలు పరేడ్ నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విశేష అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రం నుంచి ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లు పాల్గొన్నారు.
వీరితో పాటు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి, చీఫ్ ఆఫ్ డిఫెన్సె స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, తూర్పు నౌకాదళ వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లాలు పాల్గొన్నారు. నేవీ సిబ్బంది గౌరవ వందనాన్ని రాష్ట్రపతి ముర్ము స్వీకరించారు. అనంతరం ఐఎన్ఎస్ సుమేధ నౌకపై రాష్ట్రపతితో పాటు గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎంలు ప్రయాణించారు.
విశేషం ఏంటంటే ఈ కార్యక్రమంలో రష్యా, ఆస్ట్రేలియా, యూఏఈ తదితర దేశాల నుంచి వచ్చినటువంటి మొత్తం 19 విదేశీ నౌకలు, భారత నేవీకి చెందిన మరో 45 నౌకలు, కోస్ట్‌గార్డ్, మర్చంట్ నేవీ, పరిశోధన నౌకలు ఒక 7 అంతర్జాతీయ యుద్ధనౌకలు సమీక్షలో పాల్గొనడం గమనార్హం. అంతర్జాతీయ యుద్ధనౌకల సమీక్షలో భాగంగా ఆర్కేబీచ్ ప్రధాన కేంద్రంగా సిటీ పరేడ్, నౌకాదళం విన్యాసాలు, ఫైర్, డ్రోన్ షోలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
అంతర్జాతీయ యుద్ధ నౌకల సమీక్ష ప్రపంచ దేశాల మధ్య ఐక్యతకు, నమ్మకాన్ని, గౌరవాన్ని, పరస్పర సహకారానికి అద్దం పట్టిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. భారత నౌకాదళం ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ సమర్థంగా పని చేస్తుందని కితాబిచ్చారు. దేశ తీర ప్రాంత ప్రయోజనాలు కాపాడటంలో నేవీది కీలకపాత్ర అని రాష్ట్రపతి తెలిపారు. సముద్ర వాణిజ్యంలో సైతం నేవీ సుస్థిరత తీసుకొచ్చిందని ఆమె పేర్కొన్నారు.
వివిధ జెండాలు కలిగిన నౌకలు, వివిధ దేశాల నావికులు ఐక్యతా స్ఫూర్తిని ప్రదర్శిస్తారు. ఈ సమైక్యతా స్ఫూర్తిని ఈ సమీక్ష యొక్క ఇతివృత్తంను “సముద్రాల ద్వారా ఐక్యత”లో బాగా ప్రతిబింబించారని ఆమె అభివర్ణించారు. ఈ సమిష్టి నావికా బలం నిబద్ధత, సంకల్పం అన్ని సవాళ్లను అధిగమించగలదనే సానుకూల సందేశం అని ఆమె తెలిపారు.
సముద్ర రంగం సహా అంతర్జాతీయ సంబంధాలకు భారతదేశం విధానం ‘వసుధైవ కుటుంబకం’ లేదా ‘ప్రపంచం ఒక కుటుంబం’ అనే మన సిద్ధాంతం ద్వారా మార్గనిర్దేశం చేస్తుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రపంచ భద్రత, వృద్ధి, స్థిరత్వం, భాగస్వామ్యాల ద్వారా నిర్మించబడతాయనే జ్ఞానాన్ని ఈ విధానం ప్రతిబింబిస్తుందని ఆమె చెప్పారు.
ఈ భాగస్వామ్య స్ఫూర్తి శాశ్వత ప్రపంచ క్రమంకు పునాది అని, అందువల్ల, మంచి సముద్ర క్రమం సారూప్యత కలిగిన భాగస్వాముల మధ్య సమిష్టి బాధ్యత, సహకార చర్యపై ఆధారపడి ఉంటుందని భారతదేశం విశ్వసిస్తుందని రాష్ట్రపతి తెలిపారు. ఈ నౌకాదళ సమీక్ష భారతదేశం మహాసాగర్ దార్శనికతను కూడా ముందుకు తీసుకెళ్తుందని ఆమె పేర్కొన్నారు.

More Stories
కుత్రిమ మేధలో దేశ భవిష్యత్ చూస్తున్నాం
ఏఐ సదస్సులో చైనా రోబో డాగ్‌పై వివాదం
చంచల్‌గూడ జైలు నుంచి పాకిస్థాన్‌కు ఫోన్ కాల్స్!