*ఎస్ఎఫ్ఐ కార్యకర్తల దుశ్చర్యగా ఏబీవీపీ అభివర్ణన
ఆంధ్ర విశ్వవిద్యాలయ (ఏయూ) ప్రాంగణంలో మంగళవారం సాయంత్రం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ‘వందేమాతరం’ గేయాన్ని అభ్యసిస్తున్న అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ), ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై ఎస్ఎఫ్ఐకి చెందిన వారు సామూహికంగా దాడికి పాల్పడటం క్యాంపస్లో కలకలం రేపింది. వందేమాతరం గేయం రాసి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ఏబీవీపీ కార్యకర్తలు నిత్యం క్యాంపస్లో గేయ అభ్యాస కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో మంగళవారం నాటి కార్యక్రమానికి విదేశీ భావజాలం గల కొందరు అధ్యాపకులు, ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ముందస్తు ప్రణాళికతో అడ్డు తగిలారని ఏబీవీపీ ఆరోపించింది. కర్రలు, రాళ్లతో విరుచుకుపడి కార్యకర్తలను గాయపరిచారని పేర్కొంది ఈ ఘటనను ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకట్ గోపి తీవ్రంగా ఖండించారు. ‘భారత్ మాతా కి జై’ అని నినదించడం దేశభక్తికి నిదర్శనమే తప్ప మతపరమైన చర్య కాదని ఆయన స్పష్టం చేశారు.
వందేమాతరం నినాదాన్ని అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని, ఏబీవీపీ అస్తిత్వాన్ని దెబ్బతీయడానికే ఈ దాడులకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. ప్రస్తుతం విశాఖలో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము పర్యటించే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ జరుగుతున్న తరుణంలోనే ఈ ఘర్షణలు జరగడం వెనుక అంతర్జాతీయ కుట్ర దాగి ఉందేమోనని వెంకట్ గోపి అనుమానం వ్యక్తం చేశారు.
గత కొద్ది కాలంగా ఎస్ఎఫ్ఐ వర్గీయులు సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల ద్వారా విద్యార్థుల్లో దేశ వ్యతిరేక భావజాలాన్ని నూరిపోస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
కాగా, ఆంద్ర యూనివర్సిటీలో కమ్యూనిస్టు భావజాలం కలిగిన కొందరు ముష్కరులు చేసిన దాడిని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని స్పష్టం చేస్తూ ఇలాంటి దాడులు పిరికిపంద చర్యలని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిస్టు పార్టీ ఉనికి ఎక్కడా లేదని, వారు కేవలం గోడల మీద రాసుకునే రాతలకే పరిమితమయ్యారని ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు,
గతంలో వారిని సిద్ధాంతపరమైన ప్రత్యర్థులుగా భావించేవాళ్లమని, కానీ నేడు వారి పరిస్థితి చూస్తుంటే సానుభూతి కలుగుతోందని చెప్పారు . ఈ మారుతున్న ప్రపంచంలో, పోటీ తత్వంతో ఎదగాలని, హింసను వీడి ప్రజాక్షేత్రంలో ప్రజల హృదయాలను గెలవాలని వారికి హితవు పలికారు. ప్రస్తుతం జరుగుతున్న ఆర్ఎస్ఎస్ శత జయంతి ఉత్సవాల నేపథ్యంలో, తాము ఇంకా ఉన్నామని నిరూపించుకోవడానికి ఎక్కడో ఒకచోట ఇలాంటి దాడులు చేయడం వారి భావ దారిద్రానికి నిదర్శనమని తెలిపారు.
ఆర్ఎస్ఎస్ పరివార సంస్థల వైపు కన్నెత్తి చూసే ధైర్యం లేకనే ఇలాంటి చిల్లర దాడులకు పాల్పడుతున్నారని చెప్పారు. ఇలాంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే, భవిష్యత్తులో ఒకటికి పది రెట్లు ఫలితాన్ని అనుభవిస్తారని హెచ్చరించారు. ఈ దాడిపై మేము మౌనంగా ఉండబోమని, దీనికి ఖచ్చితంగా తగిన రీతిలో జవాబు చెప్తామని స్పష్టం చేశారు.

More Stories
హిందూ కుటుంబాలు ముగ్గురు పిల్లలకు జన్మ ఇవ్వాలి
మోహన్ బాబుకు హైకోర్టులో చుక్కెదురు
‘ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్’గా స్మృతి మంధాన