‘ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్‌’గా స్మృతి మంధాన

‘ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్‌’గా స్మృతి మంధాన

టీమ్‌ఇండియా మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన ప్రతిష్టాత్మక అవార్డును దక్కించుకున్నారు. 2025 ఏడాదికి గానూ ప్రతిష్టాత్మక బీబీసీ ‘ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును స్మృతి సొంతం చేసుకున్నారు. గతేడాది (2025) టీమ్‌ఇండియా ఐసీసీ వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించడంతో పాటు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)ను రెండోసారి ఒమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఛాంపియన్‌గా నిలబెట్టినందుకు ఆమెకు ఈ అవార్డు దక్కింది.

తీవ్రమైన పోటీని ఎదుర్కొని ‘ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును స్మృతి మంధాన దక్కించుకున్నారు. టీమ్‌ఇండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, చెస్ సంచలనం దివ్యా దేశ్‌ముఖ్, షూటర్ సురుచి సింగ్, అథ్లెట్ జ్యోతి యర్రాజీ ఈ అవార్డు కోసం పోటీపడ్డారు.  తనకు ‘ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్’ ఆవార్డు ఇచ్చినందుకు ఆమె బీబీసీకి ధన్యవాదాలు తెలిపింది. 2025 మహిళా క్రికెట్‌కు చాలా ప్రత్యేకమైన సంవత్సరమని పేర్కొంది. 

టెన్నిస్ లెజెండ్ లియాండర్ పేస్, పారాలిపింక్ స్టార్ దీపా మాలిక్, లాంగ్ జంప్ ఐకాన్ అంజు బాబీ జార్జ్‌లతో కూడిన గ్రాండ్ జ్యూరీ ఈ అవార్డు విజేతలను ఎంపిక చేసింది.  చెస్ గ్రాండ్‌ మాస్టర్ దివ్యా దేశ్‌ముఖ్ 2025 సంవత్సరానికి గానూ బీబీసీ ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును దక్కించుకున్నారు. 2024 పారిస్ పారాలింపిక్స్‌లో అథ్లెటిక్స్‌ విభాగంలో దేశానికి రెండు కాంస్య పతకాలు అందించిన ప్రీతి పాల్‌ ‘పారా స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్‌’గా ఎంపికైంది. 

షూటర్ అంజలి భగవత్ బీబీసీ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును సాధించింది.  2025లో జరిగిన ఐసీసీ ఒమెన్ వరల్డ్‌కప్‌లో టీమ్‌ఇండియాకు స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా వ్యవహరించారు. ఈ టోర్నీలో 434 పరుగులు సాధించి భారత్ విశ్వవిజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించారు. అలాగే డబ్ల్యూపీఎల్‌ ఫ్రాంచైజీ అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. 

ఈ క్రమంలో ఆర్సీబీ జట్టుకు వరుసగా రెండోసారి డబ్ల్యూపీఎల్ ట్రోఫీని అందించారు. దీంతో తన నాయకత్వ పటిమను మరోసారి నిరూపించుకున్నారు. 16 ఏళ్ల వయసులో స్మృతి మంధాన అంతర్జాతీయ క్రికెట్‌లోకి ప్రవేశించింది. ఇప్పటివరకు 7 టెస్టులు ఆడి 629 పరుగులు చేసింది. అందులో రెండు సెంచరీలు, మూడు అర్థ శతకాలు ఉన్నాయి. 

అలాగే 117 వన్డేల్లో 5,322 పరుగులు చేసింది. అందులో 14 శతకాలు, 34 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 158 టీ20లు ఆడిన స్మృతి ఒక సెంచరీ, 31 అర్థ శకకాలు చేసింది. ఓవరాల్‌గా పొట్టి ఫార్మాట్లో 4,118 పరుగులు చేసింది. అయితే అన్ని ఫార్మాట్లో కలిపి 17 శతకాలు బాదింది.  ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్ అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక సెంచరీలు చేసిన మహిళా క్రికెటర్‌గా నిలిచేందుకు ఓ అడుగు దూరంలో ఉంది. ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ మెగ్ లానింగ్‌ కూడా అంతర్జాతీయ ఫార్మాట్‌లో (17 సెంచరీలు) బాదింది. దీంతో ఈ రికార్డు ప్రస్తుతం ఇద్దరి పేరిట ఉంది.