ఏఐపై చర్చకు ప్రపంచాన్ని ఒకే వేదికపై తీసుకువస్తున్నాం

ఏఐపై చర్చకు ప్రపంచాన్ని ఒకే వేదికపై తీసుకువస్తున్నాం

ఢిల్లీ వేదికగా జరగుతున్న ‘ఏఐ-ఇండియా ఇంపాక్ట్ సమ్మిట్ 2026’  కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రతినిధులు హాజరవుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదకగా వారికి స్వాగతం పలికారు. ప్రపంచం ఇప్పుడు ఇండియాకు వస్తోందని అంటూఈ మెగా ఈవెంట్‌ను ప్రారంభించడానికి ముందు ఆయన ఎక్స్ లో పోస్టు చేశారు. ఏఐ ఇండియా ఇంపాక్ట్ సమ్మిట్ కోసం దేశ విదేశాల నుంచి ప్రతినిధులు రావడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు.

“ఏఐపై చర్చకు ప్రపంచాన్ని ఒకే వేదికపై తీసుకువస్తున్నాం. దిల్లీలోని భారత్​ మండపంలో జరిగే ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్​ కోసం ప్రపంచ నలుమూలల వచ్చిన నాయకులు, పారిశ్రామిక వేత్తలు, ఇన్నోవేటర్లు, పాలసీ మేకర్లు, టెక్ నిపుణులను స్వాగతిస్తున్నా. ఇది మా దేశానికి గర్వకారణం” అని ప్రధాని మోదీ రాసుకొచ్చారు. ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు ఏఐ ఇండియా ఇంపాక్ట్ సమ్మిట్ డిల్లీలోని మండపంలో జరగనుంది.

ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 20 మంది దేశాధినేతలు, 45 దేశాల నుంచి మంత్రులు హాజరుకానున్నారు. ఐక్యరాజ్యసమితి ప్రతినిధిగా సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా, స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో సాంచెజ్, శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసానాయక, భూటాన్, నెదర్లాండ్స్, గ్రీస్, ఫిన్లాండ్ వంటి దేశాల ప్రధానులు, యూఏఈ క్రౌన్ ప్రిన్స్ కూడా ఈ సదస్సులో పాల్గొంటున్నారు.

ఈ సమ్మిట్​తో పాటు ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్​పో’ కూడా జరుగుతుంది. ఇది ఏఐ పాలసీ, ఇన్నోవేషన్, అమలు ఇలా అన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చేలా రూపకల్పన చేశారు. గ్లోబల్ టెక్ కంపెనీలు, స్టార్టప్‌లు, కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాల పాల్గొనున్నాయి.

ఈ ఎక్స్​పోలో ఏఐ ఎకోసిస్టంలో అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని హైలైట్ చేస్తూ 13 దేశాల పెవిలియన్​లను ఏర్పాటు చేశారు. పీపుల్-ప్లానెట్- ప్రోగ్రెస్ అనే మూడు ప్రధాన థీమ్​లుగా ఈ ఎక్స్​పోను విభజించారు. 300కి పైగా ఎగ్జిబిషన్ పెవిలియన్లు, ప్రత్యక్ష డెమో ప్రదర్శనలు ఉంటాయి. వ్యవసాయం నుంచి విద్య, ఆరోగ్యం వరకు వివిధ రంగాల్లో ఏఐ ఎలా ఉపయోగపడుతుందో ప్రత్యక్షంగా చూపించనున్నారు.

600కి పైగా హై-పొటెన్షియల్ స్టార్టప్‌లు పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాయి.  వీటిలో చాలా వరకు వాస్తవ జీవితంలో ఉపయోగిస్తున్న ఏఐ సొల్యూషన్లు ఉన్నాయి. ఏఐ ఇండియా ఇంపాక్ట్ గ్లోబల్​ సౌత్​లో జరగుతున్న తొలి అంతర్జాకీయ సమ్మిట్​గా గుర్తింపు పొందింది.