దేవాలయాల పరిరక్షణపై ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేకదృష్టి పెట్టిందని, రాష్ట్రంలో టెంపుల్ టూరిజానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆధ్మాత్మిక భావన కలిగి ఉండాలని సూచించారు. గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార ఆలయ ప్రాంగణంలో మహాశివరాత్రి సందర్భంగా మహాటీవీ నిర్వహించిన `శివోఎం’ కార్యక్రమంలో పాల్గొంటూ ఏపీని టెక్నాలజీలోనే కాకుండా ఆధ్యాత్మిక కేంద్రంగానూ అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.
ఆలయాలు, పుణ్యక్షేత్రాలకు మన రాష్ట్రం ప్రసిద్ధిగాంచిందని చెబుతూ జ్యోతిర్లింగం, శక్తిపీఠం ఒకేచోట కొలువైన శ్రీశైల పుణ్యక్షేత్రం మన రాష్ట్రంలో ఉండటం అదృష్టం అని తెలిపారు. పంచారామాలు, శ్రీకాళహస్తి, లేపాక్షి, ద్రాక్షారామం, మహానంది, శ్రీముఖ లింగం, కోటప్పకొండ వంటి ఆలయాలు మన రాష్ట్రంలో ఉన్నాయని గుర్తు చేశారు.
దేవాలయాల సంరక్షణ, నిర్వహణకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెబుతూ ప్రతి ఆలయంలోనూ నిత్య దీపారాధన, నైవేద్యం పెట్టాలనేది తమ ప్రభుత్వ విధానం అని స్పష్టం చేశారు. దేవాలయాల పవిత్రత, భక్తుల విశ్వాసం పెరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అలాగే భక్తుల మనోభావాలు, సెంటిమెంట్లను గౌరవిస్తామని స్పష్టం చేశారు.
ఇటీవల కాలంలో ఆలయాలు, జాతరలకు భక్తుల రద్దీ పెరిగిందని, స్త్రీ శక్తి ద్వారా ఉచిత ప్రయాణం అందుబాటులోకి రావడంతో దేవాలయాలకు వెళ్లే మహిళల సంఖ్య పెరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఆనాడు ఎన్టీఆర్ తిరుమలలో అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా తాను ప్రాణదానం, శ్రీవారి సేవ కార్యక్రమాలు ప్రారంభించానని తెలిపారు.
దేశంలోని ప్రతి రాష్ట్ర రాజధాని సహా గ్రామీణ ప్రాంతాల్లో 5 వేల దేవాలయాలు నిర్మించాలని తలపెట్టామని వెల్లడించారు. ముఖ్యమంత్రిగా గోదావరి, కృష్ణా పుష్కరాలను మూడోసారి నిర్వహించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని ముఖ్యమంత్రి తెలిపారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పద్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ, మంత్రాలయం పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

More Stories
ఏపీ బడ్జెట్ రాష్త్ర అభివృద్ధికి ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్
ఇక శ్రీకాళహస్తిలోను గిరి ప్రదక్షిణ!
విధాన స్థిరత్వంపై దేశ భవిష్యత్