* భారత్- అమెరికా వాణిజ్య ఒప్పందంపై పరస్పర ఆరోపణలు
అమెరికాతో మధ్యంతర వాణిజ్య ఒప్పందంతో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతులకు ద్రోహం చేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించగా, ఆయన రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొట్టిపారేసారు. ఈ విషయమై పరస్పరం ఆరోపణలతో మాటల యుద్ధంకు దిగారు. దీర్ఘకాలంలో భారత వ్యవసాయ రంగంపై పట్టు సాధించడానికి మరొక దేశాన్ని అనుమతిస్తున్నారా? అని ప్రశ్నిస్తూ రాహుల్ ఎక్స్‌లో పోస్టు చేశారు. అయితే వాణిజ్య ఒప్పందంలో వ్యవసాయం, పాడి పరిశ్రమలను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా రక్షించిందని అమిత్ షా భరోసా ఇచ్చారు.
డ్రైడ్ డిస్టిలరీస్ గ్రెయిన్స్‌ను దిగుమతి చేసుకోవడం అంటే జన్యుమార్పిడి చేసిన అమెరికా మొక్కజొన్నను పాడి ఉత్పత్తిదారులకు అందించడమేనని రాహుల్ ఎక్స్లో రాసుకొచ్చారు. ఇది దేశ పాల ఉత్పత్తులను అమెరికా వ్యవసాయ పరిశ్రమపై ఆధారపడేలా చేయదా? అని ప్రశ్నించారు. సోయా నూనె దిగుమతికి అనుమతిస్తే, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ సహా దేశవ్యాప్తంగా ఉన్న సోయా రైతులపై ప్రభావం ఉండదా? అని నిలదీశారు.
అదనపు ఉత్పత్తులు అంటే పప్పుధాన్యాలు సహా ఇతర పంటలను దిగుమతులకు భారత మార్కెట్‌ను తెరవాలనే ఒత్తిడిని సూచిస్తోందని రాహుల్ తెలిపారు. వాణిజ్యయేతర అడ్డంకులను తొలగిస్తామంటే భవిష్యత్తులో జన్యుమార్పిడి పంటలపై భారత్ తన వైఖరిని మార్చుకుంటుందా? అని ప్రశ్నించారు. ఈ అంశంపై ప్రభుత్వం రైతులకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అంతకుముందు కూడా, వాణిజ్య ఒప్పందంతో దేశంలో వస్త్ర పరిశ్రమ, పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారని రాహుల్ ఆరోపించారు. ప్రధాని, ఆయన కేబినెట్ మంత్రులు ప్రజల్లో భ్రమలు కల్పిస్తున్నారని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దూరదృష్టి గల ప్రభుత్వం అయితే పత్తి రైతులు, టెక్స్‌టైల్ ఎగుమతిదారుల ప్రయోజనాలను కాపాడేలా ఒప్పందం చేసుకునేదని రాహుల్ దుయ్యబట్టారు.
ఇదిలా ఉండగా, దేశాన్ని తప్పుదారి పట్టించడంలో కాంగ్రెస్‌కు సుదీర్ఘ చరిత్ర ఉందని అమిత్ షా ఎద్దేవా చేశారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో దేశ మొట్టమొదటి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ-సీబీడీసీ ఆధారిత ప్రజా పంపిణీ వ్యవస్థను అమిత్ షా ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు.
“కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అబద్ధాలు చెప్పి ప్రజలను తప్పుదారి పట్టిస్తుంది. నాకు నవ్వు వస్తుంది. ఈ దేశ పార్లమెంట్‌లో కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ రైతులు గురించి మాట్లాడతారు. ఐరోపా సమాఖ్య, యూకేతో జరిగిన ఎఫ్‌టీఏ, అమెరికాతో జరిగిన వాణిజ్య ఒప్పందాల ద్వారా ప్రధాని మోదీ రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని ఆయన చెబుతున్నారు” అంటూ ఆయన ధ్వజమెత్తారు.
“ఈ సందర్భంగా నేను రాహుల్ గాంధీకి సవాల్ చేస్తున్నా. ఏదైనా వేదికను నిర్ణయించండి. ఎవరు రైతులకు హాని కలిగించారో బీజేపీ యువజన విభాగం అధ్యక్షుడు వచ్చి మీతో చర్చిస్తారు. ఇవాళ రాహుల్ అబద్ధాలు చెబుతున్నారని దేశ రైతులకు చెప్పడానికే ఇక్కడకు వచ్చాను. రైతులను ప్రధాని మోదీ పూర్తిగా రక్షించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.” అని అమిత్ షా భరోసా ఇచ్చారు.

More Stories
తారిఖ్ బంగ్లా ప్రధాని కావడంతో ఇరకాటంలో హసీనా భవితవ్యం
‘వైట్ కాలర్’ టెర్రర్ మాడ్యూల్ ‘అన్సార్ ఇంటీరియం’
టీ20 ప్రపంచకప్‌లో పాక్ ను చిత్తుగా ఓడించిన భారత్