భారత్ – యూకే వాణిజ్య ఒప్పందం ఏప్రిల్ నుంచే అమల్లోకి!

భారత్ – యూకే వాణిజ్య ఒప్పందం ఏప్రిల్ నుంచే అమల్లోకి!

భారత్‌- బ్రిటన్‌ మధ్య గతేడాది జులైలో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం 2026 ఏప్రిల్‌లో అమలు అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ ఒప్పందంతో ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఈ ఒప్పందం ప్రకారం, భారత్‌ నుంచి వెళ్లే 99శాతం ఎగుమతులపై సుంకాలు తగ్గనున్నాయి. 

అదేవిధంగా బ్రిటన్ నుంచి భారత్కు దిగుమతయ్యే కార్లు, స్కాచ్ విస్కీ వంటి బ్రిటిష్ ఉత్పత్తులపై కూడా సుంకాలు తగ్గనున్నాయి. ఇటీవల యూకే పార్లమెంట్‌లోని హౌస్ ఆఫ్ కామన్స్లో భారత్- యూకే సీఈటీఏపై చర్చలు నిర్వహించారు. ఆ సందర్భంగా యూకే వ్యాపార, వాణిజ్య శాఖ మంత్రి క్రిస్ బ్రయంట్ మాట్లాడారు.  ఈ ఒప్పందం ఇరుదేశాల మధ్య చారిత్రాత్మక నిర్ణయమని, దీనివల్ల యూకే వ్యాపారాలకు భారత్‌లో విస్తృత అవకాశాలు కల్పించే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

అలాగే రాబోయే రోజుల్లో ఈ ఒప్పందాన్ని అమలు చేయడానికి ముందు, రెండు సభల్లో చర్చలు, కమిటీ సమీక్షలు నిర్వహిస్తాయని ఆయన పేర్కొన్నారు.  అయితే, యూకే పార్లమెంట్ ఆమోదించిన తర్వాత పరస్పర అంగీకార తేదీని నిర్ణయించి అమలు చేయనున్నారు. అయితే, భారత్‌లో ఇలాంటి అంతర్జాతీయ ఒప్పందాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం అవసరం ఉందని తెలుస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం భారత్ కొన్ని వినియోగ వస్తువుల కోసం తన మార్కెట్‌ను తెరవనుంది. 

అందులో చాక్లెట్లు, బిస్కెట్లు, సౌందర్య ఉత్పత్తులు వంటి వస్తువులపై సుంకాలు తగ్గనున్నాయి. మరోవైపు భారత్‌కు వస్త్రాలు, పాదరక్షలు, రత్నాలు–నగలు, క్రీడా సామగ్రి, బొమ్మలు వంటి ఉత్పత్తులను యూకేకు ఎగుమతి చేయడంలో విస్తృత అవకాశాలు లభించనున్నాయి.

మరోవైపు, ఈ ఒప్పందం ప్రకారం, స్కాచ్ విస్కీపై ప్రస్తుతం ఉన్న 150 శాతం దిగుమతి సుంకాన్ని 75 శాతానికి తగ్గుతాయి. అదేవిధంగా, రానున్న రోజుల్లో వాటిని మరింత తగ్గించనున్నారు, అంటే 2035 నాటికి దాన్ని 40 శాతానికి తీసుకురానున్నారు. మరోవైపు, ఆటోమొబైల్ రంగంలో కూడా సుంకాలు తగ్గుముఖం పట్టనున్నాయి. ప్రస్తుతం ఉన్న 110 శాతం సుంకాలను ఐదేళ్లలో 10 శాతానికి తగ్గించనున్నారు. ఇది దశలవారీ కోటా విధానంలో అమలు కానుంది.

భారత్- యూకేల మధ్య కీలకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చలు 2025 మే 6నే ఓ కొలిక్కి వచ్చాయి. మొత్తానికి జులై 24న సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (సిఈటిఏ)పై భారత్- యూకేలు సంతకాలు చేశాయి. అనంతరం భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ సమక్షంలో రెండు దేశాల వాణిజ్య మంత్రులు పీయూష్‌ గోయల్‌, జోనాథన్‌ రేనాల్డ్స్‌ ఎఫ్ టి ఏపై సంతకాలు చేశారు.