“ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ఒక ఆశాకిరణం . భారత్ కుదుర్చుకుంటున్న ఇన్ని వాణిజ్య ఒప్పందాలు ఆ దేశంపై ప్రపంచానికి ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తున్నాయి. ప్రపంచ వృద్ధిలో 15 శాతం వాటా భారత్ నుండే వస్తోంది” అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ క్రిస్టాలినా జార్జీవా చెప్పిన నిజం ఇది. భారత్ , అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంతో ఇది మరోసారి నిజం అయింది.
ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతతో భారత్ నేడు ప్రపంచ వేదికపై ఒక శక్తివంతమైన ఆర్థిక శక్తీగా ఆవిర్భవిస్తుంది. గత దశాబ్ద కాలంలో మన విదేశాంగ విధానం కేవలం దౌత్య సంబంధాలకే పరిమితం కాకుండా, దేశాభివృద్ధిని పరుగులు పెట్టించే ఆర్థిక ఇంజిన్‌గా రూపాంతరం చెందింది. దీనికి తాజా నిదర్శనం అమెరికాతో కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం.
ఈ ఒప్పందం కేవలం అంకెలకు సంబంధించింది కాదు. ఇది 140 కోట్ల మంది భారతీయుల ఆత్మనిర్భరతకు దక్కిన అంతర్జాతీయ గుర్తింపు. సుమారు 190 బిలియన్ డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రాబోయే ఐదేళ్లలో 500 బిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా కుదిరిన ఈ ఒప్పందం, భారత ఆర్థిక వ్యవస్థలో నూతన అధ్యాయాన్ని లిఖించబోతోంది. ఈ ఒప్పందం ద్వారా భారతీయ ఎగుమతిదారులకు అపారమైన అవకాశాలు లభించనున్నాయి.
ముఖ్యంగా భారతీయ వస్త్రాలు, ఇంజనీరింగ్ వస్తువులు , ఫార్మా ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న దిగుమతి సుంకాలు 20 శాతం నుండి 35 శాతం వరకు తగ్గనున్నాయి. దీనివల్ల మన ఎగుమతిదారులకు ఏటా సుమారు 10 బిలియన్ డాలర్ల అదనపు ఆదాయం చేకూరుతుంది. కేవలం పెద్ద కంపెనీలే కాకుండా, దేశవ్యాప్తంగా ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అమెరికా ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రత్యేక ప్రాధాన్యత లభించనుంది.
దీని ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 25 లక్షల కొత్త ఉద్యోగాలు లభిస్తాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా, సెమీకండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అత్యాధునిక సాంకేతికత భారత్‌కు బదిలీ కావడం వల్ల మేక్ ఇన్ ఇండియా గ్లోబల్ బ్రాండ్‌గా మారుతుంది.
“భారత్ భవిష్యత్తుపై నాకు గొప్ప నమ్మకం ఉంది. ప్రపంచంలోని ఏ ఇతర పెద్ద దేశం కంటే భారత్ వద్దే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ప్రధాని మోదీ భారత ప్రయోజనాల కోసం గొప్పగా పనిచేస్తున్నారు, ఆయన హయాంలో భారత్ ప్రపంచ అగ్రశ్రేణి ఆర్థిక శక్తిగా మారడం ఖాయం” అని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ వ్యక్తం చేసిన అభిప్రాయం. అది ఆయన ఒక్కరిదే కాదు. ప్రపంచదేశాల అభిప్రాయం. అందుకే భారత్‌తో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నాయి.
ఇటీవలి కాలంలో ఐదు చారిత్రత్మక ఒప్పందాలను భారత్ కుదుర్చుకుంది. అది కూడా ఏడాది కాలంలోనే. భారత ఆర్థిక చరిత్రలో గత ఏడాది ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఎన్నడూ లేని విధంగా, ఒకే సంవత్సర కాలంలో ప్రపంచంలోని ఐదు శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థలతో భారత్ వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడం ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థిక దౌత్య విజయం.
ఈ ఒప్పందాలు కుదుర్చుకున్న దేశాల ఆర్థిక శక్తిని గమనిస్తే, ఇవి ప్రపంచ మొత్తం జిడిపి లో 50 శాతానికి పైగా వాటా కలిగి ఉంటాయి. అంటే, ప్రపంచ సంపదలో సగం వాటా ఉన్న మార్కెట్లకు నేడు భారతీయ వస్తువులకు నేరుగా మార్గదర్శకం లభించింది. ఇది మన దేశాన్ని విశ్వగురువుగా మాత్రమే కాదు, గ్లోబల్ ఎకనామిక్ హబ్ గా నిలబెట్టే చారిత్రాత్మక పరిణామం.
ఈ ఐదు ఒప్పందాల వెనుక ఉన్న వ్యూహం అత్యంత లోతైనది. యూఏఈ, ఆస్ట్రేలియా, మారిషస్ వంటి దేశాలతో పాటు ఐరోపాలోని కీలక దేశాలతో కుదిరిన ఈ ఒప్పందాల వల్ల మన దేశీయ ఉత్పత్తులపై సుంకాలు భారీగా తగ్గాయి. ఉదాహరణకు, భారతీయ వస్త్రాలు, ఆభరణాలు, వ్యవసాయ ఉత్పత్తులు ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో చౌకగా లభిస్తాయి. దీనివల్ల మన ఎగుమతులు రాబోయే కాలంలో ట్రిలియన్ డాలర్ల మార్కును సులువుగా చేరుకోగలవు.
గతంలో కాంగ్రెస్ హయాంలో వాణిజ్య ఒప్పందాలంటే కేవలం ఇతర దేశాల వస్తువులను మన దేశంలోకి అనుమతించడం అనేలా ఉండేది. కానీ నేడు, మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో మన వస్తువులు ప్రపంచాన్ని పాలించేలా నిబంధనలను రూపొందించడం జరిగింది. ఒకే ఏడాదిలో ప్రపంచ జిడిపిలో సగం వాటా ఉన్న దేశాలతో చేతులు కలపడం అనేది మన దేశ ఆర్థిక సార్వభౌమత్వానికి నిదర్శనం.
ఈ ఒప్పందాల ద్వారా కోట్లాది మంది యువతకు ఉపాధి, లక్షలాది ఎంఎస్ఎంఈలకు గ్లోబల్ మార్కెట్, , రైతులకు గిట్టుబాటు ధర లభించబోతున్నాయి. ఇది కేవలం వ్యాపారం కాదు, 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మించే దిశగా వేసిన బలమైన పునాది.
భారత్ ఒప్పందాల్లో మరో కీలక విషయం చైనాను దాటిపోవడం. గ్లోబల్ సప్లై చైన్‌లో ఇప్పుడు చైనాను దాటిపోయేందుకు మనకు ఈ ఒప్పందాలు ఉపయోగపడనున్నాయి.అయితే కాంగ్రెస్ పార్టీ ఎప్పట్లానే వాణిజ్య ఒప్పందాలపై వ్యతిరేకత ప్రచారం చేస్తోంది. అమెరికాతో జరిగిన ఒప్పందంలో రైతులకు వ్యతిరేక అంశాలు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారు. నిజానికి భారతీయ వ్యవసాయ రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో మోదీ ప్రభుత్వం ఈ ఒప్పందంలో అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించింది.
కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తున్నట్లుగా విదేశీ ఉత్పత్తులు మన మార్కెట్‌ను ముంచెత్తడం అనేది ముమ్మాటికీ అవాస్తవం. దీనికోసం ప్రభుత్వం నెగటివ్ లిస్ట్ అనే రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసింది. మన దేశంలోని చిన్న , మధ్య తరహా రైతులకు వెన్నెముకగా ఉన్న పాడి పరిశ్రమ , గోధుమలు, వరి, చెరకు వంటి కీలక పంటలను ఈ జాబితాలో ఉంచడం ద్వారా అమెరికా నుండి వచ్చే చౌకైన దిగుమతుల నుండి మన రైతులకు పూర్తి రక్షణ కల్పించారు.
అంటే, మన అంతర్గత మార్కెట్ స్థిరంగా ఉంటుంది. విదేశీ పోటీ వల్ల మన రైతుకు నష్టం కలిగే అవకాశమే లేదు. మరోవైపు, ఈ ఒప్పందం భారతీయ రైతులకు కొత్త ఆదాయ మార్గాలను తెరుస్తోంది. ఇప్పటివరకు అమెరికా వంటి దేశాలకు మన వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేయాలంటే కఠినమైన ఫైటోశానిటరీ నిబంధనలు, భారీ సుంకాలు అడ్డంకిగా ఉండేవి.
ఈ ఒప్పందం వల్ల భారతీయ మామిడి, ద్రాక్ష, దానిమ్మ , బాస్మతియేతర బియ్యం వంటి ఉత్పత్తులకు అమెరికా మార్కెట్లోకి జీరో డ్యూటీ లేదా నామమాత్రపు సుంకంతో ప్రవేశం లభిస్తుంది. దీనివల్ల మధ్యవర్తుల ప్రమేయం తగ్గి, రైతు పండించిన పంటకు అంతర్జాతీయ స్థాయిలో గిట్టుబాటు ధర లభిస్తుంది. ఇది కేవలం వ్యాపారం కాదు, మన అన్నదాతను గ్లోబల్ ఎగుమతిదారుగా మార్చే ఒక గొప్ప సామాజిక మార్పు.
విపక్షాలు చేస్తున్న మరో విమర్శ అమెరికా నుండి వచ్చే చికెన్ లెగ్స్, మాంసం ఉత్పత్తుల గురించి. ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టం చేయాలి. భారత ప్రభుత్వం మన ప్రజల మతపరమైన, సాంస్కృతిక సెంటిమెంట్లను గౌరవిస్తూ, నాణ్యతా ప్రమాణాల విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. జన్యుమార్పిడి చేసిన ఉత్పత్తులు , మన ఆహార అలవాట్లకు విరుద్ధంగా ఉండే వస్తువులపై కఠినమైన ఆంక్షలు కొనసాగుతాయి.
కాంగ్రెస్ హయాంలో విదేశీ ఒత్తిళ్లకు తలొగ్గి రైతుల నోళ్లు కొట్టిన చరిత్ర వారిది. కానీ నేడు, ఆస్ట్రేలియా , యూఏఈ ఒప్పందాల్లో మనం ఎలాగైతే మన ప్రయోజనాలను కాపాడుకున్నామో, అమెరికా విషయంలోనూ అదే పంథాను అనుసరిస్తున్నాం. ఈ ఒప్పందం వల్ల అగ్రి-టెక్నాలజీ , కోల్డ్ స్టోరేజ్ రంగాల్లో అమెరికా నుండి భారీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. పంట కోత అనంతరం జరిగే వృథాను అరికట్టడానికి ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వస్తుంది. తద్వారా రైతు పండించిన ప్రతి గింజకు విలువ లభిస్తుంది.
విపక్షాలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం రైతుల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయి కానీ, వాస్తవానికి ఈ ఒప్పందం భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే ఒక సువర్ణ అవకాశం. వికసిత్ భారత్ ప్రయాణంలో మన రైతులే అగ్రభాగాన ఉంటారని ఈ ఒప్పందం నిరూపిస్తోంది.
గతంలో యూపీఏ హయాంలో జరిగిన ఒప్పందాల మాదిరిగా కాకుండా, ఇది పరస్పర గౌరవం , సమానత్వం ప్రాతిపదికన జరిగింది. దేశం ఆర్థికంగా బలోపేతం అవుతుంటే, రాజకీయ ఉనికి కోసం అభూతకల్పనలతో విష ప్రచారం చేయడం ఆ పార్టీకి అలవాటుగా మారింది. మేధో సంపత్తి హక్కుల విషయంలో ప్రభుత్వం రాజీ పడిందని, దీనివల్ల మందుల ధరలు పెరుగుతాయని చేస్తున్న ఆరోపణలు హాస్యాస్పదం.
భారత ఫార్మా రంగం ప్రపంచానికే మెడికల్ హబ్‌గా ఉంది. మన దేశంలోని సామాన్యులకు చౌకగా లభించే జెనరిక్ మందుల లభ్యతకు ఎలాంటి ముప్పు వాటిల్లదని, పేటెంట్ చట్టాల్లో మన జాతీయ ప్రయోజనాలే పరమావధిగా ప్రభుత్వం చర్చలు జరుపుతోందని విపక్షాలు గ్రహించాలి. అలాగే డేటా ప్రైవసీ , సార్వభౌమత్వం గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది.
డిజిటల్ విప్లవం ద్వారా భారతీయుల డేటా భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం ఇప్పటికే కఠినమైన చట్టాలను రూపొందించింది. అమెరికా టెక్ కంపెనీలు భారత చట్టాలకు లోబడి ఉండాల్సిందే తప్ప, మన పౌరుల సమాచారాన్ని తరలించుకుపోవడం సాధ్యం కాదు. డేటా లోకలైజేషన్ నిబంధనల విషయంలో ప్రభుత్వం ఇసుమంతైనా వెనక్కి తగ్గలేదు.
చిన్న తరహా పరిశ్రమల భవితవ్యంపై కాంగ్రెస్ కురిపిస్తున్న మొసలి కన్నీరు కూడా రాజకీయ డ్రామాలో భాగమే. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పర్యావరణ , కార్మిక చట్టాలను పాటించడం వల్ల మన ఉత్పత్తుల నాణ్యత పెరుగుతుందే తప్ప తగ్గదు. దీనివల్ల భారతీయ వస్తువులకు గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్ లభిస్తుంది.
కాంగ్రెస్ హయాంలో పాలసీ పెరాలిసిస్ వల్ల మూతపడిన పరిశ్రమలకు, నేడు అమెరికా లాంటి పెద్ద మార్కెట్లను అందుబాటులోకి తెచ్చి మోదీ ప్రభుత్వం పునరుజ్జీవం పోస్తోంది. కోట్లాది మంది యువతకు లభించే ఉపాధిని అడ్డుకోవడమే విపక్షాల అసలు అజెండాగా కనిపిస్తోంది. ఈ ఒప్పంద చర్చల్లో పారదర్శకత లేదనే విమర్శలు కూడా అర్థరహితమైనవి.
అంతర్జాతీయ వాణిజ్య చర్చలు వ్యూహాత్మక గోప్యతతో జరుగుతాయి. ఒప్పందం పూర్తయ్యాక ప్రతి అంశం ప్రజల ముందుకు వస్తుంది. 2014కు ముందు దేశాన్ని కుంభకోణాలమయం చేసిన వారు, నేడు పారదర్శకత గురించి మాట్లాడటం విడ్డూరం. దేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వైపు అడుగులు వేస్తుంటే, ఇలాంటి అవాస్తవ ప్రచారాలతో అడ్డుకోవాలని చూడటం దేశద్రోహమే అవుతుంది.
ఈ ఒప్పందం కేవలం వ్యాపారం కాదు, నవ భారత ఆశయాలకు అమెరికా అందిస్తున్న చేయూత. 21వ శతాబ్దం భారత్‌దే అని ప్రపంచం నమ్ముతున్న తరుణంలో, అమెరికాతో కుదిరిన ఈ ఒప్పందం మన దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వైపు నడిపించే ఒక శక్తివంతమైన అడుగు.
అభివృద్ధికి అడ్డుపడటం మానుకుని, దేశ ప్రయోజనాల కోసం జరుగుతున్న ఈ బృహత్తర కార్యాన్ని విపక్షాలు గుర్తించాలి. నేడు భారత్ ప్రపంచానికి కేవలం ఒక మార్కెట్ మాత్రమే కాదు, ప్రపంచ సరఫరా గొలుసును శాసించే కీలక శక్తిగా ఎదిగింది. ఈ వాణిజ్య ఒప్పందం నవ భారత ఆశయాలకు, యువత ఆకాంక్షలకు దక్కిన గొప్ప విజయం.
More Stories
రూ.లక్ష కోట్లతో అర్బన్ ఛాలెంజ్ ఫండ్
బంగ్లాదేశ్ లో ముగ్గురు హిందువులు ఘన విజయం
మహిళా జర్నలిస్టుపై బ్రాహ్మణ కులం పేరుతో వామపక్షాల దాడి!