ఇక శ్రీకాళహస్తిలోను గిరి ప్రదక్షిణ!

ఇక శ్రీకాళహస్తిలోను గిరి ప్రదక్షిణ!

తమిళనాడులోని అరుణాచలం తరహాలోనే శ్రీకాళహస్తి ఆలయంలో ప్రతి పౌర్ణమికీ గిరి ప్రదక్షిణ నిర్వహించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. నూతనంగా నిర్మించిన శ్రీకాళహస్తి గిరిప్రదక్షణ రోడ్డును వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం నుంచి వర్చువల్ గా శుక్రవారం ప్రారంభిస్తూ మొత్తం 22 కిలోమీటర్ల మేర ఈ మార్గాన్ని మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దే ప్రణాళికలు సిద్ధమయ్యాయి. 

శివరాత్రి బ్రహ్మోత్సవాల అనంతరం మార్గం ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ప్రతి భక్తుడికి కైలాసగిరి ప్రదక్షిణ చేసిన ఫలితం లభించాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రంలోని 22 ప్రధాన దేవాలయాలకు రూ.40 కోట్లతో రహదారి సదుపాయాలు కల్పిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఏలూరు జిల్లాలోని ఐ.ఎస్. జగన్నాథపురం లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఘాట్ రహదారి నిర్మాణం చేపట్టినట్లు వివరించారు.

అలాగే కోటప్పకొండ, వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయాలకు కూడా ప్రత్యేక నిధులు కేటాయించినట్లు చెప్పారు. దేవాదాయ శాఖ, పంచాయతీరాజ్ శాఖ సమన్వయంతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. భక్తులకు సౌకర్యాలు పెంపొందించడం ద్వారానే ఆధ్యాత్మిక క్షేత్రాల ప్రతిష్ట పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఆలయాల్లో పాలక మండళ్లు బాధ్యతగా ఉంటే అపచారాలు జరగవని ఆయన స్పష్టం చేశారు.

త ప్రభుత్వ హయాంలో తిరుమలలోనే ఎన్నో అపచారాలు జరిగాయని పేర్కొంటూ నాటి పాలక మండలి బాధ్యతగా వ్యవహరిస్తే తప్పులు జరిగేవి కాదని తెలిపారు.  కూటమి ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ఆలయ పాలక మండళ్లు గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు, అపచారాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భక్తుల విశ్వాసం కాపాడటం పాలక మండళ్ల ప్రధాన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.

“అరుణాచలంలో గిరిప్రదక్షణ చేస్తారు అని తెలుసు. నాకు గిరిప్రదక్షణ చేయాలని చాలా కోరిక ఉంది. దేవాదాయ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి ఆహ్వానం మేరకు, భక్తుల కోరిక మేరకు త్వరలో శ్రీకాళహస్తి క్షేత్రాన్ని సందర్శించి కచ్చితంగా స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటాను” అని తెలిపారు.  కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత దేవాదాయ మంత్రిగా  రామనారాయణ రెడ్డి బాధ్యతలు స్వీకరించాక ఆలయాల పరిరక్షణను ఎంతో బాధ్యతగా ముందుకు తీసుకువెళ్తున్నామని చెప్పారు. 
నిరాదరణకు గురైన ఎన్నో ఆలయాలను అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. భక్తులు కోరుకుంటే ఏజెన్సీలో కూడా ఆలయాలు నిర్మించాలన్న ఆయన గొప్ప సంకల్పానికి కృతజ్ఞతలు తెలిపారు.  రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్ రెడ్డి, ఆరణి శ్రీనివాసులు, దేవాదాయ శాఖ కార్యదర్శి డాక్టర్ హరి జవహర్ లాల్ పాల్గొన్నారు.
 
ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్, సాస్కీ నిధులతో రూ. 40 కోట్లకు పైగా వెచ్చించి సుమారు 22 ప్రధాన దేవాలయాలకు రోడ్డు వసతి కల్పిస్తున్నామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. వాడపల్లి ఏడువారాల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్ధం గోదావరి కరకట్ట వెంబడి రోడ్డు నిర్మాణానికి రూ. 6 కోట్ల సాస్కీ నిధులు మంజూరు చేశామని వివరించారు.