ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్లో బిఎన్‌పి అధినేత తారిక్ రెహమాన్‌ను అభినందించారు. ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో, ప్రధాని మోదీ ఇలా తెలిపారు: “శ్రీ తారిక్ రెహమాన్‌తో మాట్లాడటం ఆనందంగా ఉంది. బంగ్లాదేశ్ ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించినందుకు నేను ఆయనకు అభినందనలు తెలియజేశాను. బంగ్లాదేశ్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి ఆయన చేసిన ప్రయత్నంలో నా శుభాకాంక్షలు, మద్దతును తెలియజేశాను. లోతైన చారిత్రక, సాంస్కృతిక సంబంధాలు కలిగిన రెండు సన్నిహిత పొరుగువారిగా, మన రెండు ప్రజల శాంతి, పురోగతి, శ్రేయస్సు పట్ల భారతదేశపు నిరంతర నిబద్ధతను నేను పునరుద్ఘాటించాను.”
“బంగ్లాదేశ్‌లో పార్లమెంటరీ ఎన్నికల్లో బిఎన్పిని నిర్ణయాత్మక విజయానికి నడిపించినందుకు శ్రీ తారిక్ రెహమాన్‌కు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ విజయం బంగ్లాదేశ్ ప్రజల మీ నాయకత్వంపై నమ్మకాన్ని చూపిస్తుంది. ప్రజాస్వామ్య, ప్రగతిశీల, సమగ్ర బంగ్లాదేశ్‌కు భారతదేశం మద్దతుగా నిలుస్తూనే ఉంటుంది. మన బహుముఖ సంబంధాలను బలోపేతం చేయడానికి, మన ఉమ్మడి అభివృద్ధి లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడానికి మీతో కలిసి పనిచేయడానికి నేను ఎదురు చూస్తున్నాను” అని ప్రధాని మోదీ ఎక్స్ లో పేర్కొన్నారు.
13వ పార్లమెంటరీ ఎన్నికల్లో బిఎన్‌పి అఖండ విజయాన్ని నమోదు చేసింది.తాజా ట్రెండ్స్ ప్రకారం, బిఎన్‌పి 213 సీట్లు గెలుచుకుంది, జమాత్, మిత్రపక్షాలు 71 సీట్లు గెలుచుకున్నాయి.ఇస్లామి ఆండోలోన్ బంగ్లాదేశ్ ఒక సీటును గెలుచుకుంది, ఇతరులు – 6 సీట్లు.
కాగా,బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో హిందూ నేత ఆ దేశ రాజధాని డాకాలో విజయఢంకా మోగించారు. ఢాకా నియోజకవర్గం నుంచి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) అభ్యర్థిగా పోటీ చేసిన గాయేశ్వర్ చంద్ర రాయ్ అనూహ్య విజయాన్ని అందుకున్నారు. జమాత్-ఏ-ఇస్లామీ అభ్యర్థి మహమ్మద్ షాహినూర్ ఇస్లాంపై ఆయన గెలుపొందారు. ఒకవైపు బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై వరుస దాడులు, హత్య ఉదంతాలు వెలుగుచూస్తున్న వేళ ఆ దేశ రాజధాని ఢాకాలోని కీలకమైన ఢాకా-3 నియోజకవర్గం నుంచి గాయేశ్వర్ చంద్ర రాయ్ విజయం సాధించడం గమనార్హం. గాయేశ్వర్ చంద్ర రాయ్‌కు మొత్తం 99,163 ఓట్లు పోలయ్యాయి.
ఇలా ఉండగా, తారిఖ్ రహమాన్ బంగ్లా మాజీ ప్రధాని ఖాలిదా జియా తనయుడు. ఆమె అధికారంలో ఉన్న 2002-2006 కాలంలో రహమాన్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించి, అవినీతికి పాల్పడ్డాడని ఆరోపణలొచ్చాయి. దీంతో తన తల్లి ప్రభుత్వం కూలిపోయిన తర్వాత అతడిపై అవినీతి ఆరోపణలు రావడంతో 2007లో అప్పటి ప్రభుత్వం అరెస్టు చేసింది. 17 నెలలు జైలులో ఉన్నాడు. తర్వాత దేశ బహిష్కరణకు గురి కావడంతో బ్రిటన్ వెళ్లిపోయారు.
తన తల్లి మరణంతో 17 ఏళ్ల తర్వాత గత ఏడాది డిసెంబర్లో బంగ్లాదేశ్ తిరిగొచ్చాడు. ఈ సందర్భంగా అతడికి ఘన స్వాగతం లభించింది. ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తన తల్లి మరణం తర్వాత ఆయన ఆ పార్టీ బాధ్యతలు చేపట్టారు. గురువారం జరిగిన ఎన్నికల్లో పాల్గొని విజయం సాధించారు. తన పార్టీని విజయపథంలో నడిపించారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత బీఎన్పీ అధికారంలోకి వచ్చింది. డార్క్ ప్రిన్స్‌గా పిలిచే అతడు తన తల్లి ప్రధానిగా ఉన్నప్పుడు షాడో పీఎంగా వ్యవహరించారు.
More Stories
దేశీయ స్టాక్ మార్కెట్లలో రూ.31 లక్షల కోట్లు సంపద ఆవిరి
పశ్చిమాసియాలో పరిణామాలు ఆందోళనకరం
ఇరాన్‌పై గ్రౌండ్ ఆపరేషన్ కు ట్రంప్ సమాలోచనలు