“పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడు విజయ్ మాల్యా మొదట భారత్కు తిరిగి రావాలి. ఆ తర్వాత మేము వెంటనే అతని పిటిషన్ను విచారించడం ప్రారంభిస్తాం. మాల్యా తిరిగి రాకపోతే మేము ఈ పిటిషన్ను ఎందుకు విచారించాలి? దీని వల్ల ఏమి సాధిస్తాం.” అని బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రశేఖర్, జస్టిస్ గౌతమ్ అంఖద్లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.
అలాగే మాల్యా విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా అదే వైఖరిని తీసుకుంది. విజయ్ మాల్యా భారత్కు తిరిగి రావాలని కోరుతున్నామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హైకోర్టుకు తెలిపారు. మాల్యా అభిప్రాయాలు ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నామని పేర్కొన్నారు. మాల్యా రుణాలు తీసుకున్నట్లు ఒప్పుకున్నారని, ఆ రుణాలను అతను ఎప్పుడు, ఎలా తిరిగి చెల్లిస్తారో వంటి విషయాలను తెలియజేయాలని కోరారు. మాల్యా అభిప్రాయాలను తాము వినడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
మాల్యా తరఫున హైకోర్టుకు హాజరైన సీనియర్ న్యాయవాది అమిత్ దేశాయ్ తన క్లయింట్ ప్రస్తుతం లండన్లో ఉన్నారని కోర్టుకు తెలియజేశారు. పిటిషనర్ భౌతికంగా హాజరు కాకుండానే ఇటువంటి పిటిషన్లపై గతంలో విచారణలు జరిగాయని కోర్టుకు గుర్తు చేశారు.
“మా క్లయింట్ విజయ్ మాల్యా తన ఆస్తులను అమ్మడం ద్వారా అప్పులకు వడ్డీని చెల్లించవచ్చు. కానీ ఆయన అన్ని ఖాతాలు, ఆస్తులు దర్యాప్తు సంస్థ అదుపులో ఉన్నందున నిస్సహాయంగా ఉండిపోయాం. అందువల్ల మా అభిప్రాయాలను వినాలని కోరుతూ మేము మరొక పిటిషన్ దాఖలు చేశాం. అది హైకోర్టులో పెండింగ్లో ఉంది.” అని అమిత్ దేశాయ్ బంబే హైకోర్టుకు తెలిపారు.
అయితే బాంబే హైకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలతో ఏకీభవించలేదు. ఆర్థిక మోసాల కారణంగా విదేశాలకు పారిపోయిన వారు ఇక్కడ పిటిషన్ వేయకూడదని పేర్కొంది. మాల్యా ఎప్పుడు భారత్కు వస్తున్నారో ముందు తమకు చెప్పాలని, అప్పుడే పిటిషన్ను పరిశీలిస్తామని స్పష్టం చేసింది. ఈ విషయంపై మాల్యా నుంచి సంతృప్తికరమైన సమాధానం వచ్చే వరకు ఎటువంటి చట్టపరమైన ప్రక్రియను నిలిపివేయబోమని తెలిపింది. విజయ్ మాల్యాను యూకే నుంచి ఇండియాకు తీసుకువచ్చే ప్రక్రియ చివరి దశలో ఉందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బాంబే హైకోర్టుకు తెలిపారు.
అందువల్ల బ్రిటిష్ కోర్టుల్లో ఈ చట్టపరమైన ప్రక్రియను మాల్యా దుర్వినియోగం చేసే అవకాశం ఉందని, అందుకే ఆయన దాఖలు చేసిన ఈ పిటిషన్ను కొట్టివేయాలని కేంద్రం తరఫున కోరారు. “అతను (మాల్యా) ముందు భారత్కు రావాలి. ఆ తర్వాత లోన్లు చెల్లించాల్సిన బాధ్యత ఆయనపై ఉందా లేదా అనేది తెలుస్తుంది. మాల్యా దేశ చట్టాన్ని విశ్వసించట్లేదు.” అని తుషార్ మోహతా వ్యాఖ్యానించారు.

More Stories
అఖండ విజయం దిశగా దూసుకుపోతున్న బిఎన్పి
రాహుల్ సభ్యత్వం రద్దు చేయాలని బిజెపి ఎంపీ తీర్మానం
కేరళలో మైనారిటీ సమస్యపై ఒకే విధంగా సిపిఎం, బిజెపి?