ఏపీ మద్యం కుంభకోణం కీలక సూత్రధారి రాజ్ కసిరెడ్డి

ఏపీ మద్యం కుంభకోణం కీలక సూత్రధారి రాజ్ కసిరెడ్డి
* బెయిల్ పిటిషన్ ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

ఏపీ మద్యం కుంభకోణం కేసులో మొత్తం వ్యవహారానికి ఆర్కిటెక్ట్ రాజ్ కసిరెడ్డి అని సుప్రీంకోర్టు కీలక వాఖ్యలు చేసింది. ఏపీ మద్యం కుంభకోణం చాలా పెద్దదని సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ వ్యాఖ్యానించారు. అధికారులు కుమ్మక్కు కాకపోతే ఇలాంటి పెద్ద స్కామ్‌లు జరగవని, కుమ్మక్కైన అధికారులను అరెస్టు చేయకపోవడం దురదృష్టకరమని సీజేఐ పెర్కోన్నారు. కసిరెడ్డి తరఫు న్యాయవాది వాదిస్తూ కసిరెడ్డి ప్రభుత్వానికి సలహాదారు మాత్రనేనని చెప్పడాన్ని సీజేఐ ధర్మాసనం తోసిపుచ్చింది.

పదవిలో ఉన్నవారి అండ లేకుంటే అధికారులు ఇలా చేయలేదని, ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రదారుడు రాజ్​కెసిరెడ్డేనని ధర్మాసనం తేల్చి చెప్పింది.  ఇప్పటికే 10 నెలలుగా కెసిరెడ్డి జైలులో ఉన్నారని, సప్లిమెంటరీ ఛార్డిషీట్లు కూడా దాఖలు చేశామని ఆయన తరఫు న్యాయవాది తెలపగా, ఏం కాదు మరికొంతకాలం జైలులో ఉండనీయండని సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ పేర్కొన్నారు. కెసిరెడ్డికి రెగ్యులర్ బెయిల్ ఇచ్చేది లేదంటూ రాజ్‌ కసిరెడ్డి పిటిషన్‌ను డిస్మిస్‌ చేసేందుకు సీజేఐ ధర్మాసనం సిద్ధమైంది. 

ఈ నేపథ్యంలో పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని రాజ్‌ కసిరెడ్డి తరపు న్యాయవాది తెలిపారు. దీంతో రాజ్‌ కెసిరెడ్డి పిటిషన్‌ను ఉపసంహరించుకోవడానికి ధర్మాసనం అనుమతించింది. వైఎస్సార్సీపీ సర్కార్​లో జరిగిన మద్యం కుంభకోణంలో నాటి ప్రభుత్వ పెద్దల తరఫున అన్ని తానై కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి (రాజ్‌ కసిరెడ్డి) కీలక పాత్రధారిగా వ్యవహరించారు. 

2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్‌ మోహన్​రెడ్డితో కలిసి పని చేసిన ఆయన వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఐటీ సలహాదారుగా నియమితులయ్యారు. ఆ పదవిలో ఉంటూనే తెర వెనుక లిక్కర్ స్కాంలో కీలక పాత్ర పోషించారు. అప్పట్లో ప్రభుత్వమే నిర్వహించిన మద్యం షాపులకు జే బ్రాండ్ల మద్యం సరఫరాలో ఈయన ఆదేశాలు కీలకంగా పని చేశాయి.

కమీషన్లు చెల్లించిన కంపెనీల నుంచి ప్రతి నెలా రూ.60 కోట్లకు తగ్గకుండా వసూలు చేసి దాదాపు రూ.3500 కోట్లపైనే కొల్లగొట్టినట్లు సిట్ తేల్చింది. లంచాల నెట్‌వర్క్‌ను రూపొందించడంతో పాటు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పేరున్న ఓ నేతతో కలసి హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో ప్రత్యేకంగా కార్యాలయమే ఏర్పాటు చేసి దందా నిర్వహించినట్లు ఆధారాలు లభించాయి. ఏ మద్యం కంపెనీ నుంచి ఎంత సరుకు కొనుగోలు చేయాలో ఏ రోజు, ఏ బ్రాండ్లు ఎంత మేరకు విక్రయించాలో రాజ్‌ కెసిరెడ్డే నిర్ణయించేవారని సిట్ నిర్ధారించింది.