దృష్టి లోపం ఉన్నవారి కోసం ఏఐ  స్మార్ట్ గ్లాసెస్

దృష్టి లోపం ఉన్నవారి కోసం ఏఐ  స్మార్ట్ గ్లాసెస్

* బెంగళూరు వైద్యుల నూతన ఆవిష్కరణ

బెంగళూరు వైద్య నిపుణులు అంధులు, దృష్టి లోపం ఉన్నవారి కోసం ఏఐ సాయంతో పనిచేసే ‘స్మార్ట్ విజన్ అల్ట్రా గ్లాసెస్’ను రూపొందించారు. ఇవి ముందున్న వ్యక్తులు, వస్తువులను గుర్తించడమే కాకుండా నావిగేట్ చేయడానికి సహాయపడుతాయి. అంతేకాకుండా 18 భారతీయ భాషల్లో చదవగలుగుతాయి. ఫలితంగా అంధత్వం ఉన్నవారు ఎవరి సాయం లేకుండా స్వయంగా పనులు చేసుకునేందుకు దోహదపడతున్నాయి.

బెంగళూరులోని నారాయణ నేత్రాలయ, ఎస్హెచ్జీ టెక్నాలజీస్ సంయుక్తంగా ఈ స్మార్ట్ విజన్ గ్లాసెస్ ను రూపొందించారు. ఇవి చూడటానికి సాధారణ కళ్లజోడులాగే కనిపిస్తాయి. కానీ, కంటి చూపు లేనివారికి మాత్రం ఇవి మార్గనిర్దేశకంగా నిలిచే గైడ్ మాదిరిగా పనిచేస్తాయి. 

మార్కెట్‌లో అందుబాటులో ఉన్న సాధారణ స్మార్ట్ గ్లాసెస్ మాదిరిగా కాకుండా, ఈ పరికరం ప్రత్యేకంగా దృష్టి తక్కువగా ఉన్నవారికి లేదా పూర్తి అంధత్వం ఉన్నవారి కోసం రూపొందించామని డాక్టర్  డానిష్ వివరించారు. తమ బడ్స్ టు బ్లాసమ్స్ క్లినిక్ సుమారు పదేళ్లుగా అంధత్వం, నాడీ సంబంధిత ఆరోగ్య సమస్యలు ఉన్న పిల్లలు, పెద్దలకు చికిత్స చేస్తోందని ఆయన తెలిపారు. 

ఈ క్రమంలో శారీరకంగా దివ్యాంగులైన అనేక మంది చిన్నారులకు మల్టీడిసిప్లినరీ థెరపీల ద్వారా, అందరిలా వారూ పాఠశాలలకు వెళ్లేందుకు ఇది సహాయపడిందని వైద్యుడు మహమ్మద్ డానిష్ వివరించారు. సుదీర్ఘ క్లినికల్ అనుభవమే ఈ రకమైన ఆవిష్కరణకు పునాది వేసిందని తెలిపారు.

“దృష్టి లోపం ఉన్నవారి కోసం కొన్ని సంవత్సరాలుగా చేసిన కృషి ఫలితమే ఈ స్మార్ట్ పరికరం. ఇది ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా పనిచేస్తుంది. వీటిని ధరించిన వారికి ముందున్న వ్యక్తులు, వస్తువులు, అడ్డంకులను గుర్తించగలదు. అంతేకాకుండా మన దేశంలోని ప్రముఖ భాషలన్నీ చదవుతుంది. వాటిని అవసరమైన విధంగా అనువాదం కూడా చేస్తుంది” అని డా. డానిష్ వివరించారు.

ఈ స్మార్ట్ గ్లాసెస్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ (లైడార్) సెన్సార్ పరిసరాలను స్కాన్ చేస్తుంది. వాటిని ప్రైవేట్ బ్లూటూత్ స్పీకర్ ద్వారా వాటిని ధరించిన వారికి వివరిస్తుంది. ఇవి రంగులను గుర్తించడంతో పాటు మెట్రో స్టేషన్ల వంటి బహిరంగ ప్రదేశాల్లోని సైన్‌బోర్డ్‌లను కూడా చదువుతాయి.  అంతేకాకుండా చేతితో రాసిన ప్రిస్క్రిప్షన్‌లు లేదా నోట్ పుస్తకాలను కూడా చదవగలవు. ఇందులో అత్యవసర కాలింగ్ ఫీచర్ సిస్టమ్ కూడా ఉంది.

దీన్ని యాక్టివేట్ చేసినప్పుడు లొకేషన్, చివరిగా మాట్లాడిన పదాలు, ఇమేజ్లను నిర్దేశించిన కాంటాక్టులకు పంపిస్తాయి. ఈ స్మార్ట్ విజన్ గ్లాసెస్ అల్ట్రా ధర జీఎస్టీతో సహా దాదాపు రూ. 46,000గా నిర్ణయించారు తయారీదారులు. ఇవి చాలా ఖరీదైన ఆర్కామ్, ఇన్విజియన్ గ్లాసెస్లకు ప్రత్యామ్నాయంగా రూపొందించారు. కానీ గ్రామీణ, అల్పాదాయ నేపథ్యాల నుంచి వచ్చిన రోగులు వీటిని కొనుగోలు చేయాలంటే కాస్త ఆందోళన చెందుతున్నారని డాక్టర్ డానిష్ అభిప్రాయపడ్డారు. 

“దీని కోసం మా కౌన్సెలర్లు అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాల గురించి కూడా రోగులకు మార్గనిర్దేశం చేస్తారు. ఫలితంగా పథకాలకు అర్హులై, పరికరాలను కొనుగోలు చేయలేని వారికి ఉచితంగా అందించవచ్చు” అని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్లో రానున్న వెర్షన్లలో బ్యాటరీ లైఫ్, కెమెరా నాణ్యత, కాస్మెటిక్ డిజైన్‌ను మెరుగుపరిచేందుకు భావిస్తున్నామని డాక్టర్ డానిష్ తెలిపారు.

“ఇతరుల దృష్టిని ఆకర్షించకుండా, సాధారణ కళ్లద్దాలా కనిపించేలా వీటిని తయారు చేయడం. దీనివల్ల వినియోగదారులు వీటిని ధరించిన వారు బహిరంగ ప్రదేశాలకు వెళ్లడానికి ఎటువంటి సంకోచం లేకుండా సౌకర్యవంతంగా ఫీల్ అవుతారు” అని డాక్టర్ మహమ్మద్ డేనిష్ స్పష్టం చేశారు.